e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home నల్గొండ బత్తాయికి భలే ధర

బత్తాయికి భలే ధర

బత్తాయికి భలే ధర
  • కరోనా వేళ కత్తెర సీజన్‌ పంటకు డిమాండ్‌
  • టన్నుకు రూ.40వేల నుంచి రూ.65వేలు
  • తోటల వద్దే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
  • సీ విటమిన్‌ ఉండటంతో పెరుగుతున్న అమ్మకాలు
  • ఉమ్మడి జిల్లాలో 44వేల ఎకరాల్లో బత్తాయి సాగు

నల్లగొండ, మే 23 : సాధారణంగా బత్తాయి పంట ఏడాదికి మూడు సార్లు వస్తుంది. ప్రతియేటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో 10శాతం, ఏప్రిల్‌ మే నెలల్లో 35శాతం, జూలై, ఆగస్టు నెలల్లో 55 శాతం పంట వస్తుంది. ప్రస్తుతం 35 శాతం పంట వస్తుండగా వచ్చిన పంటను రైతాంగం మంచి ధరకు విక్రయిస్తున్నారు. టన్నుకు నాణ్యతను బట్టి రూ.40 వేల నుంచి రూ.65 వేల వరకు రైతుకు వస్తుంది. గత వానకాలం సీజన్‌లో కరోనా సమస్య, లాక్‌డౌన్‌ వల్ల పండించిన పంటను అమ్ముకోలేక ఇబ్బంది పడ్డ రైతులకు పెట్టుబడి సైతం వెళ్లని పరిస్థితి. అప్పుడు నష్టపోయిన రైతులకు ఈ సీజన్‌ కాస్త ఊరటనిస్తుంది. ఈ పంట ఉత్పత్తులను విక్రయించడానికి ఎక్కడికీ పోకుండా వ్యాపారులు తోటల వద్దకే వచ్చి ఈ రేటు పెడుతున్నారు.

కరోనా వేళ రైతుకు వెన్నుదన్నుగా..
కరోనా వైరస్‌ తీవ్రమవుతున్నప్పటికీ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆయా శాఖల అధికారులను ఆదేశించింది. అందులో భాగంగానే రైతులతో సంబంధమున్న శాఖలు పూర్తి స్థాయి సిబ్బందితో పని చేస్తున్నాయి. ప్రస్తుతం బత్తాయి, నిమ్మ ఉత్పత్తులు చేతికొచ్చినందున రైతులతోపాటు ఈ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకెళ్లే వారికి పాస్‌లు అందజేస్తూ రైతు సేవలో నిమగ్నమయ్యారు. అంతేగాక మార్కెట్లలో ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి.. పరిశీలనలు చేయడం.. ధరలు ఎక్కువ ఉన్న మార్కెట్లకు పంట ఉత్పత్తులను పంపడం చేస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 44వేల ఎకరాల్లో సాగు..
ఒకప్పుడు బత్తాయి సాగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ సాగు అయ్యేది నల్లగొండ జిల్లానే. అలాంటి నల్లగొండలో భూగర్భ జలాలు తగ్గి కాలానుగుణంగా బత్తాయి సాగు క్రమంగా తగ్గింది. ప్రస్తుతం నీటి వనరులు పెరుగడంతో మళ్లీ బత్తాయి సాగు విస్తరించింది. ప్రస్తుతం నల్లగొండ ఉమ్మడి జిల్లాలో 44వేల ఎకరాల్లో సాగు అవుతుండగా.. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 42వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరాకు ఎనిమిది నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుండగా అందులో ఈ కత్తెర సీజన్‌లో 35 శాతం పంట వస్తుంది.

సీ విటమిన్‌ కారణంగా కలిసొస్తున్న ధరలు..
విటమిన్‌ లోపం వల్ల కూడా కరోనా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి దశ అనుభవ రీత్యా రెండో దశలో ప్రజలు విటమిన్లు కలిగిన పండ్లు, ఇతర ఆహారాలను బాగా తీసుకుంటున్నారు. ముఖ్యమైన సీ విటమిన్‌ బత్తాయిలో బాగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బత్తాయికి ఈ రెండో దశలో విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. మొన్నటి వరకు గరిష్ఠంగా టన్ను రూ.30వేలు మాత్రమే పలుకగా తాజాగా రూ.40 వేల నుంచి నాణ్యతను బట్టి రూ.65వేల దాకా పలుకుతుంది. ఆయా రాష్ర్టాలు లాక్‌డౌన్‌ విధించినప్పటికీ రవాణా రంగానికి పెద్దగా ఇబ్బందులు లేకపోవడంతో క్రయ విక్రయాలు జరుగుతున్నందున మంచి ధర పలుకుతున్నది.

బత్తాయికి రేటు బాగా వస్తుంది
ప్రస్తుతం కత్తెర సీజన్‌ బత్తాయి పంటకు మార్కెట్‌లో మంచి రేటే ఉంది. టన్ను రూ.40వేల నుంచి రూ.65 వేల దాకా పలుకుతుంది. వ్యాపారులే రైతుల తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులు కొద్ది గొప్ప పంట ఉన్నప్పటికీ మార్కెట్లకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా తోట వద్దే విక్రయిస్తున్నారు. పంట విక్రయించిన వెంటనే డబ్బులు చేతికందుతున్నాయి.

  • సంగీతలక్ష్మి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి, నల్లగొండ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బత్తాయికి భలే ధర

ట్రెండింగ్‌

Advertisement