e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home నల్గొండ ఆలుపెరుగని ఆశయం

ఆలుపెరుగని ఆశయం

ఆలుపెరుగని ఆశయం
  • కరోనా కట్టడిలో కీలకంగా ఆశ వర్కర్లు
  • అదేబాటలో అంగన్‌వాడీల నిర్విరామ సేవలు
  • ఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలు సేకరణ
  • మందులు, పౌష్టికాహారం అందజేత
  • ఏడాదిగా ప్రజలకు భరోసా కలిస్తూ ముందడుగు

నల్లగొండ, మే 16 : పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎక్కువ సమయం జనం దగ్గరే ఉండాల్సిన పరిస్థితి అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలది. కరోరా మొదటి దశ నుంచి ఇప్పటివరకు ఈ ఫీల్డ్‌ వర్కర్లకి సరిగ్గా కంటి నిండా కునుకు కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి అంగన్‌వాడీ, ఆశ కార్యకర్త పరిధిలో వెయ్యి మంది ప్రజలు ఉంటారు. వీరందరి హెల్త్‌ ప్రొఫైల్‌ నిర్వహణ బాధ్యత ఆశ కార్యకర్తలది. వీరు ప్రజల ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ అంగన్‌వాడీ కార్యకర్తల సహకారంతో వారికి మందులు అందజేస్తుంటారు. గత ఏడాది మార్చి నుంచి కరోనా కారణంగా వీరి సేవలు విస్తరించాయి. కరోనా లక్షణాలు ఉన్న వారికి సూచనలు చేసి పరీక్షల నిర్వహణ, కిట్ల అందజేత కార్యక్రమాలు చేస్తున్నారు. వారి ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు అప్‌డేట్‌ చేయటం వీరి ప్రధాన విధి. అంతేకాక ప్రతి రెండునెలలకోసారి ఏదో ఆరోగ్య సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల జ్వర సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు.

విధి నిర్వహణలో కరోనా బారిన పడినా..
కరోనా ఏడాది కాలంగా రెండు దశల్లో ప్రజలను బాధిస్తున్న క్రమంలో ప్రజారోగ్యమే పరమావధిగా భావించే ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు విధి నిర్వహణలో వారు కూడా బాధితులుగా మారారు. నల్లగొండ జిల్లాలో 2093 మంది అంగన్‌వాడీ టీచర్లు, 1510మంది ఆశ కార్యకర్తలు ఉండగా ఇప్పటివరకు 172మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక సూర్యాపేట జిల్లాలో 1209మంది అంగన్‌వాడీ, 1034మంది ఆశలు ఉండగా 64 మందికి పాజిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ చికిత్స తీసుకొని మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ ప్రజా రక్షకులు. ఆశలకు తొలుతగానే వ్యాక్సిన్‌ వేసినప్పటకీ పలువురు కరోనా బారినపడ్డారు. వైద్యులు పరీక్షలు చేసి మెడిసిన్‌ ఇస్తే ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు మాత్రం క్షేత్రస్థాయిలో బాధితులకు ప్రత్యక్ష సేవలు చేస్తుండడం గొప్ప విషయం.

ఆప్యాయతలు, అనురాగాలకు దూరంగా..
ఆప్యాయతలు, అనురాగాలకు కేరాఫ్‌ స్త్రీ.. ఆ స్త్రీ మూర్తులైన ఆశ, అంగన్‌వాడీ టీచర్లు మాత్రం కరోనా కారణంగా తమ సొంతింటిలో ఆప్యాయతలు, అనురాగాలకు దూరమయ్యారని చెప్పవచ్చు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ అదృశ్య వైరస్‌తో పోరాటం చేస్తున్న వారికి సేవలు అందిస్తున్న క్రమంలో తమ శరీరంలోకి వైరస్‌ వచ్చిందాక గుర్తించలేని పరిస్థితి. ఈ తరుణంలో పొద్దుందాక జనంలో ఉండే ఈ ఫీల్డ్‌ వర్కర్స్‌ ఇంటికి వచ్చి పిల్లలను కూడా మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకొని ముద్దాడలేని దయనీయ పరిస్థితి వారిది. వైరస్‌ తనలోకి వస్తే అది ఇంటిల్లిపాదికి సోకే అవకాశం ఉండటంతో అనురాగాలను మదిలోనే ఉంచుకొని మరీ ప్రజలకు సేవలందిస్తున్నారు ఈ త్యాగమూర్తులు. కరోనా సేవలు కాకుండా ప్రతి నెలా 104 సిబ్బందితో కలిసి తమ పరిధిలోని పలురకాల రోగులకు మందుల పంపిణీ, పిల్లలకు ఇమ్యునైజేషన్‌, సబ్‌సెంటర్లలో వారం వారం సేవలు, గర్భిణులకు చెకప్‌లు, డెలివరీలు, ట్యూబెక్టమీ ఆపరేషన్లతో పాటు మరెన్నో రెగ్యులర్‌ సేవలు అందిస్తున్నారు. ఇక అంగన్‌వాడీలు సైతం ఇల్లిల్లు తిరిగి పిల్లలకు, తల్లులకు పౌష్టికాహారం అందజేత లాంటి కార్యక్రమాలు.. ఇలా తమ రెగ్యులర్‌ సేవలతోపాటు కరోనా కాలంలో నిత్యం ప్రజల వెంట ఉండి భరోసా ఇస్తున్నారు.

