e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home నల్గొండ అభివృద్ధి వైపే జనం చూపు

అభివృద్ధి వైపే జనం చూపు

అభివృద్ధి వైపే జనం చూపు
  • టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమంటూ స్థానికంగా చర్చ
  • ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు

నకిరేకల్‌ సమగ్రాభివృద్ధే ధ్యేయం అంటున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్‌ 28(నమస్తే తెలంగాణ) : మేజర్‌ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన నకిరేకల్‌లో అదే స్థాయిలో అభివృద్ధి జరుగాలని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ అభివృద్ధి ఎవరితో సాధ్యమనేదే ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా జోరుగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, రాజకీయ పరిస్థితుల రీత్యా ఏ పార్టీకి ఓటేస్తే నకిరేకల్‌కు లాభమనేది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎవరిని కదిలించినా అభివృద్ధి చేసే వారికే తమ ఓటు అనేది వినిపిస్తున్నది. ఇప్పటికే కొంతకాలంగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఇంకా మరిన్ని పనులు జరగాలంటే అధికారంలో ఉన్న పార్టీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు.

నకిరేకల్‌ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు అభివృద్ధి అంశాలను ప్రస్తావించాయి. వార్డుల వారీగా సమస్యలను గుర్తిస్తూ పరిష్కరిస్తామని హామీలు గుప్పించాయి. స్థానికులు సైతం తమ సమస్యలను అభ్యర్థుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.అయితే నకిరేకల్‌ మున్సిపాలిటీలో అభివృద్ధి పరంగా జరగాల్సిన అంశాలు ఏమున్నాయి? ఇప్పటికే ఏ మేరకు పనులు జరుగుతున్నాయన్నది కీలకంగా మారింది. ముఖ్యంగా ప్రధాన రహదారుల ఆధునీకరణ, అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కుల నిర్మాణం, శ్మశానవాటికల ఏర్పాటు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, బస్టాండు ఆధునీకరణ, ఏరియా దవాఖాన విస్తరణ, డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం, సామాజిక వర్గాల వారీగా కమ్యూనిటీహాళ్ల ఏర్పాటు తదితర అంశాలు ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. వీటితో పాటు సంక్షేమపరంగా రేషన్‌కార్డులు, ఆసరా పింఛన్లు, డబుల్‌ బెడ్రూం ఇండ్లు.. ఇలా పలు అంశాలు కూడా వ్యక్తిగత సమస్యలుగా ముందుకు వచ్చాయి. వీటిల్లో మెజార్టీ అంశాలపై ఇప్పటికే స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దృష్టి సారించారన్న చర్చ ప్రజల్లో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి అంశాలు కూడా ఆధారంగా నిలుస్తున్నాయి.

అభివృద్ధి పనులు షురూ..
నకిరేకల్‌ పట్టణాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించచింది. పట్టణం మీదుగా వెళ్తున్న నల్లగొండ-సూర్యాపేట ప్రధాన రహదారి ఆధునీకరణకు రూ.12కోట్లు మంజూరు చేశారు. సెంట్రల్‌ లైటింగ్‌తో పాటు పచ్చనిచెట్లతో కూడిన డివైడర్లతో తీర్చిదిద్దేలా ప్లాన్‌ చేశారు. దీనితో పాటు మరో రూ.12కోట్లతో పట్టణంలో నుంచి తిప్పర్తి, నోముల, తాటికల్‌, కడపర్తిలకు వెళ్లే ఇతర ప్రధాన రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇక ఇన్నాళ్లూ పంచాయతీగా ఉన్న నకిరేకల్‌లో చాలా ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పెండింగ్‌లో ఉన్నది. దీంతో రూ.10కోట్లతో పనులు చేపట్టారు. త్వరలోనే మరో రూ.30కోట్లతో అన్ని చోట్ల పూర్తి చేయనున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రూ.50లక్షలతో బస్టాండ్‌ను ఆధునీకరించారు. అన్ని బస్సులు బస్టాండ్‌లోకి వచ్చేలా కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఇప్పటికే చర్చించారు. గజ్వేల్‌ తరహాలో రూ.80లక్షలతో ఆధునిక వైకుంఠధామాన్ని సిద్ధం చేశారు. డిగ్రీ కళాశాలకు పక్కా భవనం కోసం రూ.5కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వ దవాఖానను 100పడకలకు విస్తరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే అనుమతులు మంజూరు కానున్నాయి. ఎమ్మెల్యే చిరుమర్తి విజ్ఞప్తి మేరకు మిషన్‌ భగీరథ పథకం రెండు నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజల కోసం కమ్యూనిటీ హాళ్లు, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించారు.

ప్రతి ఓటరునూ కలిసిన టీఆర్‌ఎస్‌…
పటిష్టమైన క్యాడర్‌తో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ప్రతి ఓటరును కలిసి ఓట్లు అభ్యర్థించారు. అన్ని వార్డుల్లోనూ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమైందని, ఆయన నేతృత్వంలోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలే అందుకు నిదర్శమని ప్రజలకు వివరించారు. నకిరేకల్‌ అభివృద్ధి కూడా కేవలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని జగదీశ్‌రెడ్డి వివరించగా ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రుల సహకారంతోనే నిధులను సాధించవచ్చని, అందుకు ఇక్కడ ప్రభుత్వ అనుకూల పాలకవర్గమే ఏర్పాడాలన్న భావనకు ప్రజలు వచ్చేశారనే చర్చ సాగుతున్నది.

ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు కరువు..
ఇక అన్ని వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీ చేస్తుండగా నాలుగు వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థులు కరువైన పరిస్థితి. కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో అంతా అయోమయం నెలకొన్నది. అంతో ఇంతో బలమున్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కూడా ప్రచార సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల తర్వాత ఏం చేయగలరని ఆ పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు నామమాత్ర బీజేపీ కూడా ఆరు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే వార్డుల అభివృద్ధి సాధ్యమన్న చర్చ వినిపిస్తున్నది. ఈ మేరకు ప్రజలంతా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, అభివృద్ధి వైపే నిలిచేందుకు సిద్ధమయ్యారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధి వైపే జనం చూపు

ట్రెండింగ్‌

Advertisement