e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిల్లాలు కరోనా తాకని ఒక ఊరి కథ

కరోనా తాకని ఒక ఊరి కథ

కరోనా తాకని ఒక ఊరి కథ

ఆదర్శంగా నిలుస్తున్న చెన్నుగూడెం
ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని గ్రామం
అక్కడ గడప దాటితే మాస్క్‌ ఉండాల్సిందే..
ఏడాది నుంచి పెండ్లిండ్లు,పేరంటాలు బంద్‌
పిల్లలనూ బయటకు పంపట్లే..
పనులు తప్ప పచార్లు కొట్టని జనం
కలిసివస్తున్న స్వీయ నియంత్రణ చర్యలు
స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ అమలు
రోజు విడిచి రోజు ఊరంతా శానిటైజ్‌
ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న మహిళా సర్పంచ్‌, వలంటీర్‌ టీమ్‌

పంట పొలాలు, పచ్చని చెట్ల మధ్య ఉండే ఆ ఊరి జనాభా 1,200. మొత్తం 220 గడపలు. యావత్‌ ప్రపంచం కరోనా మహమ్మారికి చిక్కి విలవిల్లాడుతున్న వేళ.. ఈ ఊరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమున్నది. 2020 ఏప్రిల్‌ 2న నల్లగొండ జిల్లాలో కరోనా తొలి కేసు నమోదైంది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ పల్లె, పట్నం తేడా లేకుండా కుదిపేస్తుండగా.. ఆ ఊళ్లో మాత్రం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కొవిడ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. అదే నల్లగొండ మండలంలోని చెన్నుగూడెం. గ్రామస్తులంతా ఒక్క కట్టుపై ఉండడం, స్వీయ నియంత్రణ చర్యలు పాటిస్తుండడంతో.. జిల్లాకేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఊరి దరిదాపుల్లోకి కూడా వైరస్‌ రాలేకపోయింది. ఇక్కడ మాస్క్‌ లేనిదే ఏ ఒక్కరూ గడప దాటరు. ఊరి నుంచి బయటకు వెళ్లినా, బయటివాళ్లు ఊళ్లోకి వచ్చినా పూర్తి జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ను కూడా స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. విద్యావంతురాలైన సర్పంచ్‌, పోలీసుల సహకారంతో ఏర్పాటైన వలంటీర్‌ టీమ్‌ సభ్యులు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో వారంలో మూడుసార్లు సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రే చేస్తున్నారు. పనులకు తప్ప, అడ్డగోలు తిరుగుళ్ల జోలికి వెళ్లకపోవడం కూడా తమకు కలిసివస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జ్వర సర్వేలోనూ ఈ గ్రామంలో అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడైంది.

మా జాగ్రత్తల మేముంటున్నం
మా దగ్గర పొలం పనులు, ఇసుక తోలకమే ఎక్కువ. పొద్దంతా ఎవరి పనులకు వాళ్లం పోతం. దేశమంత కరోనా వస్తున్నదని చెప్తుండడంతోని మా జాగ్రత్తల మేముంటున్నం. మూతికి బట్ట లేకుండ బయటకు పోతలేం. ఒకల్లకొకలం దూరం దూరం ఉంటున్నం. ఏమైన తెలుసుకునే ముచ్చట్లుంటే మా సర్పంచ్‌ డప్పు సాటింపు వేయిస్తున్నది. గావిట్ని పాటిస్తున్నం. మా ఊళ్లో చాలామందిమి ఏడాదిసంది పెండ్లిండ్లు, చావులకు పోవుడు బంద్‌ పెట్టినం.

  • మర్రి వెంకన్న, చెన్నుగూడెం

కరోనా వ్యాప్తితో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అంతటా ప్రజలు వైరస్‌ బారిన పడుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో చెన్నుగూడెం మాత్రం కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం వంటివి చేయడంతోపాటు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వ డంతో వైరస్‌కు చెక్‌పడింది. ప్రజల కట్టుబాట్లు, జీవనశైలి కూడా దీనికి ఒక కారణమే.

99 శాతం యాదవులే..
చెన్నుగూడెం గ్రామంలో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా 1200 మంది. గ్రామంలో 99 శాతం యాదవ కుటుంబాలే. వీరికి వ్యవసాయంతోపాటు గొర్రెలు, మేకల పెంపకమే జీవనాధారం. ఇక వీటితోపాటు వాగులో ఇసుక ఎత్తడం, ఉపాధి పనులకు వెళ్లడం వంటి పనులు చేస్తారు. గొర్రెల మేతకు ఇంటికి ఒకరు లేదా ఇద్దరు చొప్పున వెళ్తారు. వీరు బయటికి వెళ్తే కచ్చితంగా మాస్క్‌ పెట్టుకుంటారు. వ్యవసాయ పనుల సమయంలోనూ కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముగియగా, లాక్‌డౌన్‌తో ఇసుక తరలింపు పనులు ఆగిపోవడంతో చాలా వరకు ఇంట్లోనే ఉంటున్నారు.