పాజిటివ్‌ కేసులతో అప్రమత్తత…
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో మొత్తం 5846 మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఉన్నారు. పల్లెల్లో అయినా పట్నంలో అయినా పాజిటివ్‌ కేసులు వచ్చిన వారి పట్ల నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వారికి అవగాహన కల్పించి వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారికి మెడిసిన్‌ కిట్లు అందజేసి, ప్రతిరోజూ వారి ఇంటికెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉంచి వారు బయట తిరగకుండా చూస్తూ వైరస్‌ విస్తరించకుండా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో జాగ్రత్తలు చేపడుతున్నారు. అధికారులకు సమాచారం అందించి ఆ ఇంటిని, వీధిని శానిటైజ్‌ చేయించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్‌ వచ్చినా వీధుల్లోకి వెళ్లేందుకే బయపడుతున్న తరుణంలో ఈ ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ మాత్రం నిత్యం వారి మధ్యలోనే ఉండి వారికి సేవలు చేస్తున్నారు.

విధి నిర్వహణే ప్రధానం..
కరోనా భయం ఉన్నా.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో పాలుపంచుకోవడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్న. గతేడాది ఆశ కార్యకర్తలను మాత్రమే వివరాలను సేకరించేందుకు వినియోగించుకున్నారు. ఈసారి వారితో పాటు మమ్ములను కూడా మమేకం చేయడం సంతోషంగా ఉంది. విధుల్లో భాగంగా బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తూనే జ్వర సర్వే చేశా. కరోనా భయాన్ని పక్కకు పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న.

  • బత్తెం రేణుక, అంగన్‌వాడీ టీచర్‌, తిర్మలరాయినిగూడెం, శాలిగౌరారం

వీడియో కాల్‌ చేసి డాక్టర్‌తో మాట్లాడిస్తున్నా..
గత లాక్‌డౌన్‌ సమయంలో ఇంటింటికీ వెళ్లి సేవలు అందించినప్పుడు నాకు పాజిటివ్‌ వచ్చింది. అయినా భయపడలేదు. మనోధైర్యంతో డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడి పూర్తిగా కోలుకున్నా. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో భాగంగా గ్రామంలో బాధితులకు నా అనుభావాన్ని చెప్పి ధైర్యపరుస్తున్నాను. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారితో మా పీహెచ్‌సీ డాక్టర్‌తో వీడియో కాల్‌ చేసి మాట్లాడిస్తున్నాను. డ్యూటీ ముగిసిన తరువాత ఇంటికెళ్లి పిల్లలను దగ్గరకు తీసుకోలేకపోవడం కొంత బాధగా ఉంది.

  • మామిడి లక్ష్మి, అనంతారం ఆశ కార్యకర్త, పెన్‌పహాడ్‌

గ్రామస్తులకు అవగాహన కల్పించా..
మా ఊరు లక్కవరంలో మొట్టమొదటగా కిరాణాషాపు అతడికి పాజిటివ్‌ వచ్చింది. గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో గ్రామ ప్రజలను రచ్చబండ వద్దకు పిలిచి కరోనాపై అవగాహన కల్పించాను. గ్రామంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయించా. 60 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించడం కోసం ప్రజా ప్రతినిధుల సహకారంతో ట్రాక్టర్‌లో తీసుకెళ్లి వ్యాక్సిన్‌ వేయించాను. నాకు ఇద్దరు పిల్లలు. రోజంతా గ్రామంలో కరోనా వ్యాప్తిని అరికట్టే పనిలో ఉంటూ నూటికి నూరుశాతం కరోనా నిబంధనలు పాటిస్తూ ఈరోజు వరకు ఇంటిలో ఆరోగ్య పూరితమైన వాతావరణాన్ని గడుపుతున్నాం.

  • రణపంగు శారద, లక్కవరం ఆశ కార్యకర్త, హుజూర్‌నగర్‌ రూరల్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆలుపెరుగని ఆశయం

ట్రెండింగ్‌

Advertisement