అడ్డగూడూరు, మే 10 : దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న ప్రజల కల సాకారం కాబోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ్ద వహించి నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా శాలిగౌరారం మండలం గురజాల-మానాయికుంట గ్రామాల మధ్యన ఉన్న మూసీ నదిపై బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మండల ప్రజలు మానాయికుంట, తిరుమలగిరి, తుంగతుర్తి, అడ్డగూడూరు తదితర గ్రామాలకు వెళ్లాలంటే గురజాల-మానాయికుంట గ్రామాల మధ్యన ఉన్న మూసీ ఏటి లోంచి నీళ్లగుండా వెళ్లాల్సి వచ్చేది. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. ఏరు దాటి అవతల గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. సమస్యను కళ్లారా చూసిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పం పారు. దీంతో ప్రభుత్వం 2017లో బ్రిడ్జినిర్మాణానికి రూ.18 కోట్లు నిధులను మంజూరు చేసి పనులను ప్రారంభించింది. పనులను అప్పటి రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి.
తగ్గనున్న 30 కిలోమీటర్ల దూరం
వర్ష్షాకాలంలో మూసీ ప్రవహిస్తున్న క్రమం లో నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తి, తిరుమలగిరికి వెళ్లాలంటే ప్రజలు నకిరేకల్, సూర్యాపేట, అర్వపల్లి మండలాల మీదుగా సుమారు 30 కిలోమీటర్లు అదనంగా దూరం ప్రయాణం చేసి చేరుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతుండడంతో మూసీలో మట్టి రోడ్డు వేసి రాకపోకలు సాగిస్తున్నారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, నల్లగొండ జిల్లాలను కలిపి సుమారు 10 గ్రామాలకు చేర వేసే బ్రిడ్జి నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 20 పిల్లర్లకు సుమారు 18 పిల్లర్లు పూర్తయ్యాయి. వీటి మీద గడ్డర్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల కష్టాలను చూసి చలించిపోయా..
2014 ఎన్నికల్లో తుంగ తుర్తి ఎమ్మెల్యే అభ్యర్థ్ధిగా ప్రచారం చేసే రోజుల్లో ఏటి లోంచి నడుచుకుం టూ పోయే ప్రజల కష్టా లను చూసి చలించిపో యా. అధికారంలోకి రాగానే బ్రిడ్డి నిర్మాణం చేపడుతానని హామీ ఇచ్చాను. 2017లోనే బ్రిడ్జి నిర్మాణానికి శిలాఫలకం వేశాం కానీ ప్రతికూలక ప్రభావం కారణంగా విస్తారంగా కురిసిన వర్షాలకు కాస్త ఆలస్యమైన మాట వాస్తవం..ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.
– గాదరి కిశోర్‌కుమార్, ఎమ్మెల్యే, తుంగతుర్తి
ఎమ్మెల్యే కిశోర్ సహకారంతోనే..
మూసీ ఏటిలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందంటే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ప్రత్యేక చొరువే. వర్షం వస్తే ఏరు దాటాలంటే నానా ఇబ్బందులు పడేవాళ్లు. సైకిల్ మోటార్లను తోసుకుంటూ వచ్చేవాళ్లు. ప్రస్తుతం మూసీలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పినట్లయింది. తెలంగాణ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. – పొన్నాల వెంకటేశ్వర్లు,సింగిల్ విండో చైర్మన్, అడ్డగూడూరు