నిరుత్సాహ బడ్జెట్!

- జిల్లాకు మొండిచెయ్యిచూపిన కేంద్రం
- ఊసేలేని పలు కీలక ప్రాజెక్టులు
- హైస్పీడ్ రైలు, డబ్లింగ్ ప్రస్తావన లేదు
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు దక్కనిజాతీయ హోదా
- రీజినల్ రింగ్ రోడ్డుకూ లేని ప్రాధాన్యత
- పెట్రోలియం ఉత్పత్తులపై అగ్రి సెస్‌తో అదనపు భారం
- పన్ను చెల్లింపుదారులకు దక్కని ఊరట
- పెరుగనున్న మొబైల్ ఇతర వస్తువుల ధరలు
- కేంద్ర బడ్జెట్‌పై విపక్షాల పెదవి విరుపు
కేంద్ర బడ్జెట్ మరోసారి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను నిరుత్సాహపరిచింది. ఆశించిన ఏ ఒక్క ప్రాజెక్టుకూ ప్రాధాన్యత దక్కలేదు. హైదరాబాద్-విజయవాడ హైస్పీడ్ రైలుమార్గం, బీబీనగర్-నడికుడి లైన్ డబ్లింగ్ ప్రస్తావన లేదు. డిండి ఎత్తిపోతల పథకానికి, కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్ ఈ బడ్జెట్లోనూ నెరవేరలేదు. జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే వివిధ రకాల సెస్‌లతో ప్రజలపై అదనపు భారం మోపుతూ నిర్ణయాలను ప్రకటించింది. పెట్రోలియం ఉత్పత్తులపై అగ్రిసెస్తో ధరలు పెరిగి నేరుగా ప్రజలపై భారం పడనుంది. దీంతోపాటు నిత్యావసర వస్తువుల ధరలపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇక ప్రతి బడ్జెట్ వైపు ఆశగా చూసే ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఈ సారి ఎలాంటి మినహాయింపులు లభించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై జిల్లాలో వివిధ రాజకీయపక్షాలు, వ్యాపార, మధ్య తరగతివర్గాలు పెదవి విరిచాయి. ఇది ప్రజల ఆకాంక్షలకు పట్టని బడ్జెట్ అంటూ వ్యాఖ్యానించాయి.
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మొండిచెయ్యి చూపింది. జిల్లాకు నేరుగా ప్రయోజనం కలిగించే ఒక్క అంశం కూడా ప్రస్తావనకు రాలేదు. రెండు తెలుగు రాష్ర్టాల రాజధానులను కలిపే సికింద్రాబాద్- విజయవాడ మార్గంలో హైస్పీడ్ రైలు నడుపాలన్న డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలు వెల్లువెత్తాయి. యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని 65వ నెంబర్ జాతీయ రహదారి వెంట నిర్మిస్తే ప్రజా, సరుకు రవాణా పరంగా గణనీయమైన మార్పులకు అస్కారం ఉంటుందన్న ఆశలున్నాయి. దీనిపై ఈ బడ్జెట్లో ఎంతో కొంత కదలిక ఉండొచ్చనే ఆశ ప్రజల్లో కనిపించింది. మరోవైపు బీబీనగర్-నడికుడి మార్గాన్ని డబ్లింగ్‌గా మార్చాలన్న డిమాండ్‌పై ఊసేలేకుండా పోయింది. నాగార్జునసాగర్-జడ్చర్ల రైలుమార్గంపైనా ఎలాంటి చర్చ జరుగలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మణిహారంగా భావిస్తున్న రీజినల్ రింగ్ ప్రస్తావన కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్డుకు పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. కేంద్ర సాయంతో దీన్ని నిర్మించాలని తలపెడితే కేంద్ర దీనికి కూడా ఈ బడ్జెట్లో మొండిచెయ్యే చూపింది. దేవరకొండ, మునుగోడు ప్రాంతాలను సస్యశ్యామలం చేసే డిండి ఎత్తిపోతలకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో అంతర్భాగంగా డిండి ఎత్తిపోతలను నిర్మిస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కితే ప్రాజెక్టు మరింత వేగవంతంగా పూర్తయ్యేది. కానీ అలాంటి ప్రస్తావనేదీ బడ్జెట్లో లేదు. దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్ల ఏర్పాటును బడ్జెట్లో ప్రస్తావించినా జిల్లాకు సంబంధించి స్పష్టత ఇవ్వలేదు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య స్కూళ్ల ఏర్పాటుపై కేంద్రం కొత్తగా ప్రకటన చేసింది. అయితే ఉమ్మడి జిల్లాలో 1.73లక్షల మంది గిరిజనులున్న నేపథ్యంలో ఏకలవ్య స్కూల్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి.