గ్రామమంతా ఏకతాటిపై
గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు కరోనా కట్టడికి పలు మార్గాలు ఎంచుకున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో నిత్యావసర సరుకులు తెచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు అందరూ వారానికి సరిపడా సరుకులను ఒక్కసారే నల్లగొండకు లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో వెళ్లి తెచ్చుకుంటున్నారు. గ్రామంలో రెండు కిరాణా దుకాణాలు ఉండగా వాటిని ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచి ఆ తర్వాత బంద్‌ చేయిస్తున్నారు. గూడెం అంతా ఏకతాటిపై ఉండి ఊరి నుంచి అనవసరంగా బయటకు వెళ్లకుండా, బయటి వారు గ్రామంలోకి వచ్చినా వారితో జాగ్రత్తగా ఉంటున్నారు. గుంపులుగా ఒకచోట కూర్చోవడం, కూరగాయలు, ఇతర అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకపోవడం, ఉన్నదాంట్లో సర్దుకుపోవడం వంటివి చేస్తున్నారు. ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తే కాళ్లు, చేతులు శభ్రం చేసుకోవడం, స్నానం చేసిన తర్వాతే ఇంటిలోకి అనుమతించేలా నియమాలు పాటిస్తున్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
కరోనా వైరస్‌ కట్టడికి పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధానంగా పారిశుధ్యంపై ప్రత్యేక చొరవ చూపిస్తున్నది. గతేడాది నుంచి వారానికి మూడు సార్లు వీధుల్లో సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేయిస్తున్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి బ్లీచింగ్‌ చల్ల డం వంటివి చేస్తున్నారు. అదే విధంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికీ మాస్కులు పంపిణీ చేయడంతోపాటు పంచాయతీ కార్మికులకు శానిటైజర్స్‌ను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంటింటికీ జ్వర సర్వే చేయగా గ్రామంలో అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడైంది.

ఆటపాటలతో చిన్నారుల కాలక్షేపం
కరోనా వైరస్‌ వ్యాప్తితో గతేడాది నుంచి పాఠశాలలు లేకపోవడంతో చిన్నారులు ఆటపాలతో కాలక్షేపం చేస్తున్నారు. గ్రామంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయట తిరుగనీయకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇంట్లో ఉన్నా పిల్లలు మాస్కు పెట్టుకోవడం, భౌతికదూరం పాటించేలా చేస్తున్నారు. ఇండ్ల ముందే ఆట, పాటల్లో నిమగ్నమయ్యేలా సూచిస్తున్నారు.

ప్రజల చైతన్యంతోనే..
కరోనా మొదటి, రెండో దశల్లో వైరస్‌ వ్యాప్తిని మా గ్రామంలో అరికట్టగలిగాం. లాక్‌డౌన్‌ కంటే ముందే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలని చైతన్యపర్చాం. యువకులను వలంటీర్లుగా నియంమించి కరోనాపై ప్రజలకు పూర్తి స్థాయి లో అవగాహన కల్పిస్తున్నాం. మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్నాం. మూడు రోజులకోసారి వీధుల్లో సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేయిస్తున్నాం. ఇప్పటి వరకు ఒక కేసు కూడా నమోదు కాకపోవడం సంతోషకరం. – గుండెబోయిన శ్రీలత, సర్పంచ్‌ చెన్నుగూడెం

పేరంటాలకు పోట్లే..
ఏడాది కాంచి కరోనా రాబట్టే.. అప్పట్నుంచి ఏ పేరంటాలకు పోట్లే. బుక్కెడు తిని ముసలోన్ని చూసుకుంటా ఇంటిపట్టునే ఉంటున్నా.. ఎవ్వరింటికీ పోయేటట్లు లేదు. సరుకులు సరిపడా నా కొడుకు తెస్తడు. గప్పట్ల గత్తర రోగమొచ్చి మస్తు మంది సచ్చిండ్రు. ఆ భయంతో మా పిల్లల్ని యాడికి పోనియట్లేదు.

  • జెట్టి ఆగమ్మ, గ్రామస్తురాలు

ఆరోగ్యంగా ఉన్నాం
ఇక్కడ అంతా కష్టపడి పనిచేసుకునేటోళ్లం. పొద్దున లేస్తే వాగులోఇసుక తీస్తూ, వ్యవసాయంపై బతికేటోళ్లం. గట్కా వంటి ఆహారమే మాకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి కారణం. గ్రామస్తులమంతా వైరస్‌ వ్యాపించకుండా నిబంధనలు పాటిస్తున్నాం. ఒక వేళ పక్క ఊర్లకు పోయి వస్తే కాళ్లు, చేతులు శుభ్రంగా కడుకుంటాం. -మర్రి సాగర్‌, గ్రామస్తుడు

పొద్దస్తమానం బావుల వద్ద ఉంటాం
మేము పొద్దస్తమానం మేకలు, గొర్రెలు మేపుతూ, వ్యవసాయ పనుల్లో బావుల వద్దనే ఉంటాం. పొద్దున్నే పోయేటప్పుడే సద్ది తీసుకుపోతం. సాయంత్రం ఊళ్లోకి వచ్చినమా బుక్కెడు తిన్నామా.. పండినామా.. మా పనే ఇది. వేరే ఊళ్లకు పోయేది లేదు. ఎక్కడికైనా పోతే మూతికి రూమాలు చుట్టుకొని పోతా..

  • చంద్రయ్య, గ్రామస్తుడు

బజార్లనీ శుభ్రం చేస్తున్నాం
కరోనా వైరస్‌ వస్తున్న కానుంచి ఎక్కడా చెత్త లేకుండా బజార్లను శుభ్రం చేస్తున్నాం. బ్లీచింగ్‌ చల్లి, రసాయనాలు పిచికారీ చేస్తున్నాం. ప్రజలు కూడా శానా జాగ్రత్తలు తీసుకుంటున్నరు. కరోనా కట్టడికి మేము చేస్తున్న పని చాలా సంతృప్తిగా ఉంది.

  • ఈదయ్య, పంచాయతీ పారిశుధ్య కార్మికుడు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా తాకని ఒక ఊరి కథ

ట్రెండింగ్‌

Advertisement