సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Feb 08, 2021 , 01:52:59

భరోసా యాత్ర కాదు దండయాత్ర

భరోసా యాత్ర కాదు దండయాత్ర

  • గుర్రంబోడులో బీజేపీ 
  • కార్యకర్తల బీభత్సం
  • పోలీసులపై రాళ్లు, కర్రలతోదాడి 
  • డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలకు తీవ్ర గాయాలు
  • భూ సమస్య కొలిక్కి వస్తున్న 
  • తరుణంలో వివాదం

మఠంపల్లి మండలంలోని గుర్రంబోడులో వివాదాస్పదంగా మారిన సర్వేనంబర్‌ 540లోని భూముల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహించిన గిరిజన భరోసా యాత్ర దండయాత్రగా మారింది. ఓ కంపెనీకి చెందిన షెడ్డుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ చొరవ చూపుతున్న తరుణంలో ఇలాంటి చర్యలకు పూనుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. 

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ), మఠంపల్లి : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ఆదివారం బీజేపీ నిర్వహించిన గిరిజన భరోసా యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివాదాస్పద భూముల్లో ఉన్న ఓ కంపెనీకి చెందిన షెడ్డుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో  భరోసా యాత్ర రచ్చరచ్చగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల ప్రయత్నించగా బీజేపీ శ్రేణుల దాడుల్లో కోదాడ డీఎస్పీతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మఠంపల్లి మండలం పెద్దవీడు సర్వే నంబర్‌ 540లో మొత్తం 6239.07ఎకరాలు ఉన్నది. ఇందులో 1876ఎకరాలు పట్టా భూమిగా గుర్తిస్తూ 4363.06ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం 22ఏ ప్రకారం నిషేధిత జాబితాలో పొందుపరిచారు. అయితే 1876ఎకరాల పట్టా భూములే రికార్డుల పరంగా చేతులు మారుతున్నది. ఈ నేపథ్యంలో 2013-14సంవత్సరం నాటికి భూములు విస్తీర్ణం రికార్డుల్లో 9వేల ఎకరాలకు పెరిగింది. తాజాగా 6239.07ఎకరాలకు బదులు 13వేల ఎకరాలుగా రికార్డుల్లో నమోదైంది. రెవెన్యూ అధికారులు అవినీతి, అక్రమాల వల్ల ఈ పరిస్థితి తలెత్తగా ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీలోనూ ప్రస్తావిస్తూ రెవెన్యూ యంత్రాంగం తప్పులను ఎత్తిచూపారు. 

తాజా వివాదం ఇది... 

వివాదాస్పద భూముల్లో కడపకు చెందిన రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి 2014కు ముందే ‘గ్లేడ్‌ ఆగ్రో బయోటెక్‌ కంపెనీ’ పేరుతో 497ఎకరాలు కొనుగోలు చేశాడు. తన భూమికి హద్దులు చూపించాలని మూడేళ్లుగా రెవెన్యూ అధికారులను సంప్రదిస్తున్నాడు. ఈ క్రమంలో ఏండ్ల తరబడి పలువురు గిరిజనుల ఆధీనంలో ఉన్న 120 ఎకరాల భూమిని కూడా రవీందర్‌రెడ్డి తనకే చెందుతుందంటూ ఆక్రమించే ప్రయ త్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది. ఇక ఇదే సమయంలో రవీందర్‌రెడ్డి కంపెనీ పేరుతో కొంతకాలం కిందట ఓ రేకుల షెడ్డును కూడా నిర్మించి ఇతర ప్రాంతాల కూలీలతో పనులు చేయిస్తున్నారు. తాము కబ్జాలో ఉన్నామని గిరిజనులు గట్టిగా నిలబడ్డా.. రికార్డుల పరంగా ఆధారాలు లేవు. వీరికి మద్దతుగా టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు, బీజేపీ నేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద భూములపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విన్నవించడంతో ప్రభుత్వం స్పందించి సర్వే బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆర్డీఓ వెంకారెడ్డి నేతృత్వంలో 140 రోజుల పాటు సర్వే పూర్తి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. 

నేతల వరుసయాత్రలు...

వాస్తవాలు నిగ్గు తేల్చే ప్రయత్నాలు చేస్తుండగానే రాజకీయపార్టీల నేతలు వరుసయాత్రలు నిర్వహిస్తున్నారు. గిరిజన రైతులకు మద్దతు పేరుతో ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే సైదిరెడ్డి గిరిజన రైతులకు మద్దతుగా ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేయడం విదితమే.  

బీజేపీ యాత్ర తీవ్ర ఉద్రిక్తం...

గిరిజన భరోసా పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రఘునందన్‌రావు, ఆ పార్టీ నేత విజయశాంతి తదితరులు హైదరాబాద్‌ నుంచి సాయంత్రానికి వివాదాస్పద భూముల్లోకి చేరుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రవీందర్‌రెడ్డికి సంబంధించిన షెడ్డుపై దాడి చేసి కూల్చివేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగ ప్రవేశం చేయగా బీజేపీ శ్రేణులు రాళ్లు విసురుతూ కర్రలతో దాడికి పాల్పడ్డారు. కోదాడ డీఎస్పీ రఘు, సీఐ రాఘవరావు, ఎస్‌ఐ క్రాంతి తీవ్రంగా గాయపడ్డారు. 


VIDEOS

logo