e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home నల్గొండ పీహెచ్‌సీల్లో ఐసొలేషన్‌ కేంద్రాలు

పీహెచ్‌సీల్లో ఐసొలేషన్‌ కేంద్రాలు

పీహెచ్‌సీల్లో ఐసొలేషన్‌ కేంద్రాలు
  • 24 గంటల దవాఖానల్లో సరిపడా ఆక్సిజన్‌
  • కొవిడ్‌కు ధైర్యమే మందు
  • రెమ్‌డెసివిర్‌ కొరత లేకుండా ఏర్పాట్లు
  • అధికారుల సమీక్షలో మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్లగొండ ప్రతినిధి(నమస్తే తెలంగాణ), మే 12 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఐసొలేషన్‌ ఉండేలా ఏర్పాట్లు చేయాలని, నల్లగొండ జిల్లాలో 24 గంటలు నడిచే 18 పీహెచ్‌సీలను ఇందుకోసం గుర్తించామని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం మేరకు బుధవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో కొవిడ్‌-19పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, డీఐజీ ఏవీ రంగనాథ్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా వైద్యాధికారి కొండల్‌రావు, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్‌ జైసింగ్‌ రాథోడ్‌, డీసీహెచ్‌ మాతృ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చండూరు, చిట్యాల, కనగల్‌, కేతేపల్లి, మునుగోడు, శాలిగౌరారం, తిప్పర్తి, దామరచర్ల, హాలియా, నిడమనూరు, పెద్దవూర, వేములపల్లి, డిండి, గుడిపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పీఏపల్లి కేంద్రాల్లో కొవిడ్‌ రోగులకు ఐసొలేషన్‌కు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానలకు వచ్చిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అవసరమైన మెడిసిన్‌కు ఇండెంట్‌ పెట్టాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌కు మంత్రి సూచించారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అన్ని వెంటిలేటర్లు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ పేషెంట్లకు ధైర్యమే మందు అని, వైద్యులు, సిబ్బంది భరోసా కల్పించాలని కోరారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 4లక్షల 50వేల 895 మందికి పరీక్షలు చేయగా 40,695 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు మంత్రి తెలిపారు. అందులో 10,290 మంది హోం ఐసొలేషన్‌లో ఉండగా 703 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఇప్పటి వరకు 72.64శాతం రికవరీ ఉందని, 29,560 మంది పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. మొత్తం జనాభాలో 25.87శాతం టెస్టులు చేయగా 9.03 శాతం పాజిటివ్‌గా నమోదు అవుతున్నాయన్నారు. రెమ్‌డెసివిర్‌ పేరుతో ఎక్కువ మొత్తం వసూలు చేస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో 1400 బృందాలను ఏర్పాటు చేసి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నామన్నారు. కొవిడ్‌ వచ్చినంత మాత్రాన ఆందోళన పడొద్దని, వైద్యుల సలహాలు పాటిస్తే రికవరీ కావొచ్చని తెలిపారు.

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం..మంత్రి జగదీశ్‌రెడ్డి
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు సంయమనం పాటించాలని, ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం నల్లగొండ కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం నల్లగొండ జిల్లాలో 376 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4,70,38 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. అందులో 22,944 మంది రైతులకు రూ. 335.97 లక్షల నగదు చెల్లింపులు జరిగాయని తెలిపారు. ముందెన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో దిగుబడి నమోదు కావడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని భావిస్తున్నారని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో అటువంటిదేమీ లేదన్నారు. ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌లో కొనుగోలుకు ఆటంకం కలుగకుండా చూడాలని ఎస్‌పీ ఏవీ రంగనాథ్‌కు సూచించారు. కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధ్యక్షతన జరిగిన సమీక్షలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, డీఐజీ ఏవీ రంగనాథ్‌ , అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జేడీఏ శ్రీధర్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్‌రావు, డీసీఓ ప్రసాద్‌, డీఆర్‌డీఓ పీడీ శేఖర్‌రెడ్డి, ఆర్టీఓ సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పీహెచ్‌సీల్లో ఐసొలేషన్‌ కేంద్రాలు

ట్రెండింగ్‌

Advertisement