సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Feb 06, 2021 , 00:22:01

రైతుకు వేదిక..

రైతుకు వేదిక..

  • అందుబాటులోకి రైతు వేదికలు
  • వరుస ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు
  • క్లస్టర్‌ అధికారుల విధులు కూడా ఇక్కడి నుంచే..
  • ఇప్పటికే పలుచోట్ల రైతు సదస్సులు 
  • ఫర్నిచర్‌ కొనుగోలుకు ఉత్తర్వులు లాభసాటి 
  • వ్యవసాయంలో కీలకం కానున్న వేదికలు

రైతు వేదికల స్వరూపం

జిల్లా      నిర్మాణాలు    నిధులు

నల్లగొండ           140 30.80కోట్లు

సూర్యాపేట         82 18.04కోట్లు

సాగులో ఆధునిక పద్ధతులను ఆహ్వానిస్తూ, వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంలో రైతుకు వేదిక దొరికింది. పొలం‘బడి’లో మంచీచెడులను ముచ్చటించుకునేలా, వినూత్న విధానాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చించేందుకు వీలుగా నిర్మించిన రైతు వేదికలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న భవనాల ప్రారంభోత్సవాలు మొదలయ్యాయి. మిగిలిన వాటిల్లో విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పన చివరి దశలో ఉన్నది. ఫర్నిచర్‌ కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నది. అన్నిచోట్లా త్వరలోనే భవనాలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక క్లస్టర్‌ అధికారులు రైతు వేదికల నుంచే కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

రైతు వేదికలు రెడీ

  • ఇక అక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు 
  • రైతు సదస్సుల నిర్వహణ కూడా షురూ.
  • ఫర్నిచర్‌ కొనుగోలుకు ఉత్తర్వులు
  • వ్యవసాయంపై చర్చల్లో కీలకంగా వేదికలు

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : వ్యవసాయంపై సమగ్ర చర్చ జరుగాలన్న సంకల్పంతో రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం భవనం డిజైన్‌తోపాటు రూ.22లక్షలు కేటాయించింది. సత్వరమే పనులు ప్రారంభించి దసరా నాటికి ప్రారంభించాలనే ఉద్దేశంతో నాలుగు నెలల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. స్థల సేకరణ, ఇతరత్రా సమస్యలతో పలు చోట్ల పనులు ఆలస్యం కాగా.. డిసెంబర్‌ చివరి నాటికి దాదాపు అన్ని భవనాలు సిద్ధమయ్యాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 222వ్యవసాయ క్లస్టర్లున్నాయి. జూలై తొలివారంలోనే మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేశారు. మరోవైపు కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. దాదాపు అన్ని చోట్ల అనుకున్న సమాయానికే పనులు మొదలయ్యాయి. నల్లగొండ జిల్లాలోని 135వేదికలను గ్రామీణ ప్రాంతాల్లో, మరో ఐదు వేదికలను మున్సిపల్‌ ఏరియాల్లో నిర్మించారు. ఐదుచోట్ల స్థానికులు స్థలాన్ని విరాళం ఇవ్వగా మరో చోట నిర్మాణ వ్యయాన్ని భరించారు. ప్రస్తుతం వేదికలు నిర్మాణాలను ప్రారంభానికి సిద్ధమయ్యాయి. 

 ఇక సూర్యాపేట జిల్లాలో మొత్తం 82రైతు వేదికలకు గాను 80చోట్ల నిర్మాణం పూర్తయ్యింది. మంత్రి జగదీశ్‌రెడ్డి తన తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ జ్ఞాపకార్థం తమ స్వగ్రామం నాగారంలో రైతు వేదిక నిర్మాణం చేపట్టి ఆదర్శంగా నిలిచారు. దీంతో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సైతం మఠంపల్లిలో తన తండ్రి అంకిరెడ్డి స్మారకార్థం రైతువేదిక నిర్మాణాన్ని పూర్తి చేశారు. వేదికల నిర్మాణాల కోసం ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో రూ.30.80కోట్లు, సూర్యాపేట జిల్లాలో 18.04కోట్లు కేటాయించింది. ఈ యాసంగి సీజన్‌ నుంచే అన్ని రకాల వ్యవసాయ సమావేశాలు, ఇతర సాగు భేటీలకు రైతు వేదికలు అందుబాటులోకి రానున్నాయి. 

పలుచోట్ల ప్రారంభోత్సవాలు...

ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు వేదికల ప్రారంభోత్సవానికి జిల్లా యం త్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఎమ్మెల్యేల షెడ్యూల్‌ను బట్టి వీటిని ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతున్నది. ఇప్పటికే సూర్యాపేట జిల్లా మునగాలలో నిర్మించిన రైతువేదికను మంత్రి జగదీశ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మిగతా వేదికలను త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా చందంపేటలో రెండు, అడవిదేవులపల్లిలో ఒక రైతువేదికను కూడా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే సిద్ధమైన వేదికల్లోనే రైతు సదస్సులకు శ్రీకారం చుట్టారు. గురువారం తిప్పర్తిలోని రైతువేదిక కేంద్రంగా రైతుసదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. కనగల్‌, నల్లగొండల్లోనూ రైతుసదస్సులను నిర్వహించారు. నిర్మాణాలు పూర్తైన మిగతా వాటిల్లోనూ సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మౌలిక వసతుల కల్పనపై దృష్టి.. 

రైతు వేదికల్లో విద్యుత్‌, నీటిసౌకర్యాల కల్పనపై దృష్టి సారించారు. రైతులు కూర్చునేందుకు వీలుగా ఓ వేదిక దానికి అవసరమైన టేబుళ్లు, బెంచీలు, ప్రత్యేక కుర్చీలు, సాధారణ కుర్చీలు కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మండల కేంద్రాలుగా పనిచేస్తున్న క్లస్టర్‌ అధికారులు ఇక నుంచి ఆయా రైతు వేదికల నుంచే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. దీంతో రైతులకు వ్యవసాయ అధికారులు నిరంతరం స్థానికంగానే అందుబాటులో ఉండనున్నారు. సాగులో వచ్చే ఇబ్బందులు, మార్కెట్‌ సౌకర్యాలు తదితర విషయాలపై ఎప్పటికప్పుడు రైతుల సందేహాలకు అక్కడికక్కడే పరిష్కారం లభించనుంది. రానున్న కాలంలో రైతు వేదికలు గ్రామాల్లో వ్యవసాయంపై సమగ్ర చర్చకు, సమూల మార్పులకు కేంద్రాలుగా మారనున్నాయి.

VIDEOS

logo