e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home నల్గొండ లగ్గం ఖర్చుకు పగ్గాలు

లగ్గం ఖర్చుకు పగ్గాలు

  • పెండ్లింట తగ్గిన ఆడంబరం
  • కరోనా పరిస్థితుల్లో సాదాసీదాగా తతంగం
  • ఇరు కుటుంబాలకు భారీగా తప్పుతున్న ఖర్చులు, అప్పులు
లగ్గం ఖర్చుకు పగ్గాలు

కరోనా కారణంగా పెండ్లి ఖర్చులు భారీగా తగ్గిపోయినా.. వాటిపైనే ఆధారపడి ఉపాధి పొందే వారికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈవెంట్స్‌ నిర్వహణ, డీజే, పటాకుల ఖర్చులు లేకపోగా పనివాళ్ల అవసరం కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. సెంకడ్‌ వేవ్‌కు ముందే ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్న వారు మాత్రమే నిరాడంబరంగా వివాహాలు పూర్తిచేశారు. నేటి నుంచి లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో ఎత్తివేసినా ఇప్పటికిప్పుడే పెళ్లిళ్లలో హంగామా ఉంటుందనే గ్యారంటీ లేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ భయం ఇంకా ప్రజల్లో నెలకొని ఉంది. దీంతో మరికొద్ది రోజులు కూడా ఆడంబరాలకు దూరంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నల్లగొండ ప్రతినిధి, జూన్‌ 19 (నమస్తే తెలంగాణ) : లక్షలకు లక్షలు ఖర్చు చేసి అత్యంత వైభవంగా జరుపుకునే పెళ్లిళ్లు ప్రస్తుతం చాలా సాదాసీదాగా జరిగిపోతున్నాయి. అమ్మాయి, అబ్బాయిని ఓ ఇంటి వాళ్లను చేస్తే చాలు.. మిగతా హంగామా అక్కర్లేదు అన్నట్లుగా మ.మ. అనిపిస్తున్నారు. సాధారణంగా పెళ్లంటే నిశ్చితార్థం మొదలుకొని పదహారొద్దుల పండుగ దాకా జరిగే సందడి అంతా ఇంతా కాదు. పెళ్లి చూపులకు ఇరవై, ముప్పై మంది… ఎంగేజ్‌మెంట్‌ పేరుతో ఇరువైపులా ముఖ్యలంతా కలిపి వంద రెండొందల మంది… ఇక పెళ్లి రోజున బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు కలిపి కనీసం ఐదు వందలు మొదలుకొని నాలుగైదు వేల వరకు కూడా హాజరవుతుంటారు. ఆ తర్వాత రిసెప్షన్‌ పేరుతో చిన్నవిందులు, పదహారొద్దుల పండుగ పేరుతో మరోసారి ముఖ్యులు హాజరయ్యేవారు. పెళ్లి కోసం తీసుకునే పట్టువస్ర్తాలు, ఆభరణాల కోసం భారీగానే ఖర్చే చేసేవారు. ఇక పెళ్లి కార్డులు కూడా గ్రాండ్‌గా ఉండాలని భావిస్తూ… ఒక్కో కార్డుకు రెండుమూడు వందల వరకూ ఖర్చు చేసేవారూ ఉన్నారు. ఇక రంగురంగుల పూలు, సంప్రదాయ ఆకారాలు, విభిన్నరీతులతో కూడిన మండపాలకు కూడా భారీగా ఖర్చు చేస్తుండేవారు. భోజనాల విషయంలో ఎంత సామాన్యుడైనా సరే మటన్‌, చికెన్‌తో అదరగొట్టేవారు. వంటకాలు ఎన్ని వెరైటీలు పెడితే అంత గొప్పగా పెళ్లి చేసినట్లుగా భావించేవారు. ఇక ఎంగేజ్‌మెంట్‌ నుంచి రిసెప్షన్‌ వరకు ప్రతి ఒక్కటీ ఫోటో షూట్‌ చేయిస్తారు.

- Advertisement -

ఇందుకోసం కూడా కనీసం రూ.30వేలు మొదలుకొని ముప్పై లక్షల దాకా ఖర్చు చేసేవారూ ఉన్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా వీఐపీలను ఆహ్వానించి వారితో హడావుడి చేసేవారు. మొత్తంగా పెళ్లంటే తమ ఆర్థిక, సామాజిక దర్పానికి ప్రతీకగా భావిస్తూ అంగరంగవైభవంగా జరిపించేవారు. కానీ, కరోనా వీటన్నింటినీ బ్రేక్‌ చేసింది. ఎక్కువ జనం గుమికూడే చోట, జనసమూహాలున్న చోట కరోనా విజృంభిస్తుండడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు షరతులు విధించారు. కేవలం నలభై మందికి మించకుండా జరిపించాలని నిర్ధేశించారు. దీనికి తోడు మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి చేశారు. పెళ్లి కొడుకు, కూతురు సహా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించక తప్పడం లేదు. ఇక ఎవరికి వారు శానిటైజర్‌ వెంట తెచ్చుకుంటున్నారు.

