e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home నల్గొండ ప్రాసెస్‌ షురూ..

ప్రాసెస్‌ షురూ..

ప్రాసెస్‌ షురూ..
  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌
  • దామరచర్లలో రైస్‌ మిల్లింగ్‌ జోన్‌కు ప్రతిపాదనలు

నల్లగొండ ప్రతినిధి, జూన్‌11 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కృష్ణా జలాలకు తోడు గోదావరి జలాలు రావడం, మూసీ ద్వారా కూడా సాగునీరు అందుతుండడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మెట్టపంటల స్థానంలో వరిసాగు అధికమైంది. ఈ యాసంగిలోనూ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో సుమారు 11.50లక్షల ఎకరాల్లో వరిసాగైంది. రాబోయే రోజుల్లో అన్ని సీజన్లలో దాదాపు ఇంతే మొత్తంలో సాగు ఉండొచ్చని అంచనా. దీంతో దిగుబడులు కూడా పుష్కలంగా రానున్నాయి.

అత్యధిక ధాన్యం దిగుబడి
ఈ సీజన్‌లో అయితే ఉమ్మడి జిల్లా కలిపితే ధాన్యం దిగుబడి 21లక్షల మెట్రిక్‌ టన్నులకు మించి పోయింది. నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 10లక్షల మెట్రిక్‌ టన్నులకు పైనే దిగుబడి వచ్చింది. ధాన్యం దిగుబడులకు అనుగుణంగా జిల్లాలో మిల్లింగ్‌ సామర్థ్యం పెరగడం లేదు. ప్రస్తుతం వస్తున్న దిగుబడులకు మిల్లింగ్‌ సామర్థ్యానికి పొంతనే లేదు. నల్లగొండ జిల్లాలో చిన్నా పెద్దా కలిపి 180 వరకు, సూర్యాపేట జిల్లాలో 61 రైస్‌ మిల్లులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటి సామర్థ్యం వస్తున్న దిగుబడికి సరిపోవడం లేదు. మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్న మిల్లులు ఒక్కో సీజన్‌లో 2.5లక్షల మెట్రిక్‌ టన్నులను మాత్రమే మిల్లింగ్‌ చేయగలవని అధికారుల అంచనా. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, కట్టంగూర్‌, చిట్యాల తదితర ప్రాంతాల్లో ఉన్న మిల్లులన్నీ కలిపి మరో 80వేల నుంచి లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు మిల్లింగ్‌ చేసే కెపాసిటీ ఉన్నది. సూర్యాపేట జిల్లాలో లక్షన్నర మెట్రిక్‌ టన్నుల వరకు మిల్లింగ్‌ సామర్థ్యం ఉందని అంచనా. దీంతో ఒక్కో సీజన్‌లో మరో ఐదు నుంచి ఏడు లక్షల మెట్రిక్‌ టన్నుల కెపాసిటీని పెంచాల్సిన అవసరముంది. అప్పుడే రైతులు కూడా ధాన్యం అమ్ముకోవడానికి మరిన్ని అవకాశాలు మెరుగుపడతాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రత్యేక రైస్‌మిల్లింగ్‌ జోన్‌ ఏర్పాటుపై జిల్లా అధికారులు గతంలోనే దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల క్సోం ప్రత్యేకంగా సర్వే కూడా నిర్వహించారు. రైస్‌మిల్లింగ్‌ జోన్‌తో పాటు మిగతా ప్రాంతాల్లోనూ పలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లపైనా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు
మిర్యాలగూడ సమీపంలో ఉండే దామరచర్లలో రైస్‌మిల్లింగ్‌ జోన్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ పీజే పాటిల్‌, ఎమ్మెల్యే ఎన్‌.భాస్కర్‌రావుతో కలిసి గతంలోనే ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చాకే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

