సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Feb 06, 2021 , 00:22:01

పింఛన్‌ ఇక ఇంటికే..

పింఛన్‌ ఇక ఇంటికే..

  • కొత్త గ్రామ పంచాయతీల్లోనూ పంపిణీకి ఆదేశాలు
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అమలుకు ఏర్పాట్లు
  • మంచానికి పరిమితమైన వాళ్లకు ఇంటికి వెళ్లి ఇచ్చేలా కార్యాచరణ 

ఆసరా పథకాన్ని లబ్ధిదారులకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇప్పటివరకు పాత గ్రామపంచాయతీల్లోనే పింఛన్ల బట్వాడా జరుగుతుండగా, ఇకపై కొత్త పంచాయతీలకు వెళ్లి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల నుంచి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని అన్ని పంచాయతీల్లో పంపిణీకి అధికార యంత్రాంగం పోస్టల్‌ సిబ్బందిని ఆదేశించింది. దాంతో 494 పంచాయతీల ప్రజలకు దూరభారం తప్పనున్నది. కదల్లేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు పోస్ట్‌ మాస్టర్లే నేరుగా ఇంటికే వెళ్లి బయోమెట్రిక్‌ ద్వారా వేలిముద్ర తీసుకుని పింఛన్‌ అందించనున్నారు. 

నల్లగొండ, ఫిబ్రవరి 5 : ఆసరా పింఛన్ల పంపిణీ ప్రతి పంచాయతీలోనూ పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పాత గ్రామ పంచాయతీల్లోనే ఈ ఆసరా పింఛన్ల పంపిణీ జరగ్గా ఇకపై నూతన పంచాయతీల్లోనూ అందించనున్నారు. నల్లగొండ జిల్లాలో 502, సూర్యాపేట జిల్లాలో 323 పాత పంచాయతీలు ఉండగా నూతనంగా నల్లగొండ జిల్లాలో 342, సూర్యాపేట జిల్లాలో 152గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇకపై పంచాయతీ కార్యాలయాలు లేదంటే అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏ స్థలం అనువుగా ఉంటే అక్కడే పంపిణీ చేయనున్నారు. అనారోగ్యం తదితర కారణాలతో మంచానికే పరిమితమైన లబ్ధిదారులకు బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్లే నేరుగా వెళ్లి అందించాలని ఈ నెల 3న నల్లగొండ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఉమ్మడి జిల్లా పోస్టల్‌ సిబ్బందికి అధికారులు సూచించారు. ఈ మేరకు అన్ని గ్రామాల బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్లకు ఆదేశాలు ఇచ్చామని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి తెలిపారు.

రెండు జిల్లాలో 3.06 లక్షల పింఛన్లు అందజేత..

ఆసరా పథకం ద్వారా దివ్యాంగులకు, గీత, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు ప్రతి నెలా పింఛన్‌ అందుతున్నది. దివ్యాంగులకు రూ.3016 వేలు, ఇతరులకు రూ.2016వేలు మంజూరవుతున్నాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఆయా విభాగాల కింద తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 3.06లక్షల పింఛన్లు అందిస్తున్నది. వీరిలో నల్లగొండ జిల్లాలో 1,79,301 మంది, సూర్యాపేట జిల్లాలో 1,27,246మంది ఉన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం నెలకు సుమారుగా రూ.66.73కోట్లు ఖర్చు చేస్తున్నది.

VIDEOS

తాజావార్తలు


logo