శుక్రవారం 05 జూన్ 2020
Narayanpet - Jan 14, 2020 , 02:41:39

మహిమాన్వితం.. ఉమామహేశ్వర క్షేత్రం

మహిమాన్వితం..  ఉమామహేశ్వర క్షేత్రం


అచ్చంపేట రూరల్‌: పురాణ ప్రసిద్ధి గాంచిన శ్రీశైల క్షేత్రమునకు ఉత్తర ద్వారముగా ఉమాశక్తి పీఠంగా ఉమామహేశ్వర స్వామి దేవస్థానము ప్రసిద్ధిగాంచినది. శ్రీరాముడు రావణసుర వధానంతరము శ్రీశైల ప్రదక్షిణము క్షేత్రము నుంచే ప్రారంభించినట్లు శ్రీశైల పురాణము చెబుతుంది. ఉమామహేశ్వర క్షేత్రము పవిత్ర ప్రసిద్ధ క్షేత్రమైన రెండో శ్రీశైలముగా పిలవబడుతుంది.

భోగమహేశ్వరము

ఉమామహేశ్వరము కొండ కింద స్థలానికి భోగ మహేశ్వరము అని పేరు. పూర్వం యాత్రికులు కొండ పైకి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని తిరిగి కొండ కిందకు వచ్చి వంటలు చేసుకునేవారు. అప్పుడు ఇక్కడ ఒక గ్రామము కూడా ఉన్నది. కానీ ప్రస్తుతం అరణ్యం తప్ప ఊరు కానరాదు. క్రీ.శ. 1280లో కరణం రామయ్య భోగమహేశ్వరములో కాకతీయ రుద్రమదేవి పేర చలమర్తి గండరుద్రేశ్వర ప్రతిష్ట చేశారు. అప్పుడాయన భార్యలు మల్లసాని అమరనాథ దేవర, చెన్న సోమనాథ దేవర, చెన్న మల్లనాథ, సోమేశ్వర దేవరల పేర 5గదులు నిర్మించి లింగ ప్రతిష్ఠ చేయించాడు. నేడు ఆ ద్వారాలు శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన దేవలయ నిర్మాణం, విగ్రహాల (లింగాలు)ను ప్రతిష్ఠించేందుకు సిద్ధంగా ఉంది.

ఉమామహేశ్వరము-క్షేత్రాభివృద్ధి

శ్రీ ఉమామహేశ్వరము క్షేత్రాబివృద్ది నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని రంగాపూర్‌ గ్రామ నివాసి మర్యాద గోపాల్‌రెడ్డి 1954 నుంచి నిరంతర కృషితో శిథిలావస్థ దశలో ఉన్న క్షేత్రమును నేడు దివ్య సుందర క్షేత్రముగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడినప్పటి నుంచి క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతూ పలువురి నుంచి ప్రశంసలు పొందుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శైవ క్షేత్రాల అభివృద్ది కోసం ప్రత్యేక దృష్టి పెట్టడంతో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే భోగమహేశ్వరం నుండి ఉమామహేశ్వరం వరకు భక్తుల సౌకర్యార్థం నూతనంగా రాతి మెట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు సెక్యూరిటీ గదులు, సేద తీరేందుకు ప్రత్యేక గదులు, మహిళలకు దుస్తులు మర్చుకునే గదులు మొదలైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.

నేటి నుంచి ఉత్సవాలు

ప్రతి ఏడాది జనవరి 15 నుంచి 22 వరకు ఈ ఉమామహేశ్వర క్షేత్రములో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. 15 రాత్రికి 9 గ్రామాల నుండి ప్రభోత్సవము, పల్లకీసేవ 16తెల్లవారుజామున పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, 17న ప్రాతరౌపాసన, బలిహరణము 18న కుంకుమార్చన, రుద్రాభిషేకము, హోమము 19న ధ్వజారోహణము, త్రిశూల స్నానం మొదలైన  పూజలను నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎక్కడ ఉంది

ఉమామహేశ్వర క్షేత్రము నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణం నుంచి 13 కిలో మీటర్ల దూరంలో కలదు. ఈ క్షేత్రమునకు రేపటి నుంచి ఉత్సవాలు పూర్తయ్యే వరకు అచ్చంపేట ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపిస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్‌రావు గుర్తు చేశారు.

బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

రేపటి నుంచి ప్రారంభమయ్యే ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సవాల కోసం భక్తుల కు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అడుగడుగునా తాగునీటి వసతి, భక్తులకు అందుబాటులో వైద్యం, భోగమహేశ్వరం నుండి కొండ పైకి 8 మినీ బస్సుల ను ఏర్పాటు చేశాం. భక్తుల క్షేమం, సహకారం కోసం వాలంటీర్స్‌, పోలీసుల సేవలు, పార్కింగ్‌ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశాం. కావునా ఉమామహేశ్వరం వచ్చే ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
- కందూరి సుధాకర్‌, దేవస్థాన చైర్మెన్‌


logo