గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 11, 2021 , 01:34:13

జిల్లాపై సీఎం వరాల జల్లు

జిల్లాపై సీఎం వరాల జల్లు

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి10(నమస్తే తెలంగాణ): హాలియా సమీపంలో బుధవారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ధన్యవాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నల్లగొండ జిల్లాపై వరాలజల్లు కురిపించారు. నల్లగొండ జిల్లాను సమూలంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత పాలకులు చేసిన అన్యాయాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ..వాటిని గత ఆరున్నర ఏండ్లుగా ఎలా సరిదిద్దుతున్నామో విడమరిచి చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు జిల్లాకు చేసిన అన్యాయాలపై తీవ్ర విమర్శలు చేశారు. సాగర్‌ నిర్మాణంలో అన్యాయం, ఆయకట్టుపై నిర్లక్ష్యం, ఫ్లోరైడ్‌ భూతానికి కారణం ఈ కాంగ్రెస్‌ నేతలు కాదా అని ప్రశ్నించారు. ఎవరూ ఏం చెప్పినా ప్రజలు ఆలోచించాలని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, పార్టీకి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఇతర పార్టీలకు డిపాజిట్‌ రానీయొద్దు...

 త్వరలో జరుగనున్న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో వేరే పార్టీలకు డిపాజిట్లు రాకుండా చూడాలని, చెప్పిన మాటను చేసి చూపిస్తున్న టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలని విన్నవించారు. ధన్యవాద సభ సక్సెస్‌ కావడంతో టీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణుల్లోనూ కొత్త జోష్‌ కనిపించింది. 

నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10కోట్లు...

 గత ఏడాది సూర్యాపేట జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించిన సీఎం ఈ సారి నల్లగొండకు ప్రకటించారు. జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున, మండల కేంద్రాలకు రూ.30 లక్షల చొప్పున నిధులు ప్రకటించారు. ఇక నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడకు 5 కోట్లు, మిగిలిన ఆరు మున్సిపాలిటీలకు ఒక్కో కోటి చొప్పున నిధులు ఇస్తమన్నారు.  మొత్తం రూ.186 కోట్ల ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వీటికి సంబంధించిన జీఓను గురువారం విడుదల చేయనున్నట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో మండల, జిల్లా పరిషత్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. 

‘నెల్లికల్లు’ భూవివాదానికి తెర ...

ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన నెల్లికల్లుతో పాటు చింతలపాలెం, మిగతా గ్రామాల పరిధిలో నాలుగైదు వేల ఎకరాల్లో భూవివాదం ఉన్నట్లు గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. వివాదాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్లు పర్యవేక్షించి త్వరలోనే పరిష్కరిస్తారని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చానన్నారు. పట్టాలు, ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారని సీఎం ప్రకటించారు. 

ఏడాదిన్నర కాలంలో లిఫ్టుల పూర్తి ...

దాదాపు రూ.2500కోట్లతో తాను శంకుస్థాపన చేసిన లిఫ్టులన్నింటినీ వచ్చే ఏడాదిన్నరలో  పూర్తి చేస్తామని సభికుల హర్షధ్వానాల నడుమ కేసీఆర్‌ ప్రకటించారు. వీటిని పూర్తి చేసుకునే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకుంటారని చెప్పారు. నెల్లికల్లు లిఫ్టును కూడా ప్రస్తుతం ఉన్న డిజైన్‌ ప్రకారం కాకుండా 25వేల నుంచి 30వేల ఆయకట్టుకు నీరందించేలా నిర్మించే యోచనలో ఉన్నామని ప్రకటించారు. 

రైతుల పాదాలు కడుగుతాం...

కృష్ణానదిలో అన్ని సార్లు సమృద్ధిగా నీరు లభించడం లేదని, దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే గోదావరి జలాలను ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు లిఫ్టు ద్వారా తరలించాల్సి ఉందని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రూ.600కోట్లతో ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశామని, త్వరలోనే దీన్ని మంజూరు చేసి పనులు చేపడుతామని ప్రకటించారు. కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేసి నల్లగొండ జిల్లా రైతుల పాదాలు కడుగుతామని చెప్పారు. 

 వీర్లపాలెం, తోపుచర్ల లిప్టులకు హామీ...

మిర్యాలగూడ నియోజకవర్గం వీర్లపాలెం, తోపుచర్ల ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు విజ్ఞప్తి మేరకు వీటిని రెండు, మూడు రోజుల్లోనే మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే మూడు పథకాలు ఇక్కడ మంజూరు చేశామని చెప్పారు. 

 పోడు భూముల సమస్యకు పరిష్కారం 

 దేవరకొండ లాంటి ప్రాంతాల్లో గిరిజనులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరికి గత పాలకుల నిర్లక్ష్యంతో పోడుభూముల సమస్య పెండింగ్‌లో ఉంది. స్వయంగా తానే రంగంలోకి దిగి వీటికి పరిష్కారం చూపిస్తానని చెప్పారు. 

