శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 22, 2021 , 01:37:03

అయిననూ.. అదే దుస్థితి

అయిననూ.. అదే దుస్థితి

  • రాజాపేట తండాలో చివరి మజిలీకి తిప్పలు 
  •  స్థల వివాదంతో నిలిచిన వైకుంఠధామం నిర్మాణం
  • శవాలకు సమీప గ్రామంలో దహన సంస్కారాలు 

మండలంలోని రాజాపేట తండా కొత్త పంచాయతీగా ఏర్పడినా చివరి మజిలీకి తిప్పలు తప్పడం లేదు. పల్లె ప్రగతిలో భాగంగా స్థలం కేటాయించి నిధులు విడుదల చేసినా పనులు సాగడం లేదు. ఇండ్లకు దగ్గరగా వద్దని కొందరు, తమ భూములకు దూరంగా నిర్మించాలని మరికొందరు వైకుంఠధామం నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. దీంతో పక్క గ్రామాలైన వట్టిపల్లి, మర్రిగూడకు శవాలను అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా అక్కడి వారూ రానివ్వడం లేదు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటేగానీ పరిష్కారం లభించేటట్లు లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. 

 మర్రిగూడ, ఫిబ్రవరి 21 : రాజాపేట తండా గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి తిప్పలే. గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడంతో సొంత స్థలం లేనివారి పరిస్థితి నరకప్రాయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి నిధులు మంజూరు చేసినా స్థల ఎంపికలో వివాదం కారణంగా వైకుంఠ ధామం నిర్మాణానికి అడుగు ముందుకు పడడం లేదు. అధికారులు జోక్యం చేసుకొని స్థలాన్ని సూచించినా పనులు ప్రారంభం కాలేదు. 

రాజాపేట తండా పంచాయతీ ఏర్పడి రెండేండ్లవుతున్నా నేటికీ వైకుంఠధామం నిర్మించలేదు. ఇప్పటికీ ఎవరైనా చనిపోతే శవాలను ఉమ్మడి గ్రామపంచాయతీ వట్టిపల్లి లేదంటే పక్క గ్రామమైన మర్రిగూడకు తరలించాల్సిందే. పల్లెప్రగతిలో భాగంగా వైకుంఠధామం నిర్మాణానికి రెవెన్యూ అధికారులు 316, 288, 320సర్వే నంబర్లలో ప్రభుత్వ స్థలాన్ని సూచించినా పనులు జరుగ లేదు. ఇండ్లకు దగ్గరగా వద్దని కొందరు, మా భూములకు దూరంగా నిర్మించాలని మరికొందరు దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్ఠించి ఇంకొందరు శ్మశానవాటిక నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. 

ఆది నుంచీ అడ్డంకులే..

గతంలో సర్వే నంబర్‌ 316లో శ్మశానవాటిక నిర్మాణానికి ఎకరం స్థలాన్ని కేటాయించారు. సమీప రైతులు దేవుళ్ల విగ్రహాలున్నాయని చెప్తూ పనులను అడ్డుకున్నారు. తిరిగి 288సర్వే నంబర్‌లో స్థలాన్ని కేటాయించగా.. వేరేచోటుకు మార్చాలని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డీపీఒ విష్ణువర్ధన్‌రెడ్డి గతేడాది జూలై 1న ఆర్డీఓ లింగ్యానాయక్‌తో కలిసి స్థలాన్ని పరిశీలించి గ్రామానికి దూరంగా సర్వే నెంబర్‌ 320లో స్థలాన్ని సూచించారు. కానీ, ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఆ స్థలంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం గమనార్హం. 

మృతదేహం 

మర్రిగూడకు తరలింపు..

రాజాపేట తండాకు చెందిన సూదమల్ల యాదయ్య అనే కానిస్టేబుల్‌ ఈనెల 6న అనారోగ్యంతో మృతిచెందాడు. వైకుంఠధామం నిర్మాణం కోసం అధికారులు ఎంపిక చేసిన స్థలానికి మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. దేవుడు వెలిశాడనే నెపంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. అప్పటికే తండ్రి చనిపోయి కొండంత బాధలో ఉన్న యాదయ్య కుమారులు గ్రామస్తుల వైఖరితో మరింత మనస్తాపానికి గురయ్యారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు మర్రిగూడ శ్మశాన వాటికలో దహనసంస్కారాలు జరిపించారు. 

ఆరోజు ఎంతో బాధపడ్డాం..

మా నాన్న చనిపోయిన రోజు పరిస్థితిని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. నాన్న శవాన్ని ఎక్కడ ఖననం చేయాలో అర్థం కాక చాలా ఏడ్చాం. మర్రిగూడలో అవకాశం కల్పించిన సర్పంచ్‌ నల్ల యాదయ్యతోపాటు గ్రామస్తులకు రుణపడి ఉంటాం. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాం. ఇంటి పన్ను కూడా కడుతున్నాం. ఓటు హక్కు కూడా ఉంది. అయినా వేరే ఊర్లో అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాం.                  

- సూధమల్ల సూర్యం, చంద్రం (అన్నదమ్ములు) 

ప్రజలకు ఇబ్బందులు  కలుగకుండా ఏర్పాటు చేయాలి..

శ్మశానవాటిక నిర్మాణంతో ప్రజలు ఇబ్బందులకు గురి కావద్దు. ఒత్తిళ్లకు లొంగకుండా అధికారులు స్థలాన్ని ఎంపిక చేయాలి. వివాదాస్పదం కాకుండా స్థలాన్ని సూచిస్తే నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. అధికారులు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు. 


VIDEOS

logo