e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు కరోనా కాలపు హీరో.. అమ్మ

కరోనా కాలపు హీరో.. అమ్మ

కరోనా కాలపు హీరో.. అమ్మ

ఆపత్కాలంలో అలుపెరుగని పోరాటం
బిడ్డలను కంటిరెప్పలా కాపాడుకుంటున్న తల్లులు
గర్భిణులకయితే ప్రసవం దాకా ఒక యుద్ధమే
కరోనా సెలవులతో పిల్లలకు టీచరుగానూ మారిన అమ్మ
వైరస్‌ దరిచేరకుండా.. ఆరోగ్య రక్షణకు ఇంటి డాక్టరూ అమ్మే..

తల్లిని మించిన యోధులెవ్వరూ లేరన్నది నిజం. అసమాన ప్రేమను పంచే అమ్మ.. తన బిడ్డల బాగు కోసం ఏ త్యాగానికైనా సిద్ధమవుతుంది. ఎంతటి యుద్ధమైనా చేస్తుంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్న వేళ.. అమ్మే శక్తిస్వరూపిణై పిల్లలను కాపాడుకుంటున్నది. ఈ ఆపత్కాలంలో నవ మాసాలు కంటి రెప్పలా కాచుకుని.. పండంటి బిడ్డను ఈ భూమ్మీదికి తీసుకొస్తున్నది. కొవిడ్‌ పుణ్యమాని ఏడాదిన్నర నుంచి ఇంట్లోనే ఉంటున్న పిల్లలకు టీచరై ఆట పాటలతో విద్యాబద్ధులు నేర్పుతున్నది. స్మార్ట్‌ఫోన్లు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రోజుల్లో.. ఎదిగిన పిల్లలు గాడి తప్పకుండా ఓ స్నేహితురాలిగా సరైన మార్గంలో నడిపిస్తున్నది. అనుక్షణం ఆరోగ్యాన్ని పంచుతూ కరోనా దరి చేరకుండా ఇంటికి డాక్టర్‌గానూ సేవలందిస్తున్నది. తెల్లవారింది మొదలు అర్ధరాత్రి దాకా పిల్లలే లోకంగా, ప్రాణంగా అలుపెరగని పోరాటం చేస్తున్నఅమ్మ యోధురాలు గాక మరేమవుతుంది. అలాంటి తల్లులందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

  • నేరేడుచర్ల, మే 8

నేరేడుచర్ల, మే 8 : ఓర్పు, సహనానికి నిదర్శనం అమ్మ. ఇప్పటివరకు ఇల్లు చక్కదిద్దే పనిలో మాత్రమే నిమగ్నమయ్యే తల్లులకు నేడు మహమ్మారి కరోనాతో అదనపు పని భారం పడింది. పాఠశాలలు పూర్తిస్థాయిలో మూసి వేయడంతో పిల్లలకు విద్యాబుద్ధులు బోధించే గురువుగా మారింది. ఒక పక్క బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొనడంతో కుటుంబ సభ్యులంతా గృహాలకే పరిమితం కావడంతో ఇంటి పనిభారం సైతం అధికమవుతున్నది. గృహిణులుగా ఉన్న తల్లులు ఇబ్బందులు ఇలా ఉంటే ఉద్యోగాలు చేసే వారు మరింత కష్టాలు పడుతున్నారు. వర్క్‌ఫం హోం పేరుతో గృహంలోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఒక్క పక్క ఉద్యోగం, మరో పక్క ఇంటి వ్యవహారాలతో సతమతమవుతున్నారు. పిల్లల విషయంలో మాత్రం ప్రత్యేకశ్రద్ధ చూసుకుంటు న్నారు. ఏది ఏమైనప్పటికీ తల్లుల ఓర్పుకు కరోనా పరీక్ష పెడుతుందని చెప్పక చెప్పడమే. అలాంటి అమ్మ గురించి మదర్స్‌డే సందర్భంగా ప్రత్యేక కథనం.