అదనపు భారాలు...
ఈ బడ్జెట్లో సామాన్యులకు పెద్దగా ప్రయోజనం కలగకపోనూ అదనపు భారాలు మోపారన్న చర్చ సర్వత్రా ఉంది. ప్రధానంగా పెట్రోల్, డీజిల్‌పై విధించే అగ్రి సెస్ ప్రజలపై అదనపు భారానికి దారితీయనున్నది. లీటర్ డీజిల్‌పై రూ.4, పెట్రోల్‌పై రూ.2.50 అదనపు భారం పడవచ్చని అంచనా. ఇదే జరిగితే జిల్లాలో ప్రతి రోజూ రూ.45లక్షల అదనపు భారం జిల్లా వినియోగదారులు మోయాల్సిందే. ప్రత్యక్షంగా, పరోక్షంగా మరిన్ని రంగాలను ప్రభావితం చేయడంతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఇక ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈసారి కూడా ఊరట లభించలేదు. ప్రస్తుతం ఉన్న స్లాబ్స్‌నే కొనసాగించనున్నారు. సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు, గృహ నిర్మాణ రుణాలపై వడ్డీ రాయితీ ఊరటనివ్వనున్నాయి. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ ఉమ్మడి జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లుగానే భావిస్తున్నారు. పేరుకు కేంద్ర బడ్జెట్ అయినా కేవలం కొన్ని రాష్ర్టాలకే పరిమితం చేసినట్లుగా వివిధ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
సామాన్యుడి నడ్డి విరిచేలా బడ్జెట్...
కేంద్ర బడ్జెట్ సామాన్యుడి నడ్డి విరిచేలా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తక్కువగా ఉన్నా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం.. అగ్రిసెస్ ద్వారా మరింతగా పిండుకోనుంది. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో పేద, సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఫర్టిలైజర్, వంటనూనెలు, దుస్తుల ధరల పెంపు ఆందోళనకరం.
- బండ నరేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్, నల్లగొండ జిల్లా
పేదల నడ్డివిరిచిన కేంద్ర బడ్జెట్...
అన్ని రంగాలకు నిరాశే. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కేటాయింపులు లేకపోవడంతో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. మహిళా సంక్షేమానికి నిధుల్లేవు, అసంఘటిత రంగాల కార్మికులకు కనీస వేతనాలు ప్రకటించకపోవడం ఆశ్చర్యం కల్గించింది. నిరుదోగ్య సమస్యను పరిష్కరించకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించేలా ప్రైవేటీకరణ జరుగుతున్నది.
- ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి, నల్లగొండ
రైతు, ప్రజా వ్యతిరేక బడ్జెట్...
బడ్జెట్ పూర్తిగా రైతు, ప్రజా వ్యతిరేకంగా ఉంది. పేద, మధ్య తరగతి, వేతన జీవులపై భారం వేశారు. 10శాతం పన్ను మినహాయింపు కల్పించడాన్ని గమనిస్తే కేంద్రం కార్పొరేట్, ప్రైవేట్ శక్తులకు దాసోహంగా పనిచేస్తున్నదని స్పష్టమవుతుంది. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించేలా ప్రయత్నిస్తున్నది.
- నెల్లికంటి సత్యం, సీపీఐ, జిల్లా కార్యదర్శి, నల్లగొండ
వేతన జీవులకు నిరాశ..
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వేతన జీవులను నిరాశ పరిచింది. ఆదాయ పన్ను విషయంలో రూ.5లక్షల వరకు మినహాయింపు ఇస్తుందనుకున్నాం. ఈ మేరకు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వినతులు కూడా ఇచ్చినప్పటికీ కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడం విడ్డూరం.
- శ్రీనివాసమూర్తి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, నల్లగొండ
సీనియర్ సిటిజన్స్‌కు ఉరట...
సీనియర్ సిటిజన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఆదాయపన్ను మినహాయింపు కల్పించడం సంతోషాన్నిచ్చింది. 75ఏండ్లు నిండిన వారికి పింఛన్ సొమ్ములో ఆదాయ పన్నును మినహాయించడం ఆహ్వానించదగ్గదే. ఐటీ మినహాయించాలని అనేక సార్లు కేంద్రాన్ని విన్నవించిన నేపథ్యంలోనే సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
- సముద్రాల మల్లికార్జున్, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు, నల్లగొండ జిల్లా
ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్స...