డిండితో పాటు ఇతర ప్రాజెక్టుల పూర్తి...

 జిల్లాలో ఇప్పటికే పనులు కొనసాగుతున్న డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు శ్రీశైలం సొరంగమార్గం, బ్రాహ్మణవెల్లెంల లిఫ్టు పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. బస్వాపూర్‌ ద్వారా ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ బడ్జెట్‌లో అదనంగా నిధులు కేటాయించి పూర్తి చేస్తామని ప్రకటించారు.   

రెండేండ్లలో యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు పూర్తి..

రూ.35వేల కోట్ల వ్యయంతో 4వేల మెగావాట్ల సామర్థ్ద్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్టు నిర్మాణం జిల్లాలో కొనసాగుతుందని చెప్పారు. దీన్ని వచ్చే రెండేండ్లలో  పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణలో అత్యధిక పవర్‌ జనరేషన్‌ ప్రాజెక్టుగా ఇది నిలవబోతుందని పేర్కొన్నారు. యాదాద్రి దివ్యక్షేత్రాన్ని కూడా రెండు వేల కోట్లతో కృష్ణశిలలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రపంచం మొత్తం వచ్చి చూసేలా దీన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. 

త్వరలో కొత్త పింఛన్లు..

రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే కొత్తగా పెన్షన్లు, రేషన్‌కార్డులు అర్హులైన వారికి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇక ప్రతి నాయీబ్రాహ్మణులకు లక్ష రూపాయల చొప్పున ఆధునిక సెలూన్‌  మంజూరు చేస్తామని చెప్పారు. ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెల యూనిట్‌ను అందజేస్తామని, వచ్చే బడ్జెట్‌లో రెండు లక్షల మందికి, తర్వాత ఏడాది మిగిలిన రెండు లక్షల మందికి గొర్రెల యూనిట్లను అందజేస్తామని చెప్పారు. సాగర్‌ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌ను తిరిగి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.  

కాంగ్రెస్‌, బీజేపీపై ఫైర్‌...

సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్రానికి, ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు అన్యాయం చేసిందెవరైనా ఉన్నారంటే జిల్లాకు చెందిన పెద్ద పెద్ద కాంగ్రెస్‌ నేతలనేనని స్పష్టం చేశారు. వారు జిల్లా ప్రజల ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాల కోసమే ఆత్మవంచనతో పనిచేశారని విమర్శించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షత వహించిన సభలోఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, మండలి వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌తో పాటు జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, దీపికాయుగంధర్‌రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, రవీంద్రకుమార్‌, భాస్కర్‌రావు, కిశోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, మందుల సామేలు, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, పూల రవీందర్‌, భారతీనాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ నేతలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సోమా భరత్‌కుమార్‌, చాడ కిషన్‌రెడ్డి, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, నోముల భగత్‌, లక్ష్మి, ఎంసీ కోటిరెడ్డి, యడవెల్లి విజయేందర్‌రెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, తుంగ బాలు, రాంచంద్రనాయక్‌, మాలె శరణ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 స్క్రీన్‌పై కేసీఆర్‌ జీవిత చరిత్ర 

  నిడమనూరు, ఫిబ్రవరి 10 : ధన్యవాద సభా ప్రాంగణం, ప్రధాన రహదారి వెంట ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌లను సభకు వచ్చిన జనం ఆసక్తిగా తిలకించారు. స్క్రీన్‌లపై కేసీఆర్‌ బాల్యం, రాజకీయ ప్రవేశం, జీవిత చరిత్రను తెలిపే డాక్యుమెంటరీని ప్రసారం చేయడంతో స్క్రీన్‌ల వద్ద జనం గుమికూడి ఆసక్తిగా చూశారు.  

 దారులన్నీ ధన్యవాద సభ వైపే 

  నిడమనూరు : అనుముల మండలం అలీనగర్‌ చెక్‌ పోస్టు సమీపంలో నిర్వహించిన సీఎం సభకు తరలివచ్చే జనంతో దారులన్నీ కిక్కిరిశాయి. బస్సులు, ట్రాక్టర్లు, డీసీఎంలు, బైకులు,  ఆటోల్లో పెద్ద ఎత్తున తరలిరావడంతో సభా ప్రాంగణం జనం సంద్రంగా మారింది. ఎదురెండను లెక్కచేయకుండా మహిళలు డప్పు చప్పుళ్ల నడుమ గులాబీ జెండా చేతబట్టి తరలివస్తుండగా దారులన్నీ చీమలబారులను తలపించాయి.  

ఆద్యంతం హర్షధ్వానాలు.. 

