మంగళవారం 09 మార్చి 2021
Nalgonda - Feb 08, 2021 , 01:53:02

నేటి నుంచి జీవాలకు వ్యాక్సిన్‌

నేటి నుంచి జీవాలకు వ్యాక్సిన్‌

  • గొర్రెలు, మేక పిల్లల్లో పారుడు రోగం నివారించేందుకు..
  • ఏడాదిన్నర లోపు పిల్లలకు వేయనున్న బృందాలు
  • ఈ నెల 20 వరకు కొనసాగనున్న కార్యక్రమం
  • జిల్లావ్యాప్తంగా 8లక్షల గొర్రెలు, మేకలకు వేసేందుకు సిద్ధం 

నల్లగొండ, ఫిబ్రవరి 7 : గొర్రెలు, మేక పిల్లల్లో పారుడు రోగం నివారణకు సోమవారం నుంచి ఈనెల 20వరకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ వేసేందుకు ఆ శాఖ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. సాధారణంగా ఏడాదిన్నరలోపు పిల్లలకు మాత్రమే ఈ రోగాలు వస్తుండగా వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 8లక్షల జీవాలకు ఈ వ్యాక్సిన్‌ వేసేందుకు 55బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు గ్రామాల్లో తిరిగి  టీకాలు వేస్తారు. 

పారుడు రోగం నివారణకు..

సాధారణంగా ఏడాదిన్నర లోపు వయసు గల గొర్రెలు, మేక పిల్లలకు పారుడు రోగం వస్తుంది. సకాలంలో గుర్తించి వ్యాక్సిన్‌ వేస్తే వాటిని రోగం నుంచి  కాపాడవచ్చు. లేదంటే ప్రతి రోజూ నాలుగైదు సార్లు పారుతూ రోగం ముదిరి చనిపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి వేస్తే మూడేండ్ల వరకు ఈ రోగం వచ్చే అవకాశం ఉండదు. సాధారణంగా ఈ జబ్బు శీతాకాలంలోనే సోకే ప్రమాదం ఉన్నందున  వ్యాక్సినేషన్‌ చేస్తుంటారు.  

55 బృందాలతో.. 

జిల్లావ్యాప్తంగా గొర్రెలు, మేకపిల్లలను పారుడు రోగం నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం సూచన మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ యంత్రాంగం సోమవారం నుంచి ఈనెల 20 వరకు వ్యాక్సినేషన్‌ చేపడుతున్నది. ఇందుకు  55 వైద్య బృందాలను ఏర్పాటు చేసి ప్రతి బృందంలో నలుగురు ఉండేలా చర్యలు తీసుకున్నది. వీరు ప్రతి రోజూ ఉదయం 7నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు గ్రామాల్లో పర్యటించి వ్యాక్సిన్‌ వేసేలా ఏర్పాట్లు చేశారు. 

సద్వినియోగం చేసుకోవాలి 

జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఈనెల 20 వరకు వ్యాక్సినేషన్‌ చేపడుతున్నాం. ఇందుకుగాను 55వైద్య బృందాలు ఏర్పాటు చేశాం. వీరంతా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విధులు నిర్వహిస్తారు. జీవాల యజమానులు అందుబాటులో ఉండి తమ జీవాలకు వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలి. 

- శ్రీనివాస్‌రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, నల్లగొండ

VIDEOS

logo