శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 15, 2021 , 00:04:32

నందనవనం.. రాములబండ ప్రకృతి వనం

నందనవనం.. రాములబండ ప్రకృతి వనం

  • ఆకట్టుకునేలా రంగురంగుల బొమ్మలు
  • పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
  • రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ పంచాయతీ అవార్డు

నల్లగొండ రూరల్‌, ఫిబ్రవరి 14 : పల్లె ప్రగతితో రాములబండ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామం కొత్త కళను సంతరించుకున్నది. సమస్యలన్నీ పరిష్కారమై పరిశుభ్రత, పచ్చదనం అలుముకున్నది. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలతో నందనవనాన్ని తలపిస్తున్నది. దీంతో ఇటీవల గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు దక్కించుకున్నది.

నల్లగొండ మండలం రాములబండ గ్రామంలో 350 నివాసాలు ఉన్నాయి. 1100 జనాభా ఉండగా, 887 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. అయితే.. పంచాయతీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.91వేలు, కేంద్రం నుంచి మూడు నెలలకోసారి రూ.2లక్షలు వస్తుండడంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంది. ఈ క్రమంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. రూ.12.50 లక్షలతో వైకుంఠధామం నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో స్నానాల గదులను సైతం ఏర్పాటు చేశారు.

ఆహ్లాదం పంచుతున్న పల్లె పార్కు..

పట్టణాల తరహాలో గ్రామీణులకు ఆహ్లాదం పంచేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె పార్కులు గ్రామాలకు వన్నె తెస్తున్నాయి. ఇందులో భాగంగా రాములబండ గ్రామంలో ఎకరం 12 గుంటల స్థలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో 2వేల వరకు మొక్కలు నాటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ చూపి పార్కు చుట్టూ మామిడి, జామ, ఉసిరి మొక్కలను పెంచుతున్నారు. పార్కు గోడలపై నెమలి, పాలపిట్ట, జంతువుల బొమ్మలు, అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్‌ రూపని జయమ్మ సొంత ఖర్చుతో పార్కులో వాకింగ్‌, విశ్రాంతి తీసుకునే వారి కోసం బెంచీలు ఏర్పాటు చేశారు. రోడ్డు సైతం వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

పరిసరాలు పరిశుభ్రం..

గతంలో చెత్త సేకరణ లేక ఎక్కడి చెత్త అక్కడే ఉండేది. ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ కేటాయించడంతో పంచాయతీ సిబ్బంది ఏ రోజు చెత్తను ఆరోజే తడి, పొడి చెత్తను వేరుగా సేకరిస్తున్నారు. గ్రామంలో రూ.2.50లక్షలతో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు షెడ్డుకు తరలిస్తున్నారు. హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్లకు ఇరువైపులా 900కు పైగా మొక్కలు నాటారు. వాటికి నిత్యం నీళ్లు పోస్తూ సంరక్షిస్తున్నారు. 

మా గ్రామం మారిపోయింది..

గతంలో ఎప్పుడూ గిట్లా నిధులు ఇచ్చేటోళ్లు కాదు. పల్లె ప్రగతి ప్రారంభమైన నాటి నుంచి గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. వాటితో అవసరమైన చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినం. ఇతర వనరులతో పంచాయతీకి ఆదాయం సమకూర్చుతున్నాం. ప్రజల్లో మార్పు తెచ్చి పారిశుధ్యం విషయంలో పరిపూర్ణత సాధించాం. ప్రభుత్వ నిధులతోపాటు మా సొంత ఖర్చుతో పల్లె ప్రకృతి వనాన్ని ఆహ్లాదకరంగా 

తీర్చిదిద్దినం. క్రమక్రమంగా గ్రామంలో సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం.

-రూపని జయమ్మ, రాములబండ సర్పంచ్‌


VIDEOS

logo