e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home నల్గొండ నకిరేకల్‌లో 100 పడకల ఆస్పత్రి

నకిరేకల్‌లో 100 పడకల ఆస్పత్రి

నకిరేకల్‌లో 100 పడకల ఆస్పత్రి
  • కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను ఏరియా దవాఖానగా అప్‌గ్రేడ్‌
  • నెరవేరిన నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ
  • ఫలించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కృషి
  • జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారం
  • సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు చిరుమర్తి కృతజ్ఞతలు
  • కలెక్టర్‌తో కలిసి స్థల పరిశీలన

నల్లగొండ ప్రతినిధి, మే20 (నమస్తే తెలంగాణ) : నకిరేకల్‌ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. పట్టణంలో 100పడకల ఆస్పత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రస్తుతం 30 పడకలతో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌గా ఉన్న నకిరేకల్‌ దవాఖానను ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ జీఓ సైతం విడుదల చేశారు. ఎమ్మెల్యేచిరుమర్తి లింగయ్య కృషికి మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి సహకారం తోడవడంతో ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి స్థలం సరిపోకపోతే ప్రత్యామ్నాయంగా మరో స్థలం కోసం కూడా అప్పుడే అన్వేషణ మొదలైంది. సాధ్యమైనంత త్వరలో వంద పడకల దవాఖానను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా స్వరాష్ట్రంలో ఒక్కో అడుగు ముందుకు పడుతుండడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడు మెడికల్‌ కాలేజీలు మంజూరు చేశారు. నల్లగొండ, సూర్యాపేటల్లో మెడికల్‌ కాలేజీలు, యాదాద్రి జిల్లాలో ఎయిమ్స్‌ ఇప్పటికే వైద్యవిద్యను అందిస్తున్నాయి. మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉన్న జిల్లా కేంద్ర ఆస్పత్రులు కూడా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. పడకల సంఖ్య కూడా పెరిగింది. దీంతో ఈ ఆస్పత్రుల్లో ప్రజలకు మరింత విస్తృతంగా మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ఈ ఆస్పత్రులే ఉమ్మడి జిల్లా ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి. వీటితోపాటు జిల్లాలోని మిర్యాలగూడ, సాగర్‌, దేవరకొండ ఏరియా ఆస్పత్రుల్లోనూ మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఈ పరిస్థితుల్లోనే జిల్లాకు మరో వంద పడకల ఆస్పత్రి మంజూరు కావడంతో హర్షం వ్యక్తమవుతోంది. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఉన్న నకిరేకల్‌లో ఆధునిక వైద్య సేవలతో పాటు అన్నిరకాల సేవల కోసం ఎప్పటినుంచో డిమాండ్‌ ఉంది. హైవే ప్రమాదాల్లో గాయపడిన వారికి చికిత్స అందించడంతోపాటు ఈ ప్రాంత ప్రజలకు కూడా ఇది ఎంతో అనువుగా ఉండనున్నది. దీంతో ప్రస్తుతం 30పడకలతో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌గా ఉన్న నకిరేకల్‌ ఆస్పత్రిని వంద పడకలకు పెంచాలని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భావించారు. అందులో భాగంగానే జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో పలుమార్లు సీఎం కేసీఆర్‌ను కలిశారు.

మంత్రి కేటీఆర్‌కూ ఈ ఆస్పత్రి ఆవశ్యకతను వివరించారు. గత ఏడాది కేటీఆర్‌ చిట్యాలకు వచ్చిన సమయంలోనూ ఎమ్మెల్యే చిరుమర్తి వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లోనూ త్వరలోనే వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నకిరేకల్‌లో వంద పడకల ఆస్పత్రికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌కు ఆదేశాలిస్తూ వంద పకడల ఆస్పత్రి ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జీఓ జారీ చేశారు.

ఏరియా ఆస్పత్రిగా మార్పు
ఇప్పటివరకు 30 పడకలతో ఉన్న నకిరేకల్‌ ఆస్పత్రిని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జారీ చేసిన జీఓతో 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఏరియా దవాఖానగా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఇక్కడ ప్రస్తుతం ఉన్న భవనానికి అదనపు బిల్డింగ్‌ అవసరం పడనున్నది. దీంతోపాటు మౌలికవసతులు కూడా పెరగనున్నాయి. వైద్యులతోపాటు వైద్యసిబ్బంది సంఖ్య కూడా భారీగా పెరుగనున్నది. అత్యాధునిక వసతులతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. జీఓ జారీ అయిన వెంటనే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. వంద పడకలకు స్థలం సరిపోకపోవచ్చని భావిస్తున్నారు. దీంతో అందుకు ప్రత్యామ్నాయ స్థలం కోసం అన్వేషణ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో చర్చించిన అనంతరం ఇద్దరూ కలిసి నకిరేకల్‌లోని తాసీల్దార్‌ కార్యాలయ స్థలాన్ని గురువారం పరిశీలించారు. అక్కడ రెండెకరాల వరకు స్థలం అందుబాటులో ఉంటుందని, ఇక్కడ వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తే ఎలా ఉంటుందనే దానిపై సమీక్ష చేశారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానున్నది. సాధ్యమైనంత త్వరగా వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు : ఎమ్మెల్యే చిరుమర్తి
నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల స్థాయికి పెంచుతూ జీఓ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సంపూర్ణ సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. వారు నకిరేకల్‌ అభివృద్ధిపై ప్రత్యేక చొరవతో ఉన్నారనడానికి ఇది తాజా నిదర్శనమన్నారు. ఈ మేరకు ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ నకిరేకల్‌ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ జీఓనే నిదర్శనమని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో నకిరేకల్‌ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. దీంతో నకిరేకల్‌ ప్రజలకు అన్నిరకాల మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ వంద పడకల ఆస్పత్రిని ప్రత్యేక శ్రద్ధతో మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, యువనేత కేటీఆర్‌కు నకిరేకల్‌ ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. నకిరేకల్‌ ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే స్థలాన్ని ఎంపిక చేసి వంద పడకల ఆస్పత్రికి శ్రీకారం చుడతామన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నకిరేకల్‌లో 100 పడకల ఆస్పత్రి

ట్రెండింగ్‌

Advertisement