బుధవారం 03 మార్చి 2021
Nalgonda - Feb 20, 2021 , 01:10:22

తలువాలకు తరలిరాగ..

తలువాలకు తరలిరాగ..

  • భక్తజనులతో కిక్కిరిసిన చెర్వుగట్టు
  • వైభవంగా బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
  • ప్రారంభించిన మండలి చైర్మన్‌ గుత్తా
  • చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి 
  • బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంగరంగ వైభవంగా, 

శాస్ర్తోక్తంగా అంకురార్పరణ చేశారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి హాజరై లాంఛనంగా ప్రారంభించారు. శనివారం తెల్లవారుజామున జరిగే కల్యాణోత్సవంలో ఇలవేల్పును కొలిచి తలంబ్రాలు సమర్పించేందుకు వివిధ జిల్లా నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొండ కింద, పైన సందడి నెలకొన్నది. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెర్వుగట్టు విశిష్టత తెలుసు : గుత్తా

చెర్వుగట్టు ఆలయ విశిష్టతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసునని,, ఆయన ఎప్పుడైనా ఆలయాన్ని సందర్శిస్తారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన అనంతరం శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకున్నాయన్నారు. అమావాస్య రోజు పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియజేస్తానని హామీ ఇచ్చారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు పూర్తిస్థాయిలో వసతులు అందించేందుకు దేవాలయ సిబ్బంది, ధర్మకర్తలు కృషి చేయాలని సూచించారు. 

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 19 : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. దేవాలయ చైర్మన్‌ మేకల అరుణారాజిరెడ్డి, ఆలయ ఇన్‌చార్జి ఈఓ మహేంద్రకుమార్‌, యాజ్ఞీకులు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని, ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

గణపతి పూజతో షురూ..

ఆరు రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని ఆలయ మహా మండపంలో వేద పండితులు శివశ్రీ పి.నీలకంఠ శివాచార్య, యాజ్ఞీకులు గణపతి పూజతో ప్రారంభ క్రతువును నిర్వహించారు. యాగశాల ప్రదక్షిణి, గణపతి పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పుణ్యాహవాచనం, పంచగవ్య పూజ, ప్రోక్షణ, ప్రాశన, ఋద్విగ్వరణ, దీక్షాదరణ, అఖండ స్థాపన, త్రిశూల పూజ సూర్య నమస్కార పూజలు చేశారు. అగ్ని ప్రతిష్ఠాపనతో నిర్వహించే ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, సర్పంచ్‌ మల్గ బాలకృష్ణ, యానాల అశోక్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు బూరుగు కృష్ణయ్య, కొండేటి వేణు, మారుపాక ప్రభాకర్‌రెడ్డి, కంకల యాదయ్య, వంపు శివశంకర్‌, పసునూరి శ్రీనివాస్‌, చిక్కుళ్ల యాదగిరి, కల్లూరి శ్రీను, దండు శంకరయ్య, బొబ్బలి దేవేందర్‌, రాధారపు భిక్షపతి, మేక వెంకట్‌రెడ్డి, చీర మల్లేశ్‌, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పత్యేక అలంకరణలో గణనాథుడు...

గణపతిపూజతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా గణనాథుడిని ప్రత్యేకంగా అలంకరించారు. పూజల అనంతరం భక్తుల సందర్శనార్థం ప్రధాన మండపం వద్దకు తీసుకువచ్చారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న గణనాథుడిని భక్తులు సందర్శించి తన్మయం పొందారు. 

నల్లగొండ నుంచి ఆర్టీసీ బస్సులు

నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 19 : చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ నల్లగొండ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మేనేజర్‌ రామచంద్రమూర్తి తెలిపారు. నార్కట్‌పల్లి, మిర్యాలగూడ డిపోల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు ఓ బస్సును ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌, భువనగిరి నుంచి నల్లగొండకు వచ్చే ప్రతి ఆర్డినరీ బస్సు చెర్వుగట్టు మీదుగా వెళ్తుందని తెలిపారు. వివిధ డిపోలకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు సైతం చెర్వుగట్టు స్టేజీ(ఎల్లారెడ్డిగూడెం) వద్ద నిలిపేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 


VIDEOS

logo