e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home నల్గొండ సంఘాలకు ‘సహకారం’

సంఘాలకు ‘సహకారం’

సంఘాలకు ‘సహకారం’
  • 45 పీఏసీఎస్‌లకు రెండో దశ రుణాలు
  • తొలిదశలోని 15 సొసైటీలకు రూ.8.42 కోట్లు విడుదల
  • 4 శాతం వడ్డీ… సకాలంలో చెల్లిస్తే 3 శాతం రిబేట్‌
  • త్వరలో వ్యాపార కార్యకలాపాలకు ఏర్పాట్లు
  • సహకార సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

నల్లగొండ, జూలై 12 : ప్రాథమిక సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పట్టణాలకు సమీపంలో ఉన్న సొసైటీలతోపాటు మారుమూల ప్రాంతాల్లోని వాటిని సైతం ఆర్థికంగా బలోపేతం చేయలన్న ఉద్దేశంతో నాబార్డు ద్వారా రుణాలు అందజేయనున్నది. ఎంఎస్‌సీ(మల్టీపర్పస్‌ సర్వీస్‌ పథకం) ప్రోగ్రామ్‌ ప్రవేశపెట్టి సొసైటీలకు నిధులు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో 107 సొసైటీలు ఉండగా ఇప్పటికే తొలి దఫాలో 15 సొసైటీలకు రూ.8.42 కోట్లు విడుదల చేసిన నాబార్డు మలి దశలో మరో 45సంఘాలను ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన వివరాలను డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి సోమవారం నల్లగొండ కార్యాలయంలో జరిగిన ఆయా సొసైటీల చైర్మన్లు, సీఈఓల సమావేశంలో వెల్లడించారు.

టెండర్ల నిర్వహణకు ఏర్పాట్లు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 107 ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు టెస్కాబ్‌ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 15 పీఏసీఎస్‌లను ఎంపిక చేసి వాటికి రూ.8,42,28,300 నాబార్డు విడుదల చేసింది. మూడేండ్ల కాలంలో ప్రతి సొసైటీ గరిష్టంగా రూ.2 కోట్లు వినియోగించుకునే అవకాశం కల్పించడంతోపాటు ఆ రుణాలకు 4శాతం వడ్డీ మాత్రమే విధించింది. అయితే సకాలంలో రుణాలు చెల్లిస్తే మూడు శాతం రిబెట్‌తోపాటు ప్రాసెసింగ్‌ ఫీజు, ఎవాల్యూయేషన్‌ను సైతం మినహా ఇస్తారు. తొలి దశలో కోదాడ, తిప్పర్తి, చౌటుప్పల్‌, పోచంపల్లి, మేళ్లచెర్వు, హుజూర్‌నగర్‌, బాబాసాహెబ్‌పేట, అడ్డగూడూరు, ఎర్రవరం, కందిబండ, బేతవోలు, ఏలే అన్నారం, చింతలపాలెం, బి.అన్నారం, రాయినిగూడెం సొసైటీలు ఉండగా ఆయా సొసైటీల్లో ఎంపిక చేసిన పనుల నిర్వహణకు టెండర్లు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

- Advertisement -

మరో 45 సంఘాలకు నిధులు..
తొలి దఫాలో 15 సంఘాలకు నిధులు విడుదల చేసిన నాబార్డు రెండో దఫాలో 45సంఘాలను ఎంపిక చేసింది. ఈ సారి ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న సొసైటీలపైనే డీసీసీబీ దృష్టి సారించింది. సుమారు రూ.25 కోట్ల మేరకు నిధులు వచ్చే అవకాశం ఉంది. ఆయా సొసైటీల్లో కొన్నింటికి భూములుండగా మరికొన్నింటికి లేవు. దాంతో టెస్కాబ్‌ ఇటీవల సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలిసి పీఏసీఎస్‌లకు ప్రభుత్వ భూములను కేటాయించాలని కోరడంతో రెవెన్యూ యంత్రాంగానికి ఆయన సూచనలు చేశారు. భూములు అవకాశం లేని సొసైటీ చైర్మన్లు సంబంధిత జిల్లా సహకార అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకుంటే అందుబాటులోఉన్న భూమి కేటాయించనున్నారు. తొలి దశలో ఈ అవకాశం లేనప్పటికీ ఈ దఫా సంఘాలకు కల్పించడం మంచి పరిణామం.

నిర్మాణాలు చేపట్టాల్సింది ఇవే..
నాబార్డు ప్రధానంగా వ్యాపార ధృక్పథాన్ని దృష్టి లో పెట్టుకొని రుణాలు ఇస్తున్నప్పటికీ టెస్కాబ్‌ ప్రత్యేక గైడ్‌లైన్స్‌ ప్రకారమే వ్యాపారాలు చేయాల్సి ఉంది. అందులో గోదాంల నిర్మాణం, రైస్‌మిల్లులు, శీతలీకరణ కేంద్రాలు, అగ్రి అవుట్‌లెస్‌ సూపర్‌మార్కెట్లు, పెట్రోల్‌ బంక్‌లు, వరికోత మిషన్లు, ఫార్మర్స్‌ ఇన్‌పుట్స్‌, దాల్‌మిల్లు లాంటివి ఉన్నాయి. ఇవికాకుండా స్థానిక రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వారి అవసరాల నిమిత్తం ఇతర పనులు చేపట్టినప్పటికీ ప్రత్యేక అనుమతితో ఆవకాశం ఇవ్వనున్నారు. అయితే ఏ వ్యాపారం చేయాలి అనేది సంబంధిత సొసైటీ చైర్మన్‌, సీఈఓతోపాటు ఒక డైరెక్టర్‌తో కూడిన త్రీమేన్‌ కమిటీ ద్వారా నిర్ణయించాల్సి ఉంది. ఈ నిర్మాణాలకు డీసీసీబీలోని ఇంజినీర్‌ విభాగం మాత్రమే అంచనా వేసి తుదిరూపు ఇవ్వనుంది.

నాణ్యంగా నిర్మాణాలు చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం, టెస్కాబ్‌ సూచన మేరకు నాబార్డు ఎంఎస్సీ పథకం ద్వారా మూడు విడుతల్లో 107 సొసైటీలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తొలిదశలో 15 సంఘాలకు రూ.8.42 కోట్లు ఇచ్చిన నాబార్డు రెండో దశలో రుణాలు ఇవ్వడానికి మరో 45సంఘాలను ఎంపిక చేసింది. తొలి దశలోని పనులకు టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశించాం. అయితే ఈ నిధులను సద్వినియోగం చేసుకుని నాణ్యతతో పనులు చేపడితేనే బిల్లులు ఇస్తాం. ప్రతి సొసైటీ రూ.2 కోట్లు వినియోగించుకునే అవకాశం ఉంది. అందులో 10శాతం సొసైటీలే భరించాలి. రుణాలకు 4శాతం వడ్డీ మాత్రమే. సకాలంలో చెల్లించిన వారికి మూడు శాతం రిబెట్‌ ఇస్తాం.

  • గొంగిడి మహేందర్‌రెడ్డి,డీసీసీబీ చైర్మన్‌, నల్లగొండ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సంఘాలకు ‘సహకారం’
సంఘాలకు ‘సహకారం’
సంఘాలకు ‘సహకారం’

ట్రెండింగ్‌

Advertisement