e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జిల్లాలు కాల్వ కింద చివరి దాకా నీళ్లు

కాల్వ కింద చివరి దాకా నీళ్లు

  • మేజర్‌, మైనర్‌ కాల్వల మరమ్మతులతో
  • చివరి భూములకు సాగునీరు
  • స్థిరీకరించిన ఆయకట్టుకు 30 ఏండ్ల
  • తర్వాత పూర్తి స్థాయిలో అందుతున్న నీరు

మిర్యాలగూడ/ మిర్యాలగూడ రూరల్‌, సెప్టెంబర్‌ 14 : నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ, మేజర్‌, మైనర్ల మరమ్మతులతో సుదీర్ఘ కాలం తర్వాత ఆయకట్టు ప్రాంతంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందుతున్నది. దీంతో రైతులు నూరు శాతం వరి సాగు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నాగార్జునసాగర్‌ ప్రధాన, మేజర్‌, మైనర్‌ కాల్వల ఆధునీకరణకు ప్రపంచబ్యాంకు నుంచి నిధులు మంజూరయ్యాయి. కానీ పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ సాగర్‌ ఆధునీకరణ పనులను వేగంగా పూర్తి చేయించారు. శిథిలమైన మెయిన్‌ కెనాల్‌ పూర్తిగా రెండు వైపులా సీసీ లైనింగ్‌ వేశారు. దీంతో నీటి వృథా భారీగా తగ్గింది. అదేవిధంగా మేజర్‌, మైనర్‌ కాల్వ కట్టల పునర్నిర్మాణం, షట్టర్లు, తూముల మరమ్మతులు చేయడంతో 30 ఏండ్లుగా పడావుబడ్డ ఆయకట్టు చివరి భూములు నేడు సస్యశ్యామలంగా మారాయి.

ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటి పొదుపు..

- Advertisement -

నీటిని పొదుపు చేయాలని భావించిన ఎన్నెస్పీ అధికారులు ఏడేండ్ల క్రితం ఎడమ కాల్వకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో సాగునీరు విడుదల చేశారు. ఈ విధానంలో మొదట నెల పాటు నీటిని వదిలేవారు. ఈ నెల రోజుల్లో రైతులు వరి నాట్లు పూర్తి చేసేవారు. అనంతరం ఆరు రోజుల పాటు కాల్వకు నీళ్లు ఆపి ఆ తర్వాత 9 రోజుల పాటు విడుదల చేసేవారు. ఈ పద్ధతితో నీటి పొదుపు పెరిగింది. పొలాలు ఆరుకుంటూ పారడంతో దిగుబడులు సైతం పెరిగాయి. దీంతో అధికారులు ఏడేండ్లుగా ఈ పద్ధతినే కొనసాగిస్తున్నారు.

టేలాండ్‌ భూములకు సాగునీరు

గతంలో నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు ప్రాంతంలో కాల్వ చివరి భూములకు సాగు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వజీరాబాద్‌, ముదిమాణిక్యం, ముల్కలకాల్వ, కొత్తగూడెం మేజర్ల కింద ముల్కలకాల్వ, రాయినిపాలెం, కొత్తగూడెం, లక్ష్మీపురం, రుద్రారం, కొత్తపేట, దామరచర్ల, వాచ్యాతండా, తెట్టెకుంట, వజీరాబాద్‌, నర్సాపురం, రాజగట్టు, తాళ్లవీర్పగూడెం, ఇర్కిగూడెం, ముదిమాణిక్యం, అడవిదేవులపల్లి, ముల్కచర్ల, బాల్నేపల్లి గ్రామాల్లోని సుమారు రెండు వేల ఎకరాల చివరి భూములకు నీరు అందని పరిస్థితి ఉండేది. నీటి కోసం రైతులు కాల్వ గట్టు మీద రేయింబవళ్లు గస్తీ తిరుగాల్సి వచ్చేది. అయినా అంతంత మాత్రమే నీళ్లొచ్చేవి. సాగునీటి కోసం రైతులు అవస్థలు పడుతున్నా.. అప్పటి ప్రభుత్వం గానీ, సంబంధిత అధికారులు గానీ పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగర్‌ ఎడమ కాల్వను, దాని కింద మేజర్‌, మైనర్‌ కాల్వలను దశల వారీగా సీసీతో ఆధునీకరించింది. దీంతో కాల్వల లీకేజీలు తగ్గడంతోపాటు అక్రమంగా గండ్లు పెట్టే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో మూడేండ్లుగా కాల్వ చివరి భూములకు నీరందుతున్నది.

నూరు శాతం వరి సాగు..

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టుకు ఏడేండ్లుగా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో సాగు నీటిని విడుదల చేస్తున్నాం. దీంతో నీటి పొదుపుతోపాటు చివరి భూములకు సాగునీరు అందుతుంది. చాలాకాలం తర్వాత సాగర్‌ ఎడమ కాల్వ కింద ఆయకట్టులో నూరు శాతం వరి పంటలు సాగు చేస్తున్నారు. రైతుల్లో చాలా వరకు నీటి పొదుపుపై అవగాహన వచ్చింది.

  • ధర్మానాయక్‌, ఎన్నెస్పీ ఎస్‌ఈ, మిర్యాలగూడ

సాగునీటి సమస్య శాశ్వతంగా తీరింది..

కాల్వల ఆధునీకరణతో చివరి భూములకు సాగునీటి సమస్య శాశ్వతంగా తీరింది. ఆధునీకరణకు ముందు కనీసం నారుమళ్లకు నీళ్లు అందేది కాదు. ఇప్పుడు నారుమడి మొదలుకొని పంట చేతి వచ్చేవరకు నీళ్లకు ఇబ్బంది లేదు. చివరి భూముల రైతులు ప్రశాంతంగా పంటలు సాగు చేసుకుంటున్నారు

  • రామచంద్రయ్య, ముల్కల కాల్వ, మిర్యాలగూడ

నీళ్లు పుష్కలంగా వస్తున్నయి..

ఎడమ కాల్వ కింద ముల్కలకాల్వ మేజర్‌ పరిధిలో చివర మా భూమి ఉంది. కాల్వల ఆధునీకరణ వల్ల ఇప్పుడు సాగు నీరు పుష్కలంగా అందుతుంది. ఆయకట్టుకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటి విడుదల చేయడం వల్ల పొదుపుగా వాడుతున్నాం. పొలాలు ఆరుకుంటూ పారడం వల్ల రోగాలు తక్కువగా వస్తున్నయి. పంటలు బాగా పండుతున్నయి.

  • బి.యాదగిరి, రైతు, శెట్టిపాలెం, వేములపల్లి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana