నల్లగొండ సిటీ జూన్ 26 : విద్యుత్ శాఖలో బదిలీలకు యాజమాన్యం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021-2022 సంవత్సరానికి బదిలీల మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులో ఈనెల 30 నాటికి మూడేళ్ల సర్వీసు పూర్తయ్యే అధికారులు, ఉద్యోగులకు స్థానచలనం కలుగనుంది. దీంతో పాటు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వారు చేసుకున్న వినతి మేరకు, లేదంటే పరస్పర అంగీకారంతో బదిలీ చేస్తారు.
వేర్వేరుగా మార్గదర్శకాలు
విద్యుత్ శాఖలో రెగ్యులర్, ఆర్టిజన్ ఉద్యోగులకు వేర్వేరుగా బదిలీ మార్గదర్శకాలు విడుదల చేశారు. సబ్‌ఇంజినీర్లు మొదలు సర్కిల్ పరిధిలోని అకౌంట్స్ స్టాఫ్, జూనియర్ ఆకౌంట్స్ ఆఫీసర్ వరకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో ఫోర్‌మెన్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ పోస్టుల వరకు ఆయా సర్కిళ్ల సూపరిండెంటెంట్ ఇంజినీర్లు బదిలీ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగుల బదిలీలు డివిజనల్ ఇంజినీర్లు చేపడతారు.
ఆర్టిజన్లకు కూడా..
గ్రేడ్- 1,2,3,4 ఆర్టిజన్ ఉద్యోగుల్లో కూడా మూడేళ్ల సర్వీసు పూర్తయిన వారికి స్థానచలనం కలుగనున్నది. సీనియారిటీ ఆధారంగా 50 శాతం మందిని మాత్రమే బదిలీ చేస్తారు. ఆశాఖ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లను జిల్లాల వారీగా సర్కిల్ పరిధిలోని సర్కిల్ కార్యాలయం ఎంఆర్టీ స్టోర్, సివిల్ డీపీఈ విభాగాల్లో పని చేస్తున్న వారిని కలిపి ఒక యూనిట్‌గా చేస్తారు. అనంతరం వీరికి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్లు బదిలీల ప్రక్రియ నిర్వహిస్తారు. డివిజన్లో పని చేస్తున్న వివిధ గ్రేడ్ల ఆర్టిజన్లు, సబ్‌స్టేషన్ ఆపరేటర్లన్లు, డివిజన్లో పనిచేస్తున్న వివిధ గ్రేడ్ల ఆర్టిజన్లను, సబ్‌స్టేషన్ ఆపరేటర్లను అదే డివిజన్లో బదిలీ చేయనున్నారు. డివిజన్ కార్యాలయం సెక్షన్ ఆఫీస్ కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్న ఆర్టిజన్ల బదిలీలను డివిజనల్ ఇంజినీర్ ఆధ్వర్యంలో చేపడతారు.
షెడ్యూల్ ఇలా..
బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన యాజమాన్యం షెడ్యూల్ కూడా వెల్లడించింది. ఈ నెల 29న సాయంత్రం 4.30 గంటలకు మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులు, ఉద్యోగుల జాబితాను సర్కిళ్లు, డివిజన్ కార్యాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు వచ్చే నెల 3వరకు స్వీకరిస్తారు. జూలై 9న బదిలీ దరఖాస్తులు సమర్పిస్తే 13న ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. బదిలీ ఉద్యోగులు 17లోపు తమ పోస్టు నుంచి రిలీవ్ కావాల్సి ఉంటుంది.