గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Feb 09, 2021 , 00:44:48

ప్రకృతి వనం పనుల్లో నిర్లక్ష్యం

ప్రకృతి వనం పనుల్లో నిర్లక్ష్యం

  • రాయినిగూడెంలో ఎక్కడి పనులక్కడే..
  • పూర్తికాని వైకుంఠధామం పనులు 

తిప్పర్తి, ఫిబ్రవరి 8 : ప్రతి గ్రామం పచ్చదనంతో నిండి ఆహ్లాదకర వాతావరణం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, రోడ్లు తదితర వాటికి నిధులు మంజూరు చేస్తున్నది. కానీ తిప్పర్తి మండలంలోని రాయినిగూడెం పనుల్లో వెనుకబడింది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్థలాల గుర్తింపు, పనులు చేపట్టడంలో నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరమైంది. 

ప్రారంభ దశలోనే పనులు..

జంగారెడ్డిగూడెం పంచాయతీలోని ఆవాస గ్రామమైన రాయినిగూడెం ఇటీవలే నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. గ్రామంలో సుమారు 500 జనాభా ఉంది. ప్రభుత్వం పల్లె ప్రగతి పేరిట నిధులు విడుదల చేస్తున్నా కొన్ని పనులు ముందుకు సాగడం లేదు. 

ముఖ్యంగా ప్రకృతి వనం పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. దీనికి స్థలం కేటాయింపులో ఆలస్యం చేయడం వల్ల నెల క్రితం చదును చేసి వదిలేశారు. మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేయలేదు. డంపింగ్‌ యార్డు పనులు పూర్తి కాగా వైకుంఠధామం పనులు 80 శాతం వరకు అయ్యాయి. త్వరలో మొక్కలు నాటి ప్రకృతి వనం పూర్తి చేస్తామని పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తెలిపారు. 

స్థలం ఇవ్వకనే..

పల్లెప్రకృతి వనానికి అధికారులు నెలరోజుల క్రితం స్థలం కేటాయించారు. అదికూడా రైల్వే శాఖ ఆధీనంలో ఉన్న స్థలం ఇచ్చారు. పార్కు పనులు ప్రారంభించాం. ప్రస్తుతం చదును చేసే పనులు జరుగుతున్నాయి. మా గ్రామ పంచాయతీకి నిధుల కొరత ఉంది. అందుకే కొన్ని పనుల్లో ఆలస్యమవుతున్నది. కూలీల కొరత కారణంగా మిగతా పనులు తొందరగా అయితలేవు.  

- సర్పంచ్‌, మైనం నాగయ్య, రాయినిగూడెం

VIDEOS

logo