లాలన.. పాలన..
నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో నొప్పులను సైతం లేక్క చేయకుండా బిడ్డకు జన్మనిచ్చి మురిసిపోతుంది అమ్మ. ఆపై ఆకలిగొన్న బిడ్డకు పాలిచ్చి లాలిస్తూ నిద్రలోకి జారేదాకా జోల పాడుతుంది. తప్పటడుగులు వేసే పని వయస్సులో తన చిటికెన వేలుతో మురిపిస్తుంది. ఆడుకుంటూ కింద పడితే కంగారుతో పరుగెత్తి ఓదార్చుతూ ధైర్యం నింపుతుంది. బిడ్డ శ్రేయస్సుకు ఎటువంటి త్యాగమైనా
చేస్తుంది.

కరోనాతో పెనుభారం
సుమారు ఏడాదిన్నార కాలం నుంచి కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. వైరస్‌ బారిన పడకుండా తల్లి తన పిల్లలను తరచూ కనిపెట్టుకొని ఉండడంతోపాటు కుటుంబసభ్యులతో కలిసి ఆమె పనులను చేస్తున్నది. చిన్నారులు ఆడుకోవడానికి బయటకు వెళ్లివచ్చిన వెంటనే వారికి శానిటైజర్‌తో చేతులను తరుచూ శుభ్రం చేయడంతో పాటు స్నానం చేయిస్తున్నది. వారికి కావాల్సిన పౌష్టికహారం అందిస్తున్నది. చాలా మంది తల్లులు చిన్నారులను బయ టకు పంపకుండానే ఇంట్లోనే ఆడుకునే విధంగా చూస్తున్నారు.

అమ్మ పాత్ర ఎంతో గొప్పది
ప్రతి తల్లి ఒక మంచి ఐఏఎస్‌ ఆఫీసరనే చేప్పాలి. కలెక్టర్‌ ఒక జిల్లాలోనే అన్ని శాఖలను ఎలా సమన్వయం చేసి నడుపుతుందో ఒక తల్లి కూడా ఇంటిలో ఉండే అన్ని శాఖలు, వ్యవహారాలను సమన్వయం చేసి ముందుకు నడుపుతుంది. ఇంటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూస్తుంది. పిల్లల మధ్యన గొడవలు రాకుండా, ఇంట్లోని వ్యక్తుల మధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పడంలో చొరవ తీసుకుంటుంది. రోజువారీ కార్యక్రమాలు, ఆదాయం, వ్యయం, బంధుమిత్ర వర్గం, క్రమశిక్షణ, ఇంటి నిర్వహణ అన్నింటినీ నేర్పుతో నిర్వహిస్తుంది. ఖర్చు చేయడంలో, పొదుపు చేయడంలో ఆమెకు సాటి మరొకరు లేరు. అనునిత్యం ఆమె ఇంటి గురించే ఆలోచిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న చాలా మంది నేను ఈ స్థాయికి రావడానికి నా తల్లి కృషి ఎంతో ఉందని చెబుతుంటారు. అందులో సందేహమేమీ లేదు.

అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నా
నాపేరు చింతకుంట్ల లక్ష్మి నేను మొదటి సారిగా పురుడు పోసుకోబోతున్నాను. కరోనా టైమ్‌లో నేను పురుడు పోసుకోవడం వల్ల చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. వైద్యుల సలహా మేరకు పౌష్టిక ఆహారం తీసుకుంటున్నా. ఆవిరి పట్టడంతోపాటు వ్యాయామం, యోగా చేస్తున్నా. దవాఖాన వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాం. రేపు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి, కరోనా బారిన పడకుండా ఉండడానికి ఇవి తప్పనిసరి అనుకుంటున్నా. బయట కొవిడ్‌ ఎక్కువగా ఉన్నందున ఫంక్షన్లకు కూడా వెల్లడంలేదు.
-చింతకుంట్ల లక్ష్మి, మాడ్గులపల్లి

అమ్మ ప్రేమపై అపురూపాలు
మాతృ దినోత్సవం సందర్భంగా నల్లగొండకు చెందిన గుర్రం వెంకన్న, మాధవి కూతురు మేఘన గీసిన చిత్రాలు ఆలోపించచేస్తున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తోపాటు కరోనా, లాక్‌డౌన్‌, హరితహారం తదితర అంశాలపై మేఘన గీసిన చిత్రాలు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు సైతం గెలుచుకున్నాయి.