కరోనాదెబ్బకు కుదేలైన ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు బడ్జెట్‌ను వ్యూహాత్మకంగా రూపొందించారు. తాజా బడ్జెట్ సంస్కరణల బడ్జెట్‌గా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆర్థిక వృద్ధి మైనస్ 7.7శాతంగా ఉండగా దీన్ని 11శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరోగ్య రంగానికి మరింతగా నిధులు కేటాయించడం ఆహ్వానించదగ్గ పరిణామం. రాష్ర్టాలు అప్పులు చేసుకోవడానికి అదనపు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పించారు.
- పెద్దిరెడ్డి గణేశ్, సుధాబ్యాంకు, ఎండీ
మిశ్రమ బడ్జెట్..
కేంద్ర బడ్జెట్ మిశ్రమంగా ఉంది. అన్ని వర్గాలను సంతృప్తిపర్చలేకపోయింది. హెల్త్‌కేర్, స్వచ్ఛభారత్, విద్యుత్ రంగాలకు నిధుల కేటాయింపు బాగానే ఉన్నా.. డీజిల్, పెట్రోల్ ధరల పెంపు దిశగా చేపట్టనున్న సంస్కరణలు సామాన్య, మధ్యతరగతికి భారం కానున్నాయి. స్వయం ఉపాధి రంగాలకు ప్రోత్సాహం లేదు.
- చిట్టిప్రోలు యాదగిరి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, నల్లగొండ
యువతను విస్మరించిన బడ్జెట్
కేంద్ర బడ్జెట్లో యువజన రంగానికి కేటాయింపులు లేకపోవడం బాధాకరం. కరోనా కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారిని ఆదుకోవడానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. యువశక్తిని సద్వినియోగం చేసుకొనేందుకు ఎలాంటి ప్రయత్నాలు లేకపోవడం బాధాకరం.
- బొడ్డుపల్లి జయంత్ కుమార్, దేవరకొండ
రైతులపై పెనుభారం
తాజా బడ్జెట్లో పెట్రోల్, డీజిల్‌పై అగ్రి సెస్ విధించడం ఆందోళనకరం. ఇప్పుడిప్పుడే యాంత్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న రైతులు ఇంధన భారంతో ఆర్థికంగా నష్టాల్లోకి కూరుకుపోయే ప్రమాదం పొంచిఉంది. బడ్జెట్ కూర్పు సామాన్య, రైతు వర్గాలకు ఆశనిపాతమే అని చెప్పొచ్చు.
- నూకల సరళా హన్మంతరెడ్డి, ఎంపీపీ, మిర్యాలగూడ రూరల్
సామాన్యుడి నడ్డి విరిచేలా బడ్జెట్...
కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రో ధరలు పెంచేలా బడ్జెట్ రూపొందించింది. గడిచిన ఆరేండ్లలో రూ.30కి పైగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పేదలకు ధీమానిచ్చే ఎల్ఐసీని కూడా ప్రైవేట్ పరం చేసేలా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. సామాన్యుడి జీవితంపై బడ్జెట్ చాలా ప్రభావం చూపుతుంది. కరోనాతో అతలాకుతలమైన పేద, మధ్యతరగతి ప్రజలను తాజా బడ్జెట్ మరింత ప్రమాదంలోకి నెట్టివేసే అవకాశాలున్నాయి.
- కట్కూరి వెంకటేశ్‌గౌడ్, వైస్ ఎంపీపీ, మర్రిగూడ
కీలక ప్రాజెక్టుల ఊసేలేదు..
ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టు ప్రస్తావన బడ్జెట్లో లేదు. యాదాద్రి ఎంఎంటీఎస్ రైలు, హైస్పీడ్ రైలుమార్గాలు, రీజినల్‌రింగ్ రోడ్డు లాంటి కీలక ప్రాజెక్టులకు చోటు దక్కలేదు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బీబీనగర్-నడికుడి డబ్లింగ్ పనుల ప్రస్తావన కూడా లేదు. కొన్ని రాష్ర్టాలకు సంబంధించిన ఎన్నికల బడ్జెట్‌గా కనిపిస్తుంది. ప్రయోజనం లేకపోనూ ప్రజలపై అదనపు భారాలకు ఆస్కారం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు నిరాశాజనక బడ్జెట్ ఇది.
- బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎంపీ
ఎన్నికల బడ్జెట్...
కేంద్ర బడ్జెట్ కేవలం కొన్ని రాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రూపొందించారు. ఆ రాష్ర్టాలకు మాత్రమే వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రతిపాదిస్తూ తెలంగాణ లాంటి మిగతా రాష్ర్టాలకు మొండిచెయ్యి చూపారు. కేంద్ర బడ్జెట్‌గా అనిపించలేదు. జిల్లాలో ఎయిమ్స్‌కు గానీ, కొత్తగా రైల్వే పనులకు గానీ, ఇతర ఏ ఒక్క అంశానికీ చోటు దక్కలేదు.
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ
తాజావార్తలు
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..