e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిల్లాలు లాఠీలెత్తి కాఠిన్యం

లాఠీలెత్తి కాఠిన్యం

లాఠీలెత్తి కాఠిన్యం

కఠినం పేరుతో పోలీసుల ఓవరాక్షన్‌
లాక్‌డౌన్‌ మినహాయింపు ఉన్న వారిపైనా ప్రతాపం
విద్యుత్‌, మెడికల్‌, మీడియా సిబ్బందికి లాఠీ దెబ్బలు
ఐడీ కార్డులనూ పరిగణలోకి తీసుకోని వైనం
విద్యుత్‌, మెడికల్‌ సిబ్బంది ఆందోళన
మంత్రి జగదీశ్‌రెడ్డి జోక్యం.. డీజీపీకి ఫోన్‌
అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలకు ఆదేశాలు
కట్టుదిట్టంగా అమలుకు కఠిన చర్యలు : డీఐజీ రంగనాథ్‌

నల్లగొండ ప్రతినిధి, మే 22 (నమస్తే తెలంగాణ) : లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలు చేస్తున్నామనే పేరుతో నల్లగొండ జిల్లా పోలీసులు వ్యవహరించిన తీరు
విమర్శలకు దారితీసింది. శుక్రవారం రాత్రి నుంచే రోడ్లపై కనిపించిన వారినల్లా ఖాకీలు చితకబాదారు. సామాన్యులతోపాటు ఎమర్జెన్సీ సర్వీసులు అందించే విద్యుత్‌, మెడికల్‌, మీడియా, పారిశుధ్యం, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సిబ్బందిపైనా ప్రతాపం చూపారు. ఐడీ కార్డులు చూపించినా పట్టించుకోకుండా లాఠీలకు పని చెప్పారు. పోలీసుల తీరును ఆక్షేపిస్తూ విద్యుత్‌, మెడికల్‌ విభాగాల వారు శనివారం నిరసనకు దిగారు. విద్యుత్‌ ఉద్యోగులు సహాయ నిరాకరణకు పూనుకోవడంతో విషయం రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వరకూ వెళ్లింది. వెంటనే మంత్రి జోక్యం చేసుకుని ఫోన్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డితో మాట్లాడుతూ పోలీసుల తీరును ఆక్షేపించారు. అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రంగనాథ్‌ను ఆదేశించారు. జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు కూడా స్పందించడంతో విద్యుత్‌ ఉద్యోగులను కొట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయడంలో భాగంగా కీలక చర్యలు తప్పవని, మినహాయింపులు ఉన్న విభాగాల వారంతా ఐడీ కార్డులు వెంట ఉంచుకోవాలని ఆయన సూచించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత 10 రోజులుగా లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతూనే ఉంది. ఉదయం నాలుగు గంటల సడలింపు సమయం మినహా మిగతా 20 గంటలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నది. అయితే అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం కలెక్టర్లు, ఎస్పీల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందిస్తూ లాక్‌డౌన్‌ అమలులో అలసత్వం వద్దని పోలీస్‌ శాఖను అప్రమత్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ఆసరాగా చేసుకుని స్థానిక పోలీసులు వెనుకాముందు చూడలేదు. నల్లగొండలో శుక్రవారం రాత్రి నుంచే రోడ్లపైన కనిపించిన వారినల్లా చితకబాదడం మొదలుపెట్టారు. రాత్రిళ్లు డ్యూటీ ముగించుకుని ఇళ్లకు వస్తున్న విద్యుత్‌, మెడికల్‌, మీడియా సంస్థల ఉద్యోగులు, సిబ్బందిని సైతం వదల్లేదు. తమకు లాక్‌డౌన్‌లో మినహాయింపు ఉందని ఐడీ కార్డులు చూపించినా పట్టించుకోలేదు. శనివారం ఉదయం 9.45గంటల నుంచే పోలీసులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో అయితే ఎవరినీ చూడలేదు. డీఈ స్థాయి అధికారిని సైతం అడ్డగించారు. డ్యూటీకి వెళ్తున్న మహిళా ఉద్యోగులను ఇంటికి వెళ్లిపోవాలంటూ బెదిరించారు. దీంతో పట్టణంలో పలుచోట్ల బ్రేక్‌డౌన్‌ అయ్యి కరెంటు సరఫరాకు అంతరాయం కలిగినా విద్యుత్‌ అధికారులు స్పందించలేదు. బయటకెళ్తే కొడుతున్నారంటూ పట్టించుకోలేదు. ఇదే విషయమై సోషల్‌ మీడియాలో విద్యుత్‌ సిబ్బంది ఏకంగా పట్టణ పోలీస్‌ స్టేషన్లకు కరెంటు సరఫరా నిలిపివేశారన్న ప్రచారమూ జరిగింది. ఇవన్నీ జరుగుతుండగానే మరోవైపు మెడికల్‌ ఏజెన్సీలు, మందుల దుకాణాల యజమానులు ఆందోళనకు దిగారు. అదేవిధంగా ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో పనిచేసే వైద్యులు, ఉద్యోగులు, సిబ్బందికీ ఇక్కట్లు తప్పలేదు. ఐడీ కార్డులు చూపించినా కనీసం