e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home నల్గొండ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నల్లగొండ పట్టణ పరిధిలోని ఆర్జాలబావి స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాముల్లో ఆ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ముందుగా బ్యాలెట్‌ పత్రాలను కట్టలు కడుతారు. రాత్రి 8 గంటల వరకు ఇదే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం అసలు కౌంటింగ్‌ మొదలవుతుంది. పోలైన 3,86,320 ఓట్లలో ప్రథమ ప్రాధాన్యత ఓట్లను రౌండ్‌కు 56 వేల చొప్పున 7 రౌండ్లలో లెక్కిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యి కోటా నిర్ధారణ అయ్యే సరికి గురువారం ఉదయం 6 గంటలు కావచ్చని భావిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రం పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్‌ పెట్టారు. మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిఘా కొనసాగనున్నది. మరోవైపు మంగళవారం సాయంత్రం నుంచే నల్లగొండ జిల్లా కేంద్రంలో సందడి మొదలైంది. అభ్యర్థులు, వారి కౌంటింగ్‌ ఏజెంట్లు, కార్యకర్తలు, అభిమానుల రాకతో హోటళ్లు, లాడ్జీలన్నీ నిండాయి.

నల్లగొండ ప్రతినిధి, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నేడు ఉదయం ప్రారంభం కానుంది. సరిగ్గా ఉదయం 8గంటలకు అభ్యర్థులు, వారి కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్స్‌లను ఓపెన్‌ చేయనున్నారు. నల్లగొండ పాలిటెక్నిక్‌ కాలేజీ పక్కనే గోదాముల్లో మొత్తం ఎనిమిది కౌంటింగ్‌ హాల్‌లో లెక్కింపు జరుపనున్నారు. ఒక్కో హాల్‌లో ఏడు.. మొత్తం 56టేబుళ్లపై నిరాటంకంగా లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. లెక్కింపునకు రెండురోజుల సమయం పట్టవచ్చని భావిస్తున్న అధికారులు మూడు షిప్టులుగా సిబ్బందిని నియమించారు. సమయంతో సంబంధం లేకుండా తొలి షిఫ్టులో విధులకు హాజరయ్యే సిబ్బంది బ్యాలెట్ల పత్రాలు కట్టలు కట్టే కార్యక్రమం ముగిసే వరకు ఉంటారు. రెండో షిఫ్టు సిబ్బంది తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు, మూడో షిఫ్టు సిబ్బంది ఎలిమినేషన్‌ ప్రక్రియ ముగిసి విజేత తేలే వరకు విధులు నిర్వర్తించేలా ఆదేశాలు ఇచ్చారు.   కౌంటింగ్‌ ఏజెంట్లకు కూడా మూడు షిప్టుల వారీగా పాసులు జారీ చేశారు. మొత్తం 731పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఒక్కో కేంద్రానికి ఒక్కో బ్యాలెట్‌ బాక్స్‌ను వినియోగించారు. వీటిని టేబుళ్ల వారీగా విభజించగా ఒక్కో టేబుల్‌పై 13 బ్యాలెట్‌ బాక్స్‌లను కేటాయిస్తారు. ఈ బాక్స్‌లన్నింటినీ ఓపెన్‌ చేసి ముందుగా 25 బ్యాలెట్లను ఒక కట్టలా కడుతారు. వీటిని ఎప్పటికప్పుడూ అదే రూమ్‌లో ఏర్పాటు చేసే ప్రత్యేక డ్రమ్ముల్లో వేస్తారు. ఈ ప్రక్రియ సుమారు 10 నుంచి 12 గంటలపాటు కొనసాగవచ్చని అంచనా. ఇది ఎప్పుడు పూర్తయితే అప్పుడు రెండో షిఫ్టు సిబ్బంది విధులకు వస్తారు. 

రాత్రి 8నుంచి అసలు కౌంటింగ్‌..

బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలు పెట్టనున్నారు. ఒక్కో టేబుల్‌కు 40బండిల్స్‌ చొప్పున పంపిణీ చేసి మొత్తం వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ఇలా లెక్కించే సమయంలోనే అభ్యర్థులకు వచ్చే ఓట్లను వారికి, చెల్లని ఓట్లను ప్రత్యేకంగా ఓ బాక్స్‌లో వేస్తారు. ఇలా మొత్తం ఒక్కో రౌండ్‌లో 56వేల ఓట్ల లెక్కింపు జరుగనుంది. మొత్తం ఏడు రౌండ్లు కొనసాగనుండగా ఒక్కో రౌండ్‌కు కనీసం గంట నుంచి గంటన్నర సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. ఇదంతా పూర్తయ్యే సరికి గురువారం ఉదయం ఆరు గంటలు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యే సరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపై అదేవిధంగా చెల్లని ఓట్లపై స్పష్టత రానుంది. చెల్లని ఓట్లను ఒక చోటకు చేర్చి లెక్కించి మొత్తం పోలైన ఓట్లలోంచి మైనస్‌ చేస్తారు. చెల్లిన ఓట్లల్లోంచి గెలుపు కోటాను నిర్ధారిస్తారు. మొత్తం చెల్లిన ఓట్లలో 50శాతం+1 గెలుపు కోటా కానుంది. అప్పటికీ ఏ అభ్యర్థి గెలుపు కోటా ఓట్లు సాధించలేకపోతే ఎలిమినేషన్‌ ప్రక్రియను మొదలుపెడతారు. ఈ ప్రక్రియకు మూడో షిఫ్టు సిబ్బంది విధుల్లోకి వస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతితక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్‌ రౌండ్‌ను ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్‌లో పడిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారీగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కింది నుంచి పైకి ఎలిమినేట్‌ చేస్తూ కౌంటింగ్‌ కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్‌ను నిలిపి వేసి విజేతను ప్రకటిస్తారు. అయితే మొత్తం 71మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎలిమినేషన్‌ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ విజేత తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించనున్నారు. 

పకడ్బందీ ఏర్పాట్లు..

రెండ్రోజులపాటు జరుగనున్న ఓట్ల లెక్కింపునకు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ హాల్‌ వెలుపుల, లోపల కలిపి మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కిలోమీటర్‌ పరిధిలో 144సెక్షన్‌ విధించారు. పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద మెయిన్‌ ఎంట్రెన్స్‌లోనే పాసులు ఉంటేనే లోపలికి అనుమతించేలా చర్యలు చేపట్టారు. తర్వాత కౌంటింగ్‌ హాల్‌ చుట్టూ భద్రత ఏర్పాటు చేస్తూ పెట్రోలింగ్‌ కూడా నిర్వహిస్తారు. ఇక కౌంటింగ్‌ హాల్‌ ఆవరణలో మరో టీం భద్రత విధుల్లో ఉంటుంది. స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద భద్రత చివరి వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో కౌంటింగ్‌ ఏరియాలో మొత్తం 50సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు.  మరోవైపు మంగళవారం కూడా కౌంటింగ్‌ హాల్‌ వద్ద తుది దశ శిక్షణ కొనసాగింది. రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్లు వనమాల చంద్రశేఖర్‌, రాహుల్‌శర్మ కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు, అసిస్టెంట్లకు, సిబ్బందికి తగిన సూచనలు చేస్తూ బిజీబిజీగా గడిపారు. మొత్తం ఎనిమిది హాళ్లను ఒకే గోదాంలో వరుసగా  ఏర్పాటుచేశారు. ఇప్పటికే కౌంటింగ్‌ టేబుళ్లు, వాటికి ఆనుకుని బ్యాలెట్‌ పత్రాలను వేసేందుకు అభ్యర్థుల వారీగా ప్రత్యేక ర్యాక్‌లు, ఈ టేబుళ్లకు ఎదురుగా ఇనుప జాలీ ఏర్పాటు చేసి మరోవైపు కౌంటింగ్‌ ఏజెంట్లు కూర్చునేలా కుర్చీలు వేశారు. అభ్యర్థుల వారీగా బ్యాలెట్‌ పేపర్లను వేసేందుకు ప్రత్యేకంగా డ్రమ్ములను ఏర్పాటు చేశారు. ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా ఉండనుండడంతో ప్రతీది పక్కా ప్రణాళికతో సిద్ధం చేశారు. అదేవిధంగా వేసవి కావడంతో ఫ్యాన్లు, కూలర్లు ఇతర సామగ్రితో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కౌంటింగ్‌కు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ప్రకటించారు. కౌంటింగ్‌కు వచ్చే అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. షిఫ్టుల   ప్రకారం అందరూ నడుచుకోవాలని కోరారు. ఇక ఒక్కో షిప్టునకు 300మంది చొప్పున రెండు షిఫ్టుల్లో పోలీసులు బందోబస్తులో ఉంటారని ఎస్పీ రంగనాథ్‌ వెల్లడించారు.   పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ కేంద్రం ఏరియాలో 144సెక్షన్‌ అమలులో ఉన్న కారణంగా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ గుమికూడవద్దని సూచించారు. కౌంటింగ్‌కు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ట్రెండింగ్‌

Advertisement