సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Feb 18, 2021 , 01:18:19

సీఎంఆర్‌లో మనమే టాప్‌

సీఎంఆర్‌లో మనమే టాప్‌

  • నల్లగొండ జిల్లాలో యాసంగి లక్ష్యం 99 శాతం పూర్తి
  • వానకాలంలో ఇప్పటికే 56% 

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి17(నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లతోపాటు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ప్రక్రియ నల్లగొండ జిల్లాలో వేగవంతంగా కొనసాగుతున్నది. గత యాసంగి సీజన్‌కు సంబంధించి 99 శాతం లక్ష్యం పూర్తిచేసి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలువగా, ప్రస్తుత వానాకాలంలోనూ అదే దూకుడును కొనసాగిస్తూ 56 శాతాన్ని దాటింది. ఈ నెలాఖరుకు నూరు శాతం చేరుకోవడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. సూర్యాపేట జిల్లా 24 శాతం, యాదాద్రి 28 శాతంతో మందకొడిగా సాగుతున్నాయి. సీఎంఆర్‌ ప్రక్రియను వేగంగా పూర్తయితే యాసంగిలో కొనుగోళ్లకు గోదాముల సమస్య ఉండదు. ప్రభుత్వం ఎఫ్‌సీఐకి చెల్లించే మొత్తానికి వడ్డీ ఆదా కూడా కానున్నది. కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ నేతృత్వంలో జాయింట్‌ కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ వానకాలంలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి సీఎంఆర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వానకాలం సీజన్‌లో మొత్తం 3,91,075 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి సీఎంఆర్‌ కోసం మిల్లర్లకు అప్పగించారు. సీఎంఆర్‌ అనంతరం 2,62,020 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. మొత్తం 89 రైస్‌మిల్లులను గుర్తించి ఈ ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం అప్పగించగా అందులో 15 మిల్లులు వందశాతం పూర్తి చేసి తిరిగి బియ్యాన్ని ఇచ్చేశాయి. మిగతా మిల్లుల్లోనూ వేగంగా జరిగేలా నిరంతరం సమీక్ష చేస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు 56శాతంతో 1,47,080 మెట్రిక్‌ టన్నులను పూర్తి చేసినట్లుగా అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. మిగతా ధాన్యాన్ని ఈ నెలాఖరుకు సీఎంఆర్‌ చేసి వందశాతం లక్ష్యాన్ని అధిగమించాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. కాగా ఈ వానకాలం సీజన్‌లో ఖమ్మం, ములుగు జిల్లాల నుంచి కూడా లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం నల్లగొండ జిల్లాకు అదనంగా కేటాయించారు. దీన్ని కూడా పూర్తి చేసి తిరిగి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌గా వెనక్కి ఇచ్చేశారు. ఇక ఇదే  సూర్యాపేట జిల్లాలో ఈ సీఎంఆర్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ఈ వానకాలం సీజన్‌లో సూర్యాపేటలో మొత్తం 3,02,990 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించారు. దాన్ని బాయిల్డ్‌ రైస్‌ లేదా రా రైస్‌గా మార్చి 2,03,004 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తిరిగి సీఎంఆర్‌ రూపంలో ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఇప్పటివరకు 24శాతంతో 47,875 మెట్రిక్‌ టన్నులను మాత్రమే సీఎంఆర్‌గా వెనక్కి తిరిగి ఇచ్చారు. వచ్చే నెలాఖరు నుంచి యాసంగి ధాన్యం తిరిగి మార్కెట్లకు వచ్చే సమయానికి దీన్నంతటినీ పూర్తి చేయాలంటే వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఇక యాదాద్రిభువనగిరి జిల్లాలోనూ 28 శాతమే సీఎంఆర్‌ పూర్తయ్యింది. ఇక్కడ 2,02,809 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం అప్పగించగా తిరిగి బియ్యంగా 1,35,896 మెట్రిక్‌ టన్నులు వెనక్కి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు 37,794 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే సీఎంఆర్‌గా చేరింది. ఇవి ఇలా ఉంటే సీఎంఆర్‌లో రాష్ట్ర సగటు 37.97శాతంగా ఉండడం గమనార్హం.  

యాసంగిలో నల్లగొండ 99శాతం పూర్తి.. 

 గత యాసంగిలో పెద్దపల్లి తర్వాత అత్యధికంగా 649229 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి నల్లగొండ జిల్లా రికార్డు సృష్టించింది. కరోనా లాక్‌డౌన్‌ ఇబ్బందులను సైతం అధిగమిస్తూ ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని మిల్లులకు సీఎంఆర్‌గా కేటాయించి వెంటపడ్డారు. గత యాసంగి ధాన్యానికి సంబంధించి 99శాతం సీఎంఆర్‌ పూర్తి చేసి రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం పండిన జిల్లాల్లో నల్లగొండను అగ్రస్థానంలో నిలిపారు. జిల్లాలో గుర్తించిన 107 రైస్‌ మిల్లులకు సేకరించిన ధాన్యాన్ని ఇచ్చి తిరిగి సీఎంఆర్‌గా 4,40,951 మెట్రిక్‌ టన్నుల బియ్యానికి గానూ 4,37,467 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని వెనక్కి తీసుకుని ఎఫ్‌సీఐకి ఇచ్చేశారు. మిగతా ఒక్కశాతాన్ని కూడా ఈ వారంలో పూర్తి చేసి వందశాతం లక్ష్యాన్ని చేరుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో సివిల్‌ సప్లయ్‌ అధికారులు, జిల్లా రైస్‌మిల్లర్ల సహకారంతో వెంటవెంటనే సీఎంఆర్‌ పూర్తి చేయగలుగుతున్నామని చెప్పారు. కాగా యాసంగిలో సూర్యాపేట జిల్లా 87శాతంతో 2,89,840 మెట్రిక్‌ టన్నుల బియ్యానికి గానూ 2,50,989 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్‌గా ఇచ్చారు. ఇక యాదాద్రి జిల్లాలో 80శాతంతో 2,08,149 మెట్రిక్‌ టన్నుల బియ్యానికి గానూ 166216 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించారు. కాగా గత యాసంగిలో సీఎంఆర్‌ రాష్ట్ర సగటు 88.99శాతంగా నమోదైంది. 

VIDEOS

తాజావార్తలు


logo