శనివారం 06 మార్చి 2021
Nalgonda - Feb 16, 2021 , 01:19:03

ఆకు పచ్చందాలు

ఆకు పచ్చందాలు

 • కోటి వృక్షార్చనను 
 • విజయవంతం చేయాలి : ఎమ్మెల్సీ తేరా

హాలియా, ఫిబ్రవరి 15 : ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించే కోటి వృక్షార్చన కార్యక్రమంలోనాగార్జునసాగర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్‌కుమార్‌ సారథ్యంలో నిర్వహించే హరిత సంకల్పానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని, గ్రామగ్రామాన ప్రజలు భాగస్వాములై మొక్కలు నాటాలని పేర్కొన్నారు. మొక్కలు చెట్లయ్యాయి.. దారులన్నీ  పచ్చ బడ్డాయి.. పూలు, పండ్లు, ఔషధ మొక్కలతో బడులు, గుడులు కళకళలాడుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు హరిత శోభను సంతరించు కుంటున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్‌కుమార్‌  కోటి వృక్షార్చనకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనాలు..

గ్రామాలకు మొక్కల తరలింపు త్రిపురారం,

 ఫిబ్రవరి 15 : కోటి వృక్షార్చనలో భాగంగా సోమవారం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో మొక్కలు పంపిణీ చేశారు. ఎంపీఓ నీలిమ ఆధ్వర్యంలో మండలంలోని 29 గ్రామాలకు 11 వేల మొక్కలను అందించగా ఆయా గ్రామాల సర్పంచులతోపాటు గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని ట్రాక్టర్లలో తీసుకెళ్లారు. 

పూల దారి 

తిప్పర్తి నుంచి తిప్పలమ్మగూడెం వెళ్లే దారిలో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. పూల చెట్లు దారి పొడువునా ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నాయి. 

హరిత తోరణం 

తిప్పర్తి, ఫిబ్రవరి 15 : రెండో విడుత హరితహారంలో భాగంగా తిప్పర్తి నుంచి సర్వారం వరకు ఐదు కిలోమీటర్ల మేర మూడు వేల మొక్కలు నాటగా అవి పెద్ద చెట్లుగా పెరిగాయి. రోడ్డుకిరువైపులా పచ్చని తోరణంలా స్వాగతం పలుకుతూ ప్రయాణికులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. 

నిండైన దీవెన

 • తరువులు కావు అవి మన గురువులు
 • పుడమి పులకించేటట్లు..ప్రకృతి పరవశించేటట్లు
 • పరమశివునికి జరిగే గంగాభిషేకంలా..
 • అవనికి జరిగే ఈ హరితాభిషేకం
 • మక్కువతో నాటుతున్న ఈ మొక్కలు
 • రేపటి మన జీవితపు మహావృక్షాలు కావాలి
 • ఆకుపచ్చని శోభతో హరితహారాన్ని చేపట్టి
 • మొక్కవోని ముందుచూపుగల పాలకుని దార్శనికతకు 
 • సత్‌సంకల్పానికి భూమాత ధరించెను కోటిమొక్కల హరితహారం
 • రేపటి తరానికి పండును, పువ్వును, ఫలాన్ని, ప్రాణవాయువును
 • నీడను ఇవ్వగా జనులంత చల్లగా..జగమంత మెచ్చగా
 • చేపడుతున్న ఈ ఆకుపచ్చ క్రతువు 
 • చెట్టును మించిన చట్టం లేదని
 • ఫలం ఇవ్వడమే కానీ ప్రతిఫలం ఆశించని
 • ప్రకృతి మాత ఇస్తుంది నిండైన దీవెన.
 • - ఆర్‌. శ్రీనివాసరావు, 
 • ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కందిబండ, మేళ్లచెర్వు

VIDEOS

logo