మంగళవారం 09 మార్చి 2021
Nalgonda - Feb 17, 2021 , 01:44:38

జన నేతకు వనకానుక

జన నేతకు వనకానుక

  • ‘కోటి వృక్షార్చన’కు ఉమ్మడి జిల్లా సిద్ధం
  • ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
  • మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో సూర్యాపేటలో 6,700 మొక్కలు 

ఆశయానికి ఆయువులూది స్వరాష్ర్టాన్ని సాధించి.. బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపేందుకు ఉమ్మడి జిల్లా సిద్ధమవుతున్నది. పుడమి తల్లి పులకించేలా లక్షల మొక్కలు నాటి ఆకుపచ్చ కానుక అందించేందుకు హరిత సంకల్పం తీసుకున్నది. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపునిచ్చిన కోటి వృక్షార్చనలో చేయిచేయి కలుపనున్నది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 వరకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో దాదాపు 15లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులతోపాటు సకల జనులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే గ్రామాలు, మున్సిపాలిటీలకు మొక్క ల సరఫరా పూర్తయింది. సీఎం కేసీఆర్‌ 67వ జన్మదినం సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో సూర్యాపేటలో 6, 700 మొక్కలు నాటనున్నారు.

ఆకుపచ్చ క్రతువు సీఎం సారుసల్లంగుండాలె...

‘చానా ఇండ్లల్లో దొడ్డు బియ్యమే తింటరు. అలాంటిది కేసీఆర్‌ సారు హాస్టళ్ల సన్నం బియ్యం బువ్వ పెడుతున్నడు’అని సూర్యాపేటకు చెందిన రజిత సంతోషంగా చెబుతున్నది. ‘కేసీఆర్‌ సారు తీసుకొచ్చిన అనేక పథకాలు ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆసరా అయితున్నయి. మేనమామ కట్నం కింద అన్నట్టు నా ఇద్దరు బిడ్డలకు  కల్యాణలక్ష్మి డబ్బులు ఇయ్యడం వల్ల పెండ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చినం’ అని దేవరకొండ నరేందర్‌నాయక్‌ తెలిపిండు. ‘కల్లు గీసినన్నినాళ్లు బాగనే ఉండే. వయస్సు మీదపడి చెట్లు ఎక్కడం బంద్‌ పెట్టినంక ఎట్లనో అనుకున్న. కేసీఆర్‌ సారు ఇస్తున్న పింఛన్‌తోని ఆ రంది తీరింది’ అంటుండు నడిగూడెం అంజయ్య. ‘ఏరువాకకు అప్పులు చెయ్యడం తప్ప మరొక దారి లేని మాకు రైతు బంధు ద్వారా పంటకు పెట్టుబడి పెడుతున్న కేసీఆర్‌ పెద్ద కొడుకు తీరు’అని రాచకొండ లక్ష్మమ్మ కండ్ల నీళ్లు తీసింది. ముఖ్యమంత్రి పదికాలాల పాటు సల్లంగుండాలె అని దీవిస్తున్నది ‘చిన్నప్పటి సంది మా ఊళ్లో మస్త్‌ సమస్యలుండే. కేసీఆర్‌ సారు పుణ్యమాని మా ఆవాస గ్రామం పంచాయతీ అయ్యింది. నేను సర్పంచ్‌ అయిన. ఊళ్లో సమస్యల్లేకుండా చూసుకుంటున్నం’ అని మదారిగూడెం సైదులు చెప్పుకొచ్చిండు.

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి16(నమస్తే తెలంగాణ) : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌' విశేషంగా ప్రాచుర్యం పొందింది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అధికారులు సైతం భాగస్వాములై మొక్కలు నాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని మరో హరితపండుగకు ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఒక గంటలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంగా దీనికి ‘కోటి వృక్షార్చన’గా నామకరణం చేశారు. ఈ కోటి వృక్షార్చనకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సిద్ధమైంది. ఇప్పటికే ప్రతి గ్రామపంచాయితీలో వెయ్యి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. మొక్కలు నాటేందుకు స్థలాల గుర్తింపు, గుంతలు తీయడం, మొక్కల ఎంపిక, సరఫరా కూడా దాదాపు పూర్తయ్యింది. దీంతో నల్లగొండ జిల్లాలోని 844 గ్రామాల్లో 8.44లక్షల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక సూర్యాపేట జిల్లాలోనూ మరో ఐదు లక్షల మొక్కలు నాటేందుకు రంగం సిద్ధమైంది. మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇవేకాకుండా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కోటి వృక్షార్చనలో భాగస్వామ్యం కానున్నారు. 

మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో...

సూర్యాపేటలో సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని వినూత్నంగా జరిపేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌ 67వ జన్మదినం సందర్భంగా ఒక్కో ఏడాదికి వంద మొక్కల చొప్పున మొత్తం 6700మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకోసం ప్రత్యేకంగా మొక్కలను ఎంపిక చేసి ఇప్పటికే తెప్పించారు. బుధవారం నిర్ణీత సమయంలో వీటన్నింటినీ నాటనున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించి జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. మంత్రితో పాటు ఇతర ముఖ్యనేతలంతా ఇక్కడ భాగస్వాములు కానున్నారు. నల్లగొండ జడ్పీ కార్యాలయంలోనూ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి మొక్కలు నాటనున్నారు. ఇక ఎమ్మెల్యేలంతా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులు కేక్‌కటింగ్‌తోపాటు రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, అన్నదానం చేయనున్నారు. 

పండుగలా నిర్వహించాలి..: తక్కెళ్లపల్లి

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను పండగలా నిర్వహించాలని, కోటివృక్షార్చనలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భాగస్వాములు కావాలని టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రజలంతా మొక్కలు నాటి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపాలన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు.


VIDEOS

logo