పరిగణలోకి తీసుకోకుండా కొట్టారని ఆరోపించారు. అత్యవసర వేళల్లో పనిచేస్తున్న తమపై పోలీసుల తీరు సరిగ్గా లేదంటూ ప్రకాశంబజారులో ఏజెన్సీలు, దుకాణాలను మూసివేసి ఆందోళనకు దిగారు. ఇలాగైతే తాము సర్వీసు అందించలేమని స్పష్టం చేశారు. దీంతో సాయంత్రం నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి మెడికల్‌ ఏజెన్సీల వారితో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. మరోవైపు మీడియా వారికి సైతం లాఠీ దెబ్బలు తప్పలేదు. రోజు మాదిరిగానే న్యూస్‌పేపర్‌ ప్రింటింగ్‌ అయ్యాక ఇళ్లకు వెళ్తున్న వారిని అడ్డగించారు. ఐడీ కార్డులు చూపించినా ఇప్పటివరకు ఏం పనంటూ చితకబాదారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం వ్యవసాయ పనులకు మినహాయింపు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ధాన్యం రవాణాకు వెళ్తున్న లారీలను సైతం ఆపి డ్రైవర్లను కొట్టినట్లు తెలిసింది. వీరు 100కు డయల్‌చేసినా పట్టించుకోలేదని సమాచారం. కరోనా పరీక్షలకు వెళ్తున్న వారితో పాటు ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్తున్న వారు, రోగుల సహాయకులూ ఇబ్బంది పడాల్సి వచ్చింది.
మంత్రి జగదీశ్‌రెడ్డి జోక్యం.. డీజీపీకి ఫోన్‌
లాక్‌డౌన్‌ కఠిన అమలు పేరుతో నల్లగొండలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మంత్రి జగదీశ్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. విద్యుత్‌ ఉద్యోగులు, సిబ్బందితో పోలీసుల అనుచిత ప్రవర్తన, దాడి ఘటనలపై డీజీపీ మహేందర్‌రెడ్డితో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న పోలీసులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 24గంటలపాటు అత్యవసర సేవలు అందిస్తున్న వివిధ విభాగాల వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించడం సమంజసం కాదన్నారు. అత్యవసర సర్వీసుల్లో ఉండే వారి ఐడీ కార్డులు పరిశీలించి విధులకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. ఇదే విషయమై జిల్లా ఎస్పీ రంగనాథ్‌తోనూ మంత్రి మాట్లాడారు. పోలీసుల ప్రవర్తన తీవ్ర ఆక్షేపణీయంగా ఉందని, పద్ధతి మార్చుకునేలా చూడాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్‌ ఉద్యోగులపై దాడి ఘటనపై జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు కూడా స్పందించారు. ఎస్పీ రంగనాథ్‌తో మాట్లాడారు. విద్యుత్‌ ఉద్యోగులను కొట్టిన పోలీసులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. పోలీసుల తీరుపై మధ్యాహ్నం వరకు విమర్శలు వెల్లువెత్తడంతో సాయంత్రానికి దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు.
మరింత కఠినంగా లాక్‌డౌన్‌
లాక్‌డౌన్‌ మరింత కట్టుదిట్టంగా అమలుకు శ్రీకారం చుట్టారు. నల్లగొండలో ఘటనలను పక్కనపెడితే జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇచ్చిన వారిని వదిలేసి మిగతా వారి పట్ల పోలీసులు శనివారం మరింత కఠినంగా వ్యవహరించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేశారు. వారి వాహనాల ఫొటోలను తీసి ఈ చలాన్ల ద్వారా జరిమానాలు విధించారు. శుక్రవారం డీజీపీ ఆదేశాల అనంతరం ఎస్పీలు కూడా క్షేత్రస్థాయి వరకు తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌ స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యటించి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. క్లాక్‌టవర్‌ సెంటర్‌లో డ్రోన్‌ కెమెరాలతో ప్రధాన మార్గాల్లో పరిస్థితిని సమీక్షించారు. సడలింపు సమయంలోనూ ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించి అకారణంగా బయటకు వచ్చిన వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్‌ సిబ్బంది, మీడియా, వ్యవసాయ పనులతో సంబంధం ఉన్న వారికి పలు మార్గదర్శకాలను రూపొందించారు. ఆదివారం నుంచి అందరూ దీన్ని పాటించాలని ఎస్పీ స్పష్టం చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాఠీలెత్తి కాఠిన్యం

ట్రెండింగ్‌

Advertisement