e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home జిల్లాలు రోజంతా ముసురు

రోజంతా ముసురు

రోజంతా ముసురు

నల్లగొండ జిల్లాలో సగటున 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం
సూర్యాపేటలో సగటు వర్షపాతం 6.7మి.మీ
534 అడుగులకు చేరుకున్న సాగర్‌ నీటిమట్టం
కొనసాగుతున్న మూసీ పరవళ్లు

నల్లగొండ ప్రతినిధి, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా ముసురుకున్నది. కొన్నిచోట్ల భారీ వర్షం కూడా పడింది. ఈ సీజన్‌లో ఇప్పటికే సాధారణం కంటే అధికంగా నల్లగొండ జిల్లాలో 62.3 శాతం, సూర్యాపేట జిల్లాలో 30 శాతం వర్షపాతం నమోదైంది. బుధవారం నల్లగొండ జిల్లాలో అత్యధికంగా మునుగోడులో 12.6 మిల్లీమీటర్లు, సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 19.9 మిల్లీమీటర్ల వాన కురిసింది. మరోవైపు 2 గేట్ల ద్వారా దిగువకు మూసీ పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువ కృష్ణా నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్‌లోనూ క్రమంగా నీటి మట్టం పెరుగుతున్నది.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం వాతావరణం పూర్తి మేఘావృతమై చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు వర్ష ప్రభావం కనిపించింది. అధికారుల లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలోని 31 మండలాల్లో వర్షప్రభావం ఉండగా సగటున 4.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మునుగోడులో 12.6మి.మీ., చిట్యాలలో 9.3మీ.మీ., చండూరులో 9.2మి.మీ., దేవరకొండలో 6.6మి.మీ., నల్లగొండలో 5.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నిడుమనూరు, పెద్దవూర మండలాల్లో 1.4మి.మీ వర్షం కురిసింది. జూన్‌ ఒకటి నుంచి బుధవారం నాటికి జిల్లాలో సాధారణంగా 180.4మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 292.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే సాధారణం కంటే 62.3శాతం అదనంగా నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు అధికంగానే వర్షం కురిసింది. 95.2మి.మీ., సాధారణ వర్షపాతానికి గాను నిన్నటి వరకు 159.2మి.మీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. జిల్లాలోని మెజార్టీ మండలాల్లో ఈ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షం కురిసింది.

- Advertisement -

సూర్యాపేటలో 6.7 మిల్లీమీటర్లు
సూర్యాపేట జిల్లాలో బుధవారం సగటున 6.7మి.మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని మొత్తం 23 మండలాల్లోనూ ఎంతోకొంత వర్ష ప్రభావం కనిపించింది. అత్యధికంగా నడిగూడెం మండలంలో 19.9మి.మీటర్లు కురవగా ఆ తరవాత మునగాలలో 13.7మి.మీ., అనంతగిరిలో 10.8మి.మీ., చివ్వెంలలో 9.8మి.మీ., తుంగతుర్తిలో 9.5మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మఠంపల్లిలో కేవలం ఒక్క మిల్లీమీటర్‌ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్‌ ఒకటి నుంచి ఈ నెల 21వరకు జిల్లాలో 285.2మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇది సాధారణం కంటే 30శాతం అదనం కావడం విశేషం. సాధారణంగా 219.5మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. ప్రస్తుత నెలలోనూ సాధారణం కంటే జిల్లాలో అదనంగానే వర్షం కురిసినట్లు స్పష్టమవుతుంది.

సాగర్‌లో పెరుగుతున్న నీటి మట్టం
జిల్లాలో కీలకమైన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. కృష్ణానదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో శ్రీశైలం నుంచి రాష్ట్ర పరిధిలోకి వచ్చే ఎడమగట్టు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో పవర్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఆ నీరంతా నాగార్జునసాగర్‌కు వస్తున్నది. బుధవారం సాయంత్రానికి శ్రీశైలం పవర్‌ ఉత్పత్తి ద్వారా సాగర్‌కు 28,750 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తున్నది. సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులకు 534అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం పరిశీలిస్తే 312 టీఎంసీలకు 176 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరిగ్గా వారం రోజుల్లోనే 4అడుగుల నీటిమట్టం పెరగడంతో అదనంగా 9టీఎంసీల నీరు వచ్చిచేరింది. మరోవైపు శ్రీశైలంలోనూ నీటిమట్టం వేగంగా పెరుగుతుండడంతో ఎగువన వరద ఇలాగే కొనసాగితే త్వరలోనే పూర్తిస్థాయికి రావచ్చని అంచనా వేస్తున్నారు. శ్రీశైలంతోపాటు సాగర్‌లోనూ నీటి వాటాను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని కొనసాగిస్తుండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతోపాటు హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తడంతో ఆ వరద మూసీ ప్రాజెక్టుకు వస్తున్నది. దీంతో ఇప్పటికే మూసీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. సీజన్‌ ప్రారంభంలోనే ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తుండడంతో అంతటా హర్షం వ్యక్తమవుతున్నది.

రెండు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా బుధవారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 1880 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. గేట్ల ద్వారా 1625 క్యూసెక్కులు, కాల్వలకు 255 క్యూసెక్కులు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 637.97(2.77 టీఎంసీలు)అడుగులు ఉన్నట్లు ఏఈ ఉదయ్‌ తెలిపారు.

నాగార్జునసాగర్‌ జలసమాచారం
నందికొండ : నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు బుధవారం నాటికి 534.10అడగుల వద్ద 176.26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ, వరద కాల్వల ద్యారా, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం ద్వారా నీటి విడుదల లేదు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతున్నది. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు 28,250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 500 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులకు గాను 843.10 (66.69 టీఎంసీలు) వద్ద నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు 45,745 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రోజంతా ముసురు
రోజంతా ముసురు
రోజంతా ముసురు

ట్రెండింగ్‌

Advertisement