గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 13, 2021 , 01:04:45

శరవేగంగా భూ సర్వే

శరవేగంగా భూ సర్వే

  • సీఎం కేసీఆర్‌ హామీ అమలుకు ప్రత్యేక చర్యలు
  • ‘నెల్లికల్లు’ భూసమస్యపై కొనసాగుతున్న కార్యాచరణ
  • 505 ఎకరాల్లో పూర్తైన ఎంజాయ్‌మెంట్‌ సర్వే
  • కాస్తులో ఉన్న రైతుల గుర్తింపు  ముమ్మరం
  • గత సర్వే ప్రతులపై అభ్యంతరాల స్వీకరణ
  • చింతలపాలెం రైతులతో కలెక్టర్‌ భేటీ 
  • మంత్రి జగదీశ్‌రెడ్డి నిరంతర పర్యవేక్షణ
  • ఆనందం వ్యక్తం చేస్తున్న గిరిజనులు

“తిరుమలగిరి సాగర్‌ మండలంలోని నెల్లికల్లు, చింతలపాలెం ఆ చుట్టుపక్కన ఉన్న ఐదారు గ్రామాల్లో నాలుగైదు వేల ఎకరాల భూ వివాదం నడుస్తున్నది. లిఫ్టుకు ఫౌండేషన్‌ వేసినప్పుడు అక్కడి గ్రామాల రైతులు నాతో చెప్పారు. అతి తొందర లోనే మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ భూములకు పట్టాలిస్తరు. ధరణిలోకి కూడా తీసుకొస్తరు. పట్టాలపై కలెక్టర్‌కు కూడా ఆదేశాలిచ్చినం. తొందరలోనే ఇది పూర్తవుతుంది.”..  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 10న హాలియా సభలో చెప్పిన మాటలివి. బుధవారం సాయంత్రం సభ ముగిసిందో లేదో గురువారం ఉదయం 10గంటలకే ఆ భూములపై కార్యాచరణ మొదలైంది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, ఇతర ముఖ్య అధికారులతో సమీక్షించారు. అది ముగిసిన వెంటనే సాయంత్రానికి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, రాహుల్‌శర్మ చింతలపాలెం చేరుకున్నారు. గతంలో చేసిన ఎంజాయ్‌మెంట్‌ సర్వే ప్రతులను గ్రామపంచాయతీలో అంటించారు. వీటిపై అభ్యంతరాలుంటే తెలుపాలన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ కూడా చింతలపాలెంలో రైతులతో భేటీ అయ్యారు. సమస్యను అడిగి తెలుసుకుని ప్రభుత్వ కార్యాచరణపై అవగాహన కల్పించారు. సర్వే అనంతరం సమస్య పరిష్కారం అవుతుందని ప్రకటించారు.

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం గత పాలకుల హయాంలో జరిగిన భూఅక్రమాలను సరిదిద్ది అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నది. అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడంతో చకచకా ప్రక్రియ ముందుకు సాగుతున్నది. మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఇతర అధికారులు దీన్ని సవాలుగా తీసుకుని రంగంలోకి దిగారు. వాస్తవంగా నెల్లికల్లు, చింతలపాలెం, తునికినూతల గ్రామాల పరిధిలో 3235ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. గతంలో పాలకుల అండదండలతో రెవెన్యూ అధికారులు విచ్చలవిడిగా పట్టాలు మంజూరు చేశారు. వాస్తవంగా ఉన్న భూమి కంటే రెట్టింపు విస్తీర్ణానికి పట్టాలు ఇచ్చారు. భూరికార్డుల ఆధునీకరణ సమయంలో పట్టాలు ఎవరికి ఇవ్వాలనే అంశం చర్చనీయాంశమై అధికారులు ఆయా భూములను ‘పార్ట్‌-బీ’లో చేర్చారు. పైగా కొత్త పట్టాదారు పాసుపుస్తకాల జారీని నిలిపివేశారు. అయితే, రికార్డుల ప్రక్షాళన తర్వాత ఇక్కడ భూముల్లో నిజమైన కాస్తుదారులను తేల్చేందుకు జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. అప్పట్లోనే సర్వే చేసి ఓ నివేదికను రూపొందించారు. అయితే ఐదు గ్రామాల పరిధిలో 3235ఎకరాలను ఇలా గుర్తించగా అందులో ఎక్కువభాగం సుమారుగా 2400ఎకరాల వరకు చింతలపాలెంలో, 415ఎకరాలు నెల్లికల్లులో, తునికినూతల పరిధిలో 108ఎకరాలతో పాటు మరికొంత భూమిని తేల్చారు. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చి పట్టాలను ఇవ్వాలని భావించారు. కానీ ఇదే సమయంలో ఈ భూములకు సంబంధించి హాలియా సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయడంతో మరింత వేగం పెరిగింది. సీఎం ఆదేశాలు కావడంతో అధికారులు కూడా దీన్ని నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. 

కొనసాగుతున్న ఎంజాయ్‌మెంట్‌ సర్వే...

గతంలో కాస్తుదారులను తేల్చేందుకు రెవెన్యూ, సర్వే విభాగాలు ఉమ్మడిగా సర్వే నిర్వహించాయి. 2400ఎకరాలకు సంబంధించిన గత జాబితాను ప్రస్తుతం చింతలపాలెంలో ప్రజలకు అందుబాటులో ఉంచారు. మరోసారి ఈ గ్రామాల పరిధిలో తుది సర్వేను గురువారం మొదలుపెట్టారు. పది మందితో కూడిన సర్వేబృందం రెండురోజులుగా నెల్లికల్లు శివారుభూముల్లో ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేపట్టింది. తొలిరోజు 205ఎకరాలను, రెండోరోజు శుక్రవారం 300ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. మరో రెండుమూడ్రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఒక్కో గ్రామంలో సర్వేను చేయడం ద్వారా నిజమైన కాస్తుదారులను గుర్తించాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నారు. అనంతరం మిగతా గ్రామాల్లోనూ సర్వే కొనసాగించనున్నారు. ఇక ఇదే సమయంలో గత సర్వే ప్రతులను గురువారం సాయంత్రమే జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, రాహుల్‌శర్మ చింతలపాలెం పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించారు. దీనిపై 185అభ్యంతరాలు వెల్లడైనట్లు తాసీల్దార్‌ ఇస్లావత్‌ పాండునాయక్‌ వివరించారు. వీరిలో ఎక్కువగా గత సర్వే జాబితాలో లేని వారు తమ పేర్లు చేర్చాలంటున్నట్లు సమాచారం. అభ్యంతరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి తాజాగా ఎంజాయ్‌మెంట్‌ సర్వేలో తేలిన అంశాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. గత సర్వేలో గుర్తించిన రైతులే కాస్తులో        ఉన్నట్లు తేలితే పట్టాల పంపిణీ కూడా త్వరలోనే పూర్తి కానుంది. ఈ వివాదాస్పద భూముల్లో అర్హులైన వారిని తేల్చి సాధ్యమైనంత త్వరగా పట్టాలు జారీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ చింతలపాలెంలో పర్యటించారు. అక్కడి రైతులతో సమావేశమై ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. అర్హులైన వారికి పట్టాలు త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. దీంతో ఇన్నాళ్లుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తోనే తమ సమస్యకు ఇంత తొందరగా పరిష్కారం లభించిందని పేర్కొన్నారు.


VIDEOS

logo