బుధవారం 03 మార్చి 2021
Nalgonda - Feb 12, 2021 , 01:23:55

మోగిన మండలి నగారా

మోగిన మండలి నగారా

  • పట్టభద్రుల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల
  • 16 నుంచి నల్లగొండలో నామినేషన్లు
  • ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా కలెక్టర్‌ పాటిల్‌
  • అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా ఆయా జిల్లాల అడిషనల్‌ కలెక్టర్లు
  • వచ్చే నెల 14న పోలింగ్‌17న కౌంటింగ్‌
  • ఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పూర్వపు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. గురువారం షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణకు అవకాశమిస్తూ.. వచ్చే నెల 14న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. రిటర్నింగ్‌ అధికారిగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను నియమిం చింది. దాంతో ఇక్కడే నామినేషన్లను స్వీకరించనున్నారు. అందుకోసం కలెక్టర్‌ ఛాంబర్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు, సంస్థల తరఫున బరిలో ఉండి ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు ఇక ప్రచారంలో వేగం పెంచనున్నారు. గురువారం నుంచే ఈ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి11(నమస్తే తెలంగాణ) : మార్చి 29వ తేదీతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీకాలం ముగియనుంది. అంతకుముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో గురువారం ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పాత జిల్లాల పరిధిలో మండలి ఎన్నికల వేడి రాజుకున్నట్లుగానే భావించాలి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం, కొత్తగూడెంభద్రాద్రి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జయశంకర్‌భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు, జనగాం జిల్లాలలోపాటు సిద్దిపేట జిల్లాలోని మూడు మండలాలతో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. కాగా గత ఏడాది అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించగా ఈ జనవరి 18న ఓటర్ల తుది జాబితా వెల్లడైంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 546 పోలింగ్‌ కేంద్రాలను నోటిఫై చేశారు. వీటి పరిధిలో 4,91,396 మంది ఓటర్లుగా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుత జిల్లాల ప్రకారం చూస్తే నల్లగొండలో అత్యధికంగా 88,351 మంది ఓటర్లు, అతి తక్కువగా ములుగు జిల్లాలో 9,890 మంది ఉన్నారు. అయితే 2015లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి 2.10లక్షల మంది అదనంగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో 2.81లక్షల మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారు. ఈసారి ఓటర్ల నమోదులో ఆది నుంచీ టీఆర్‌ఎస్‌ పార్టీ అర్హులైన పట్టభద్రులను చైతన్యం చేస్తూ ఓటు నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం చేసింది. ఓటర్ల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణం. మరోవైపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం కల్పించడంతో 80శాతం పైగా ఆన్‌లైన్‌ దరఖాస్తులే వచ్చాయి. అయితే ఈసారి ఓటర్ల పెరుగుదల ఎవరికి లాభిస్తుంది? ఎవరికి నష్టాన్ని కలుగజేస్తున్నదనేది ఆసక్తికరంగా మారింది. 

నల్లగొండ కలెక్టరేట్‌లోనే నామినేషన్ల స్వీకరణ

మండలి ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ వ్యవహరించనున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న అభ్యర్థులంతా నల్లగొండ కలెక్టరేట్‌లోనే నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ కోసం కలెక్టర్‌ చాంబర్‌లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్‌ఓ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ చెప్పారు. ఈనెల 16నుంచి 23వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 26న   ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుదిజాబితా వెల్లడికానున్నది. వచ్చే నెల 14న పోలింగ్‌, 17న నల్లగొండలోనే కౌంటింగ్‌ ప్రక్రియ చేపడుతారు. ఎన్నికల సందర్భంగా నిర్వహించే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన తదితర కార్యకలాపాలను కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగానే చేపట్టాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది.  

ఉపందుకోనున్న ప్రచారం..

ఓటర్ల నమోదు కానుంచే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారంతా ఏదో ఒక రకంగా ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించారు. ఓటర్ల తుదిజాబితా వెల్లడయ్యాక నేరుగా ఓటర్లను కలిసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక నుంచి తమ ప్రచారంలో మరింత వేగం పెంచనున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిగా మరోసారి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డినే ప్రకటించింది. ఆయన ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఓ దఫా చుట్టివచ్చారు. విద్యావేత్తగా, మేధావిగా అందరికీ సుపరిచితుడు కావడంతోపాటు పార్టీల పరంగా అతి పెద్ద నెట్వర్క్‌ కలిగిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కావడంతో అనేక సానుకూలతలు ఉన్నాయి. ఈ ఆరేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఓటర్లలోకి దూసుకుపోతున్నారు. ఆయా జిల్లాల ప్రజాప్రతినిధుల సహకారంతో క్షేత్రస్థాయి వరకు వెళ్తున్నారు. స్వయంగా ఓటర్లను కలుస్తున్నారు. ఆయనకు ఓటర్ల నుంచి మంచి స్పందన కూడా లభిస్తుంది. నామినేషన్ల అనంతరం పార్టీ మొత్తం రంగంలోకి దిగి ప్రచారం చేపట్టనుంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ పోటీలో ఉండాలా? వద్దా? అన్న తర్జనభర్జన నడుమ రాములునాయక్‌కు తమ అభ్యర్థిగా  ప్రకటించింది. కానీ ఇప్పటివరకు పార్టీ పరంగా ఎలాంటి సన్నద్ధం కనపడడం లేదు. మరోవైపు బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణిరుద్రమరెడ్డి, సీపీఎం-సీపీఐ కూటమి నుంచి జయసారథిరెడ్డి, టీజేఎస్‌ నుంచి కోదండరామ్‌తోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచే యోచనలో ఉన్నారు.  

VIDEOS

logo