e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home నల్గొండ కృష్ణా జలాల్లో ఒక్క బొట్టునూ వదులుకోం

కృష్ణా జలాల్లో ఒక్క బొట్టునూ వదులుకోం

  • నల్లగొండ జడ్పీ సర్వసభ్య సమావేశంలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్లగొండ, జులై 24 : కృష్ణా జలాల్లో ఒక్క నీటి బొట్టునూ వదులుకోబోమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా పరిషత్‌లో చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొదటగా సభలో ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కార మార్గాలను మంత్రితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు , అధికారులు సూచించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. గత పాలకులు గోదావరిపై ప్రాజెక్టులు కట్టలేదని కృష్ణాపై కట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా ఆంధ్రా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే నిర్మించారని అన్నారు. మనకు ప్రాజెక్టులు కావాలని అడిగితే స్వల్పంగా నిధులు కేటాయించి వాటిని ఏడాదిపాటు ఖర్చు చేయకుండా ఉంచి మళ్లీ ఆ నిధులను ఆంధ్రాకే వినియోగించారని తెలిపారు. దీని ఫలితంగానే మహబూబ్‌నగర్‌ నాశనమై 14లక్షల మంది వలసలు వెళ్లారని.. నల్లగొండ ఎడారిగా మారి తాగునీటికి కూడా నోచుకోలేదని అన్నారు. గోదావరి నదిపై అనుమతులు తెచ్చుకుని ప్రాజెక్టులు కట్టుకున్నామని, కృష్ణాపై కట్టడానికి ఆంధ్రా పాలకులు నిరాకరించారని పేర్కొన్నారు. ఆంధ్రా ప్రభుత్వం రాయల సీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పేరుతో ప్రాజెక్టు నిర్మాణం చేస్తుందని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ పూర్తిస్థాయి దృష్టి పెట్టినందున మనకు నష్టం జరుగదని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు సంబంధించిన టన్నెల్‌ పనులు నీరు వస్తుండడంతో ఆలస్యమవుతున్నాయని తెలిపారు. త్వరలో నల్లగొండకు గోదావరి జలాలు వస్తాయని చివరిభూములకు నీళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అన్ని కాల్వలకు లైనింగ్‌ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పలు సమస్యలపై సభ్యుల ప్రశ్నలు
జడ్పీటీసీ సభ్యులకు మండల పరిషత్‌లో గదులు ఇవ్వవద్దని ఎంపీపీలు… ఇవ్వాలని జడ్పీటీసీలు కాసేపు వాగ్వాదం చేసుకోగా వారికి ఇవ్వకుంటే ఎక్కడపోతారని ఎంపీ కోమటిరెడ్డి, జడ్పీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి అనడంతో వివాదం సద్దుమనిగింది. అనంతరం పలు తీర్మానాలు చేశారు. చైర్మన్‌ బండాఎమ్మెల్యేలతో కలిసి మొక్కలు నాటారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. జడ్పీ సమావేశంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, తుంగతుర్తి, నకిరేకల్‌ శాసన సభ్యులు గాదరి కిశోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి పాల్గొన్నారు.

- Advertisement -

అధికారులు ప్రొటోకాల్‌ పాటించాలి
కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అధికారులు ప్రొటోకాల్‌ తప్పనిసరిగా పాటించాలి. రాయల సీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో పోరాటం చేస్తాం. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను తర్వగా పూర్తిచేయాలి.

  • కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ

ధాన్యాన్ని లిఫ్ట్‌ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం
యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు సకాలంలో లిఫ్ట్‌ చేయక పోవడంతో రైతులు చాలా నష్టపోయారు. సరిగ్గా పనిచేయని వారికి ఎందుకు టెండర్‌ ఇవ్వాలి. ఈ సారి అలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి.

  • బండా నరేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌

మనకు నష్టం జరుగదు
కృష్ణా జలాల విషయంలో మనకు ఏమాత్రమూ నష్టం జరుగదు. సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. నీటి వినియోగంపై ముఖ్యమంత్రికి పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో రాజీ పడే ప్రసక్తే లేదు. కేంద్రం విడుదల చేసిన గెజిట్‌తో మనకు నష్టం జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇక హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు రైల్వే లైన్‌ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినం. బుల్లెట్‌ ట్రైన్‌ ఇవ్వాలని అడిగాం.

  • బడుగుల లింగయ్య, రాజ్యసభ సభ్యుడు

ప్రతిపాదనలు ఇవ్వండి
జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి పెండింగ్‌ పనులు ఉంటే ప్రతిపాదనలు ఇస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తా. పీఎంజీఎస్‌వై పనులకు కూడా నిధులు మంజూరు చేయిస్తా. కేంద్రం కృష్ణాబోర్డు ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్‌లో తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.

  • ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ

రైతుల్లో అవగాహన పెంచాలి
ప్రతిసారి రైతులు పత్తి, వరి సాగు చేసినప్పుడు దిగుబడి పెద్దగా రావడం లేదు. దీనిపై వారికి వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలి. జిల్లా వ్యాప్తంగా ఎడమ కాల్వ, డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌, మూసీ, ఏఎమార్పీ ద్వారా 10.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగం లేదు. నీటి వృథాను అరికట్టాలి.

  • తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్సీ

అధ్వాన్నంగా మల్లేపల్లి -దేవరకొండ రోడ్డు
మల్లేపల్లి- దేవరకొండ రోడ్డు అధ్వాన్నంగా ఉంది. ప్రయాణికులు కిందపడి గాయాలపాలవుతున్నారు. కొంతమంది చనిపోయారు. ఆ పనులను వెంటనే ప్రారంభించండి. మత్స్య శాఖలో విధి నిర్వహణలో ఉండి చనిపోయిన వారికి ఇప్పటివరకు ఎక్స్‌గ్రేషియా రాలేదు.

  • రవీంద్రకుమార్‌, ఎమ్మెల్యే, దేవరకొండ

ప్రతిపాదనలు పంపకపోతే ఎలా?
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్ల విషయంలో ఎమ్మెల్యేలు పంపిన ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపకపోతే ఎలా పనులు జరుగుతాయి. సూర్యాపేట, మిర్యాలగూడ వయా భీమారం రోడ్డు పనులు ఎప్పుడు పూర్తి అవుతాయి. అడవిదేవులపల్లి రోడ్డు గురించి పట్టించుకునే పరిస్థితే లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సీఆర్‌ఎఫ్‌ ప్రతిపాదనలు కనీసం ఎంపీలకైనా పంపండి.

  • భాస్కర్‌రావు, ఎమ్మెల్యే, మిర్యాలగూడ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana