ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 12, 2020 , 05:35:55

ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం

ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం


ఉండవెల్లి : ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం సవాలు విసిరారు. మండలంలోని అలంపూర్‌ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలతో కలిసి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ అలంపూర్‌ నియోజక వర్గంలో బడుగు, బలహిన వర్గాల ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండటంతో రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి అసత్య ఆరోపణ కథనాలు ప్రచారం చేసిన సదరు మీడియాపై కేసుతో పాటు పరువునష్టం దావా వేస్తానన్నారు. 12 సంత్సరాలు విదేశాలల్లో వైద్యం అందించి ఉన్నత పేరు సంపాదించుకున్నానని చెప్పారు. పుట్టి, పెరిగిన అలంపూర్‌ నియోజక వర్గ ప్రజలకు వైద్యాన్ని అందించేందుకు కర్నూలుకు వచ్చి వైద్యసేవలు అందించిన్నట్లు ఎమ్మెల్యే వివరించారు. నా కూతురు, అల్లుడూ విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఎవరో ఇచ్చే కమిషన్‌లకు, పార్టీ బీఫాంలు అమ్ముకునే వ్యక్తిని కానని, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మాత్రమే పని చేస్తున్నానన్నారు. తనపై ఇలాంటి ఆరోపణలు చేసే వ్యక్తులకు ప్రజలు మున్సిపల్‌ ఎన్నికలలో తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు.

ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ బీఫాంలు ఎవరికీ పంపిణీ చేయలేదన్నారు. ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నందుకే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించారని ఎమ్మెల్యే అన్నా రు. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే ఎవరికైనా కోటి రూపాయల నజరానాతో పాటు రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే సవాలు విసిరారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ నియోజక వర్గంలో ఎమ్మెల్యే అబ్రహం చేస్తున్న అభివృద్ధిని చూసి కొంత మంది అసత్య వార్తా కథనాలను ప్రచారం చేయిస్తున్నారన్నారు. కొంత మంది ప్రజాప్రతినిధులు అడ్డదారుల్లో, దొడ్డిదారుల్లో మున్సిపల్‌ ఎన్నికల్లో పాగా వేసేందుకు మీడియాలో అసత్య వార్తా కథనాలను ప్రచారం చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల్లో నాలుగుకు నాలుగు సీట్లు సాధిస్తామని అన్నారు.
అనంతరం వడ్డేపల్లి శీను, ఖంగనాథ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, పల్లెపాడు శంకర్‌రెడ్డిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే అబ్రహంతో తమకు ఎలాంటి విబేధాలు లేవన్నారు. నిత్యం నియోజక వర్గ అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేస్తున్నట్లు వివరించారు.

VIDEOS

logo