e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home నల్గొండ పనులన్నీ.. 10గంటల్లోపే

పనులన్నీ.. 10గంటల్లోపే

పనులన్నీ.. 10గంటల్లోపే

నల్లగొండ ప్రతినిధి, మే12(నమస్తే తెలంగాణ):ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లాక్‌డౌన్‌ తొలిరోజు సంపూర్ణంగా అమలైంది. ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు కొనసాగాయి. కిరాణం, నిత్యావసర వస్తువుల దుకాణాలతో పాటు స్వీట్‌ షాపులు, బుక్‌స్టాల్స్‌, బట్టల దుకాణాలు ఇలా అన్ని రకాల వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. టీ స్టాల్స్‌, హోటళ్లు సైతం పది గంటల వరకు తెరిచే ఉన్నాయి. నల్లగొండలోని వ్యాపార కేంద్రాలన్నీ మాములు రోజుల్లో మాదిరిగానే పనిచేశాయి. దీంతో ప్రజలు తమకు అవసరమైన వస్తువులు, కూరగాయలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేస్తూ బిజీబిజీగా కనిపించారు. పది రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలులో ఉండనుండడంతో ముందే అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు. దీంతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్నిచోట్ల రద్దీ కనిపించింది. ఇక వైన్‌షాపులు కూడా ఉదయం ఆరు గంటలకే తెరుచుకోగా మందుబాబులు కొనుగోలు చేశారు. మంగళవారమే పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసినప్పటికీ బుధవారం కూడా అదేరీతిన క్యూలైన్లు కనిపించాయి.

10 గంటల నుంచి అన్నీ మూత
అప్పటివరకు సందడిగా కనిపించిన దుకాణాల సముదాయాలు సరిగ్గా పది గంటల నుంచి మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ వేళలు అమల్లోకి రావడంతో ప్రజలు ఇంటిబాట పట్టారు. పోలీసులు కూడా నిర్ణీత సమాయానికి ముందే రంగంలోకి దిగి సరిగ్గా లాక్‌డౌన్‌ టైమ్‌కు అన్ని మూసేలా చర్యలు తీసుకున్నారు. దుకాణాల మూసివేతతో పాటు రోడ్లపైనా జనసంచారం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను అమలు చేశారు. రోడ్లపైకి వచ్చే వారిని ఆపి చెక్‌ చేసి పంపించారు. అకారణంగా రోడ్లపైకి వచ్చినట్లు గుర్తిస్తే తొలిరోజు హెచ్చరికలతో సరిపెట్టారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నకిరేకల్‌, చిట్యాల, చండూర్‌ లాంటి ప్రధాన పట్టణాల్లో రోడ్లన్నీ బోసిపోయాయి. ప్రజలు పూర్తిగా ఇండ్లకే పరిమితమయ్యారు. నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌, ఏఎస్పీ నర్మద వేర్వేరుగా జిల్లా కేంద్రంలోని పలుకూడళ్లల్లో లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. పోలీసులకు సూచనలు చేస్తూ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లపైకి వచ్చే వాహనదారులను ఆపి ప్రశ్నించారు. అకారణంగా రోడ్లపైకి వస్తే జరిమానా విధించాలని బందోబస్తులో ఉన్న పోలీసులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నది. అన్ని మండల కేంద్రాలతో పాటు పెద్ద గ్రామాల్లో ప్రత్యేకంగా పోలీసులను నియమించారు. రోడ్లపైకి వస్తున్న వాహనదారులను నిలువరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన వారు మినహా మిగతా వారు ఇండ్లకే పరిమితమయ్యారు. అన్నిచోట్లా లాక్‌డౌన్‌ సంపూర్ణంగా కొనసాగుతున్నది.

ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం
నల్లగొండ రీజియన్‌ పరిధిలో ఆర్టీసీ బస్సులన్ని డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు సమీప ప్రాంతాల వరకు మాత్రమే బస్సులు నడిపించారు. ప్రయాణికులు కూడా పెద్దగా బస్టాండ్లకు వచ్చినట్లుగా కనిపించలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. పది గంటల తర్వాత ఒక్క బస్సుకూడా బయటకు రాలేదు. మరోవైపు విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపైన వాహనాల రాకపోకలకు అనుమతి ఉన్నా పెద్దగా రద్దీ కనిపించలేదు. అంబులెన్స్‌లు, వైద్య అవసరాల కోసం వెళ్తున్న వారి వాహనాలు, సరుకు రవాణా వాహనాలే తిరిగాయి. మిగతా ప్రజా రవాణా వాహానాలు లేవు. రాష్ట్ర రహదారులైన నార్కట్‌పల్లి-అద్దంకి, నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ రహదారులు మాత్ర బోసి పోయాయి. ఎక్కడికక్కడే చెక్‌పోస్టులతో వాహనాలు తిరగలేదు. కేవలం ముందస్తు అనుమతి ఉన్న, లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉన్న వాహనాలు మాత్రమే తిరిగాయి.

యథావిధిగా కొవిడ్‌ సేవలు, ధాన్య కొనుగోళ్లు
లాక్‌డౌన్‌ ప్రారంభమయ్యాక కూడా కొవిడ్‌ సేవలకు, ధాన్యం కొనుగోళ్లుకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొవిడ్‌ పరీక్షలు జిల్లా అంతటా నిర్వహించారు. సెకండ్‌ డోస్‌ వాక్సినేషన్‌ కూడా నిర్ధేశిత కేంద్రాలన్నింటిలోనూ కొనసాగింది. కొవిడ్‌తో పాటు ఇతర వైద్య అవసరాల కోసం వెళ్తున్న వారిని అనుమతించారు. ఆస్పత్రులు, మెడికల్‌ దుకాణాల సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ధాన్యం కొనుగోళ్లు కూడా సాధారణ రోజుల్లో మాదిరిగానే కొనసాగాయి. వాటి కోసం వెళ్తున్న రైతులకు, వాహనాలకు ఆటంకం కలుగలేదు. ధాన్యం రవాణా వాహనాలకు ప్రత్యేక అనుమతులు జారీ చేశారు. ఫర్టిలైజర్‌, ఎరువుల దుకాణాలు సైతం పనిచేశాయి. వీటితో పాటు బ్యాంకులు, ఏటీఎం సర్వీసులు తమ సేవలను అందించాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు నిర్దేశిత మేర హాజరయ్యారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పనులన్నీ.. 10గంటల్లోపే

ట్రెండింగ్‌

Advertisement