విందు భోజనంలోనూ తగ్గిన ఖర్చు….
వివాహానంతరం విందు భోజనం, పసందైన వంటకాలు, శీతల పానీయాలు.. ఇలా ఏ విషయంలోనూ తగ్గకుండా భోజనాలు పెట్టించి తమ దర్పాన్ని ప్రదర్శించేవారు. దీంతో వంటవాల్లు, క్యాటరింగ్‌, మటన్‌, చికెన్‌ వ్యాపారులకు, టెంట్‌హౌస్‌ నిర్వాహకులకు ఉపాధి లభించేది. కానీ నేడు అతి తక్కువ మందితో పెళ్లిళ్లు చేస్తుండడంతో వంటకాలు తగ్గిపోయాయి. వచ్చిన వారంతా కూడా తినివెళ్తారనే గ్యారంటీ కూడా లేకపోవడంతో పెద్దగా ఖర్చు చేయ డం లేదు. కూరగాయలు లేదంటే మాంసాహార భోజనం కూడా చాలా తక్కువగానే సిద్ధం చేస్తున్నారు. రెండు కుటుంబాల సభ్యుల మధ్యనే రిసెప్షన్లు పూర్తి చేస్తున్నారు.

మండపాల్లో తగ్గిన కళ..
పెళ్లి మండపాల్లోనూ కళ తగ్గింది. సాధారణ రోజుల్లో ఒక్కో మండపానికి కనీసం రూ.30వేల నుంచి 3లక్షల వరకు వెచ్చించే వారు. పెళ్లి ఫొటోలు, వీడియోల్లోనూ మండపాల బ్యాక్‌గ్రౌండ్‌ బాగా హైలెట్‌ అవుతుండేది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో అలంకరణకు పెద్దగా ఖర్చు పెట్టడం లేదు. ఇండ్ల ముందు ఖాళీ స్థలంలో అతి తక్కువ ఖర్చులో మండపాలు వేయిస్తున్నారు.

పైసా అప్పు లేకుండా పెండ్లి చేసుకున్నాం
పెండ్లి బట్టలతో పాటు అన్ని ఖర్చులకు సుమారు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చవుతుందని లెక్కలు వేసుకొని డబ్బులు సమకూర్చుకున్నాం. కానీ, కరోనా వల్ల లక్షన్నర ఖర్చు తగ్గింది. పైసా అప్పు లేకుండా ఇంటి దగ్గరే పెండ్లి చేసుకున్నాం. ఒక వేళ మూడున్నర లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటే అప్పు చేయాల్సి వచ్చేది. అలా కాకుండా మా వద్ద ఉన్న వాటితో సంతృప్తిగా వివాహం పూర్తికావడం సంతోషంగా ఉంది. – నల్లగంటి మహేశ్‌, సంధ్య, నవ దంపతులు, సూర్యాపేట

ఖర్చు చాలా తగ్గింది..
కొవిడ్‌ నిబంధనలకు లోబడి వివాహాలు చేయాల్సి రావడంతో ఎక్కువ మంది బంధుమిత్రులను పిలిచే అవకాశం లేకుండాపోయింది. పరిమితి విధించడంతో ఖర్చు చాలా తగ్గింది. గతంలో పెండ్లి అంటే విపరీతమైన ఖర్చు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యమైన వారిని పిలిచి మా అబ్బాయి పెండ్లి జరిపించాం. ఖర్చులు చాలా తగ్గిపోయాయి. ఎక్కువ మందిని పిలుచుకోలేక పోయానే అనే బాధ తప్ప వేరే ఏమీలేదు.

  • శానం వెంకటేశ్వర్లు, బక్కయ్యగూడెం, నేరేడుచర్ల

ఇదే ట్రెండ్‌ కొనసాగాలి…
ప్రభుత్వ విధించిన నిబంధనలకు తోడు, ప్రజల్లో భయం కారణంగా వివాహాలకు హాజరయ్యే వారి సంఖ్య 80శాతం తగ్గింది. దీంతో పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు కూడా తగ్గింది. గతంలో ఒకరిని చూసి మరొకరు హోదా కోసం లక్షల్లో ఖర్చుపెట్టేవారు. ఆర్థిక స్థోమత అంతంతే అయినా ఆడంబరాలకు పోయి అప్పులపాలయ్యేవారు. కానీ, నేడు 50నుంచి 100మంది బంధువుల మధ్య వివాహాలు జరుగడం శుభపరిణామమే. మన దేశంలోనే పెళ్లిళ్లకు వేల సంఖ్యలో హాజరవుతారు. కానీ ఇతర దేశాల్లో 300మందికి మించి హాజరయ్యే సంప్రదాయం లేదు. కరోనా తర్వాత ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగాలి.

  • డా.అందె సత్యం, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, కోదాడ

సాదాసీదాగా పూర్తి చేశాం..
నా కూతురు వివాహం ఘనంగా చేయాలనుకున్నా కానీ లాక్‌డౌన్‌ వల్ల సాదాసీదాగా అయిపోయింది. గతంలో కల్యాణ మండపం, ఇతర హంగామా ఖర్చులు లక్షల్లో ఉండేది. ఇప్పుడు ఇంటి ముందే పెండ్లిచేయడంతో ఖర్చు మొత్తం తగ్గింది. బంధువులకు పెండ్లి కార్డు వాట్సప్‌లో పంపించాం. మొత్తం 30మంది మాత్రమే వచ్చారు.

  • గంటెకంపు బొజ్జమ్మ, పెళ్లికూతురు తల్లి, మాడ్గులపల్లి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లగ్గం ఖర్చుకు పగ్గాలు
లగ్గం ఖర్చుకు పగ్గాలు
లగ్గం ఖర్చుకు పగ్గాలు

ట్రెండింగ్‌

Advertisement