  • రామగిరి, మే 8

బయట తిరుగకుండా చూస్తున్నా..
పిల్లలు చిన్నతనం నుంచి కష్టపడి చదువులో రాణించేందుకు తల్లిదండ్రుల పాత్ర కీలకం. ప్రస్తుతం కరోనా మహమ్మారితో పాఠశాలలు నడుస్తలేవు. దీంతో నేనే ప్రతి రోజూ ఇంటి వద్ద రెండు మూడు గంటలు చదివిస్తున్నా. బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా. మా పిల్లలకు కూడా చెప్పినట్టు వింటూ చదువుకుంటున్నరు.
-ఓరుగంటి స్రవంతి, తుంగతుర్తి

కుటుంబ బాధ్యతగా పనిచేస్తున్నా..
నేటి ఆధునిక యుగంలో అమ్మ బాధ్యతలు మరింత పెరిగాయి. ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. ఒకవైపు ఇంటిని చక్కదిద్దుతూనే మరోవైపు తన కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాను. కుటుంబ బాధ్యత మాదిరిగానే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నా.
-పోతరాజు రజిని, తిరుమలగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

మా పిల్లలకు ఏం కావాలో చేసి వెళ్తా..
నేను పుట్టి పెరిగింది వరంగల్‌ పట్టణం. తాతయ్య కిష్టయ్య గతంలో మార్కెట్‌ చైర్మన్‌గా చేసిన అనుభవం ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నాన్న పేరుతో నడుస్తున్న అంకిరెడ్డి ఫౌండేషన్‌ ద్వారా నియోజకవర్గంలో ప్రజలకు సేవలందించాం. మున్సిపల్‌ ఆఫీస్‌కు పోయే ముందు పిల్లలతో కాసేపు గడిపి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తా. మా చిన్న పాపకు మూడేండ్లు. ఆమెతో ఎక్కువ సమయం గడిపితే ఆ రోజు పడ్డ కష్టమంతా ఆవిరవుద్ది.
-గెల్లి అర్చన, హుజూర్‌నగర్‌
మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

బాధ్యతగా పనిచేస్తున్నా..
నాకు చిన్ననాటి నుంచే రాజకీయాలపై అవగాహన ఉంది. మా నాన్న రేపాల శేషయ్య నా చిన్నతనంలోనే రాజవరం గ్రామ సింగిల్‌ విండో చైర్మన్‌గా పనిచేశారు. వివాహం అయిన తర్వాత నా భర్త కూడా సింగిల్‌విండో డైరెక్టర్‌గా, పీఏసీఎస్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. నాకు ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసు. నా పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కుటుంబ బాధ్యతలు పెద్దగా లేకపోవడంతో మున్సిపాలిటీలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నా.
-వెంపటి పార్వతమ్మ శంకరయ్య, చైర్‌పర్సన్‌, హాలియా

సహకారం ఉంటే ఏదైనా చేయొచ్చు
నాకు 2018లో వివాహం అయిన సంవత్సరంలోనే నందికొండ మున్సిపాలిటీ ఏర్పడింది. 2020లో ఎన్నికలు వచ్చాయి. అప్పట్లో నాకు ఏడాది పాప ఉంది. మా కుటుంబ సభ్యుల సహకారంతో ఎన్నికల్లో గెలిచి చైర్‌పర్సన్‌ అయ్యాను. చిన్నవయస్సులోనే ఇంటి బాధ్యతలు, మున్సిపల్‌ పనులు చూసుకుంటున్నా. అందరి సహకారం ఉంటే ఏదీ ఇబ్బంది కాదు.
-కర్న అనుషారెడ్డి, నందికొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌
ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నా..
మున్సిపాలిటీలో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నా. ప్రజలకు ఏ అవసరం వచ్చినా తీర్చే ప్రయ త్నం చేస్తున్నా. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు అభివృద్ధి పనులకు ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నా. నా రాజకీయంలో నా భర్త ప్రోత్సాహం మరువలేనిది.
-వనపర్తి శిరీష, కోదాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా కాలపు హీరో.. అమ్మ

ట్రెండింగ్‌

Advertisement