భక్తిశ్రద్ధలతో అగ్ని గుండాలు

- చెర్వుగట్టులో నిప్పుల గుండం నుంచి నడిచిన భక్తులు ..
- నేడు పుష్పోత్సవం
- చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా
సోమవారం తెల్లవారుజామున అగ్ని గుండాలు నిర్వహించారు. భక్తులు మది నిండా శివయ్యను స్మరిస్తూ కణకణమండే నిప్పు కణికలపై నడిచారు. కాలం బాగుండి, పంటలు బాగా పండాలని రైతులు ధాన్యం సమర్పించి వేడుకున్నారు. మంగళవారం ఏకాంత సేవ, పుష్పోత్సవం నిర్వహించనున్నారు.
నార్కట్పల్లి, ఫిబ్రవరి 22 : చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాల కార్యక్రమం కొనసాగింది. కణకణ మండే నిప్పుల గుండం నుంచి భక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా ఓం నమః శివాయ, శంభో శంకర, హరహర మహాదేవ అంటూ శివ నామకరణ మార్మోగింది. శివసత్తుల నాట్య విన్యాసాలు, ఆటపాటలు గట్టు క్షేత్రంలోని భక్తులను రంజింపజేశాయి. అంతకుముందు పర్వత వాహనంపై ఆసీనులైన పార్వతీ రామలింగేశ్వరులను మంగళవాయిద్యాల నడుమ అగ్ని గుండాల వద్దకు తీసుకొచ్చిన ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ప్రత్యేక హారతి ఇచ్చారు. అగ్ని దేవుడికి ఆవాహనం చేసి నిప్పుల గుండం వెలిగించారు. అనంతరం నిప్పులపై నుంచి ప్రధాన అర్చకులతో పాటు భక్తులు నడిచారు. తెలిసీ తెలియక చేసిన పాపాలు అగ్నితో దహింపజేయాలని వేడుకుంటూ పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు నిప్పులపై నడిచారు. పంటలు బాగా పండాలని, కాలం సమృద్ధిగా కావాలని ఆముదాలు, పత్తి, కందులు, మినుములు తదితర ధాన్యాలను రైతులు అగ్నిగుండంలో వేసి కోరుకున్నారు. అగ్ని గుండాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్పర్సన్ మేకల అరుణారాజిరెడ్డి, ఇన్చార్జి ఈఓ మహేంద్రకుమార్ మౌలిక వసతులు కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్గ బాలకృష్ణ, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. మంగళవారం స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నల్లగొండ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నేడు పుష్పోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారికి ఏకాంత సేవ, పుష్పోత్సవం నిర్వహించనున్నారు. అలాగే అష్టోత్తర శత కలశాలతో అభిషేకం, సూర్య నమస్కారాలు, దీక్షా హోమం, బలిహరణ, జయాది హోమం, మహా పూర్ణాహుతి, త్రిశూల స్నానం, వసంతోత్సవం, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు జరుపనున్నారు.