మంగళవారం 09 మార్చి 2021
Nalgonda - Feb 21, 2021 , 01:16:04

గుంతలు తీశారు.. పనులు మరిచారు

గుంతలు తీశారు.. పనులు మరిచారు

  • నేటికీ ప్రారంభం కాని వైకుంఠధామం పనులు
  • అసంపూర్తిగా డంపింగ్‌ యార్డు
  • అన్నారెడ్డిగూడెంలో ముందుకు సాగని పల్లె ప్రగతి

నల్లగొండ రూరల్‌, ఫిబ్రవరి 20 : పల్లెలు పచ్చని వనాలుగా మారాలి.. పరిశుభ్రంగా ఉండి ఆరోగ్య వాతావరణం ఏర్పడాలన్న సర్కార్‌ సంకల్పాన్ని కొన్ని గ్రామాల్లో నీరుగారుస్తున్నారు. అధికారులతోపాటు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పల్లె ప్రగతి పనులు ముందుకు సాగడం లేదు. నల్లగొండ మండలంలోని అన్నారెడ్డి గూడెంలో అవే నీలినీడలు కనిపిస్తున్నాయి. వైకుంఠధామ నిర్మాణ పనులు గుంతలకే పరిమితం కాగా పూర్తికాని డంపింగ్‌ యార్డుతో గ్రామంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది. గ్రామంలో నాటిన మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. 

తొమ్మిది నెలలుగా అలాగే..

 గ్రామంలోని 69వ సర్వే నంబర్‌లో 5 ఎకరాల బంజరు భూమి ఉంది. ఇందులో 20 ఏండ్లుగా గ్రామస్తులు శ్మశానవాటిక, ఇతర అవసరాలకు ఉపయోగించారు. ఆ భూమి వివాదంలో ఉండగా కోర్టు తీర్పుతో రెవెన్యూ అధికారులు వైకుంఠధామం నిర్మాణానికి  పంచాయతీకి అప్పగించారు. దీంతో 9 నెలల క్రితం శంకుస్థాపన చేసి పిల్లరు గుంతలు తీసి వదిలేశారు. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. 

అలంకార  ప్రాయంగా డంపింగ్‌ యార్డు..

పారిశుధ్య నిర్వహణ 

కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇంటింటికీ తడి, 

పొడి చెత్త సేకరించాలని ట్రాక్టర్‌ కేటాయించింది. కానీ డంపింగ్‌ యార్డు పనులు పూర్తి కాకపోవడంతో చెత్త తరలింపులో నిర్లక్ష్యం నెలకొంది. అప్పుడప్పుడు మాత్రమే చెత్తను తరలిస్తుండడంతో పారిశుధ్య నిర్వహణ అధ్యానంగా తయారైంది.

 మొక్కల సంరక్షణేది?

పల్లెప్రగతిలో భాగంగా రోడ్డుకిరువైపులా మొక్కలు నాటి నందన వనాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఎవెన్యూ ప్లాంటేషన్‌కు శ్రీకారం చుట్టింది. వాటి నిర్వహణను పంచాయతీ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. మొక్కలకు నీళ్లు పోసే పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. 

నిర్మాణ పనుల్లో జాప్యం 

పల్లె ప్రగతితో గ్రామంలో వసతులు మారుతాయి అనుకున్నాం. వైకుంఠధామం పనులు ఇప్పటికీ ప్రారంభించలేదు. డంపింగ్‌ యార్డు పరిస్థితి అదే. గ్రామంలో చెత్త సేరణ సైతం అంతంత మాత్రమే. రోడ్ల వెంట నాటిన మొక్కలు బతికించడంలో విఫలమయ్యారు. 

-కొత్త సైదులు, గ్రామస్తుడు

వర్షపు నీరు రావడంతో పనులు ప్రారంభించ లేదు

గ్రామంలో వైకుంఠధామానికి కేటాయించిన స్థలం కోర్టు వివాదంలో ఉండడంతో ఆలస్యంగానే రెవెన్యూ అధికారులు అప్పజెప్పిండ్రు. పిల్లర్‌ గుంతలు తీసి శంకుస్థాపన చేయించాం. వర్షాలకు నీరు చేరడంతో పనులు ప్రారంభించలేకపోయాం. త్వరలో వైకుంఠధామం నిర్మాణ పనలు ప్రారంభిస్తాం. 

-బోధనపు సరస్వతి, సర్పంచ్‌, అన్నారెడ్డి గూడెం

VIDEOS

logo