అందుబాటులో ప్రభుత్వ భూమి
2016-17 సంవత్సరంలో ఇక్కడ యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 5వేల ఎకరాల భూమిని సేకరించింది. అందులో ప్రస్తుతం 4500 ఎకరాలు మాత్రమే వినియోగిస్తున్నారు. మిగతా 500 ఎకరాలు ఒకేచోట అందుబాటులో ఉంది. ఇందులో 250 ఎకరాలను తీసుకొని రైస్‌మిల్లింగ్‌ జోన్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం భౌగోళికంగా అనువైన వాతావరణం కూడా ఉన్నది. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారితో పాటు రైలుమార్గం కూడా అందుబాటులో ఉంది. నీటి అవసరాలకు కొదవలేదు. గోదాములు కూడా అందుబాటులో ఉన్నాయి. చుట్టూ సాగర్‌ ఆయకట్టూ ఉంది. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లి, మఠంపల్లి మండలాలకు కూడా రవాణాపరంగా అనువుగా ఉంటుంది. రాష్ట్రంలోనే పెద్దదైన మిర్యాలగూడ లారీ ట్రాన్స్‌పోర్టు రంగం కూడా అందుబాటులో ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో రైస్‌మిల్లింగ్‌ జోన్‌ కోసం ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనను గతేడాది అక్టోబర్‌లోనే రాష్ట్ర ఇండస్ట్రియల్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ కార్పోరేషన్‌(టీఎస్‌ఐఐసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఇండస్ట్రియల్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ కింద భూమి కేటాయింపుతో పాటు మౌళిక వసతులు కల్పిస్తే చాలా మంది మిల్లులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా బాగా మెరుగు పడనున్నాయి. త్వరలోనే దీనిపై రాష్ట్రస్థాయి అధికారుల బృందం పరిశీలించనున్నట్లు తెలిసింది. అనంతరం సాధ్యమైనంత త్వరగానే స్పెషల్‌ జోన్‌ ఏర్పాటకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని తెలుస్తున్నది.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లపైనా కసరత్తు
దామరచర్లతో పాటు నల్లగొండ జిల్లాలోని మరికొన్ని చోట్ల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చిట్యాల మండలం వెల్మినేడులో, చిట్యాల, కట్టంగూర్‌, కేతేపల్లిలో కూడా భూమి అందుబాటులో ఉన్నది. ఆయా భూముల్లో అక్కడి పరిస్థితులకు అనువైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు కోసం అధికారులు ఆలోచన చేస్తున్నారు. కొండమల్లేపల్లి నుంచి దేవరకొండకు వెళ్లే దారిలోనూ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నది. దీంతో పాటు గుర్రంపోడు మండలం తానేదారుపల్లిలో వంద ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ అనువైన భూమి, వాతావరణం ఉన్నట్లు తేల్చారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఆయ ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేక జోన్లుగా రూపుదిద్దాలని జిల్లా యంత్రాంగం భావిస్తున్నది. ఆయా అంశాలపై జిల్లా అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించి గతంలోనే టీఎస్‌ఐఐసీకి పంపించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

రైస్‌మిల్లింగ్‌ జోన్‌కు ప్రతిపాదనలు
జిల్లాలో ధాన్యం దిగుమతులు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగా మిల్లింగ్‌ సామర్థ్యం ప్రస్తుతం లేదు. దీనిని పెంచాల్సిన అవసరం ఉందని గతంలోనే గుర్తించాం. ప్రత్యేక రైస్‌మిల్లింగ్‌ జోన్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. దామరచర్లలో తగినంత భూమితో పాటు రవాణా, గోదాములు, నీటి వసతి అనుకూలంగా ఉన్నట్లు టీఎస్‌ఐఐసీకి నివేదించాం. దీంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పలుచోట్ల భూములు ఉన్నట్లు తెలియజేశాం. రైస్‌మిల్లింగ్‌ జోన్‌తో పాటు పలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటకు అనువైన సౌకర్యాలు జిల్లాలో ఉన్నాయి. దీనిపై ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఇది కార్యరూపం దాలిస్తే రానున్న కాలంలో రైస్‌మిల్లింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లే.

  • కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రాసెస్‌ షురూ..

ట్రెండింగ్‌

Advertisement