  నిడమనూరు, ఫిబ్రవరి 10 : ధన్యవాద సభలో సీఎం కేసీఆర్‌ ఆద్యంతం ప్రజల హర్షధ్వానాల నడుమ ప్రసంగించారు. ముఖ్యమంత్రి సభా వేదిక పైకి వస్తున్న సమయంలో సభకు హాజరైన జనం పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. ప్రజల ఉత్సాహానికి స్పందించిన సీఎం వేదిక పైనుంచి అభివాదం చేశారు. ప్రసంగంలో గత కాంగ్రెస్‌ పాలకుల దాష్టీకాలను, తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టినంత సేపు ప్రజలు ముఖ్యమంత్రికి మద్దతుగా చప్పట్లు కొట్టారు. మున్సిపాలిటీలకు వరాల జల్లు కురిపించడంతో సభా ప్రాంగణం కేరింతలతో మార్మోగింది.  ఎత్తిపోతలను సత్వరమే పూర్తిచేసే బాధ్యతను జిల్లా ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ఆదేశించడంతో మద్దతుగా అభివాదం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

సీఎం రాకను చూసి.. 

 హాలియా, ఫిబ్రవరి 10 : ధన్యవాద సభకు సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో వచ్చారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టగా.. ప్రజలు కేరింతలు కొట్టారు. 4గంటల 11నిమిషాలకు హెలికాప్టర్‌ సభా ప్రాంగణం చేరుకొని రెండు రౌండ్లు గాలిలో చక్కర్లు కొట్టి మూడోసారి సభకు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో ల్యాండ్‌ అయ్యింది.  ముఖ్యమంత్రి సభా వేదికపైకి రాగానే ప్రాంగణంలోని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు లేచి జై కేసీఆర్‌.. జై టీఆర్‌ఎస్‌.. అంటూ నినాదాలు చేశారు. 

 సైడ్‌ లైట్స్‌.. 

 • నాగార్జునసాగర్‌లోని బీసీ గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు మధ్యాహ్నం 12.46గంటలకు సీఎం హెలికాప్టర్‌ చేరుకుంది.
 • 12.50గంటలకు సీఎం హెలికాప్టర్‌ దిగారు. ఆయనకు మంత్రులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.  
 • 12.53గంటలకు సీఎం కాన్వాయ్‌ రోడ్డు మార్గంలో నెల్లికల్‌లో లిఫ్ట్‌ల శంకుస్థాపనకు బయలుదేరింది. 
 • మధ్యాహ్నం 1.05గంటలకు నెల్లికల్లు లిఫ్ట్‌ శంకుస్థాపన ప్రాంతానికి చేరిన సీఎం కాన్వాయ్‌. 
 • పూజా కార్యక్రమాల అనంతరం 1.20గంటలకు సీఎం లిఫ్ట్‌ పనులకు శంకుస్థాపన చేశారు. 
 • లిఫ్ట్‌ నమూనాలు పరిశీలించిన అనంతరం 1.40గంటలకు సీఎం నాగార్జునసాగర్‌కు బయలుదేరారు.  
 • సాయంత్రం 4:07గంటలకు హాలియాకు చేరిన సీఎం హెలికాప్టర్‌. సభాప్రాంగణంలో జన సందోహంపై మూడు చక్కర్లు కొట్టిన హెలికాప్టర్‌, కేరింతలు కొట్టిన జనం. 
 • 4:11గంటలకు సీఎం హెలికాప్టర్‌ ల్యాండింగ్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్‌, జోగినపల్లి సంతోష్‌కుమార్‌ స్వాగతం. 
 • 4:19గంటలకు సభావేదికపైకి చేరుకున్న సీఎం కేసీఆర్‌. ప్రజలకు అభివాదం. 
 • వేదికపైకి రాగానే ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు లేచి జై కేసీఆర్‌, జై టీఆర్‌ఎస్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 
 • 4.23 నుంచి 4.25గంటల వరకు ఎమ్మెల్సీ పల్లా ప్రసంగం
 • 4.26 నుంచి 4.31 వరకు మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగం.
 • 4.32గంటలకు సీఎం కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభం. 
 • సీఎం ప్రసంగం మధ్యలో దళితశక్తి ప్రోగ్రాం సభ్యులు పరకాల ఎమ్మెల్యేను పదవి నుంచి తొలగించాలంటూ నిరసన తెలుపగా.. ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌.  
 • సీఎం తన ప్రసంగం మధ్యలో రైతుబంధు డబ్బులు అందుతున్నాయా? అని అడగ్గా.. రైతులు పెద్ద ఎత్తున చేతులు ఎత్తి అందుతున్నాయంటూ ఆనందం. 
 •  సీఎం తన ప్రసంగంలో జిల్లా ప్రస్తావన తెచ్చినప్పుడల్లా జనం పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు.
 • 5:25గంటలకు ముగిసిన సీఎం ప్రసంగం. 
 •  సీఎం కేసీఆర్‌కు గిరిజన తలపాగా ధరింపజేసిన సంఘం నాయకులు. 
 •  5:34గంటలకు సభావేదిక నుంచి ప్రత్యేక బస్సులో హెలిపాడ్‌ వద్దకు చేరిన సీఎం కేసీఆర్‌. 
 •  4:42గంటలకు హైదరాబాద్‌ బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్‌. 

VIDEOS

logo