మంగళవారం 09 మార్చి 2021
Nalgonda - Feb 09, 2021 , 00:44:43

అంచనాకు మించి..

అంచనాకు మించి..

 • పెరిగిన యాసంగి సాగు విస్తీర్ణం 
 • నల్లగొండ జిల్లాలో 4.47 లక్షల ఎకరాల్లో పంటలు
 • సూర్యాపేటలో 4.04 లక్షల ఎకరాలకుపైగా..
 • అత్యధికంగా వరి.. ఆ తర్వాత వేరుశనగ
 • సూర్యాపేటలో కొనసాగుతున్న సర్వే
 • నీలగిరి నేల ఆకుపచ్చ అందాలు పరుచుకుని, సాగు పరిమళాలు వెదజల్లు

తున్నది. భానుపురి కరువు ఛాయలను తరిమి సిరుల పంట పండిస్తున్నది. ఈ యాసంగిలో రెండు జిల్లాల్లోనూ అధికారుల అంచనాలను మించి సాగు విస్తీర్ణం నమోదైంది. నల్లగొండలో 4.47 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ సర్వేలో తేలింది. సూర్యాపేటలో సర్వే 95 శాతమే పూర్తవగా, ఇప్పటికే 4.04లక్షల ఎకరాలు లెక్కకు వచ్చింది. సాగు నీటి సౌకర్యం, భూగర్భ జలాలు పెరగడంతో ఆయకట్టుతోపాటు నాన్‌ కెనాల్‌ ఏరియాలోనూ సాగు విస్తీర్ణం పెరిగింది. కేతేపల్లి, వేములపల్లి మండలాల్లో రైతులు నూటికి నూరుశాతం వరి సాగు చేశారు. పంటల వివరాలను రైతు బంధు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఆ మేరకు పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించనున్నారు. 

 • పెరిగిన యాసంగి సాగు విస్తీర్ణం 
 • నల్లగొండ జిల్లాలో 4.47 లక్షల ఎకరాల్లో పంటలు
 • సూర్యాపేటలో 
 • 4.04 లక్షల ఎకరాలకుపైగా..
 • అత్యధికంగా వరి.. 
 • ఆ తర్వాత వేరుశనగ
 • సూర్యాపేట జిల్లాలో 
 • కొనసాగుతున్న సర్వే

నల్లగొండ, ఫిబ్రవరి 8: సాధారణంగా ప్రతి సీజన్‌లో పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పంటల సాగు అంచనాను చేపడుతుంది. ఈ యాసంగి సీజన్‌లో పంటలపై వాస్తవ లెక్కలు కావాలని సర్కార్‌ గత నెలలో వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా గత నెల 18న పంటల సాగుపై సర్వే చేపట్టింది. ఆయా గ్రామాల్లో ముందు రోజే టాంటాం వేయించి స్థానిక రైతు బంధు సమితి సభ్యుల సహకారంతో సర్వే చేపట్టారు. రైతుల పేరు, ఊరు, సర్వేనంబర్‌, సాగు చేసిన విస్తీర్ణం వివరాలు తీసుకొని వాటిని తమ వద్ద ఉన్న ట్యాబ్‌లో ఎప్పటికప్పుడు రైతు బంధు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. 

నల్లగొండ జిల్లాలో

4.39 లక్షల ఎకరాల్లో సాగు..

జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్‌లో 4,47,731 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా అత్యధికంగా వరి 4,32,209 ఎకరాల్లో సాగుచేశారు. ఇక వేరుశనగ 13,222 ఎకరాల్లో సాగు చేయగా ఇతర పంటలు మరో 2000 ఎకరాల్లో ఉన్నాయి. వరి సాగులో అత్యధికంగా ఆయకట్టు ప్రాంతమైన మిర్యాలగూడలో 40,318 ఎకరాల్లో,  నాన్‌ ఆయకట్టు ప్రాంతమైన నల్లగొండలో 37,631 ఎకరాలు, నిడమనూరులో 31,250, కనగల్‌లో 30,275, త్రిపురారంలో 26,959, తిప్పర్తిలో 25,600 ఎకరాల్లో సాగు చేశారు. మిగిలిన మండలాల్లో 20వేల ఎకరాల లోపే వరి సాగైంది. ఇతర పంటల సాగు మాత్రం అన్ని మండలాల్లోనూ అంతంత మాత్రమే ఉంది. అత్యల్పంగా చందంపేట మండలంలో 290 ఎకరాల్లోనే వరి సాగు కాగా అన్ని పంటలు కలిపి అక్కడ 1256 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఇక కేతేపల్లి, వేములపల్లి మండలాల్లో వరి మినహాయిస్తే ఇతర ఏ పంటలూ సాగుచేయలేదు. 

సర్వే చేసి తేల్చాం..

యాసంగి సీజన్‌లో చేసిన సాగు వివరాలను పభుత్వ ఆదేశాలననుసరించి గత నెలలో సాగు సర్వే చేపట్టాం. గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు పంటల వివరాలు, రైతుల వివరాలు తెలుసుకొని రైతు బంధు పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ సారి సాధారణ సాగు 4.32 లక్షల ఎకరాలు కాగా 4.47 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. 

-శ్రీధర్‌ రెడ్డి, జిల్లా 

వ్యవసాయ అధికారి, నల్లగొండ పక్కాగా వివరాలు..

ఈ యాసంగి సీజన్‌లో మొత్తంగా 4,32,090 ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తారని వ్యవసాయ యంత్రాంగం సీజన్‌కు ముందు అంచనా వేసింది. అందులో ప్రధానంగా వరి 4,04,708 ఎకరాలు, 27 382 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని లెక్కలు వేసింది. జనవరి ఆరంభంలోనే సాగు ముగిసినప్పటికీ 3,93,965 ఎకరాల్లో సాగు చేశారని వ్యవసాయ శాఖ అనధికార అంచనా వేసి సర్కార్‌కు నివేదించింది. అంచనాలు వద్దని కచ్చితమైన సాగు వివరాలు కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో గత నెల 18న ఏఈఓలతో క్షేత్ర స్థాయిలో ఈ సర్వే చేపట్టి సోమవారం పూర్తి చేసింది. సాధారణ సాగును మించి పంటలు సాగయ్యాయని తేలింది. 

సూర్యాపేట జిల్లాలో 4.04 లక్షల ఎకరాల్లో..

సూర్యాపేట అర్బన్‌, ఫిబ్రవరి 8: సూర్యాపేట జిల్లాలోనూ గణనీయంగా పంటలు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 4.05 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు  చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా 4.04లక్షల ఎకరాలు సాగు చేసినట్లు ఇప్పటివరకు తేలింది. ప్రస్తుతం 95శాతం మాత్రమే సర్వే పూర్తి కాగా సర్వే పూర్తి చేసే నాటికి మరో 15వేల ఎకరాలకు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా 3.99 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా మూడు వేల ఎకరాల్లో వేరుశనగ, మరో రెండు వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు  చేశారు. మరో వారం రోజుల్లో సర్వే పూర్తి కానుంది. సర్వే చేసిన వివరాలు ఎప్పటికప్పుడు అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.


VIDEOS

logo