గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 31, 2021 , 00:49:36

సిల్‌ శిల

సిల్‌ శిల

  • క్రీస్తు పూర్వం మొదలు..
  • కృష్ణపట్టెకు కొండంత అండ.. నాపబండ
  • ఆదిమ మానవుడికి ఆశ్రయం.. నదీమ తల్లికి ప్రాకారం
  • సరిహద్దున పెట్టని కోటలా రాజ్యాలకు రక్షణ
  • ఆలయాల నిర్మాణంలోనూ శిలావిలాసం 
  • నేడు సిమెంట్‌, పాలిష్‌ పరిశ్రమలకు ముడిసరుకు
  • వేల కోట్ల టర్నోవర్‌.. లక్షల మందికి ఉపాధి
  • ఇక్కడి గుండ్రాళ్లకు విదేశాల్లో ఫుల్‌ డిమాండ్‌
  • కోడి గుడ్డు పొట్టు.. మగువ చేతిలో ముగ్గూ ఇదే.. 
  • పునాది నుంచి సమాధి దాకా పెనవేసుకున్న బంధం

రాయిని నేను.. చిరాయువు నేను.. నిఖార్సయిన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం నేను! క్రీస్తు పూర్వం లక్ష సంవత్సరాల కిందట పాతరాతి యుగాన కృష్ణపట్టెన ఆదిమ మానవుడికి ఆశ్రయము.. ఆయుధమూ నేనే!! క్రీస్తు పూర్వం 50 వేల నుంచి 10వేల సంవత్సరాల మధ్య  శిలాయుగాన నాగార్జునకొండ, ఏలేశ్వరంలో వ్యవసాయ పనిముట్టునైనా, బృహత్‌ శిలాయుగాన క్రీ.పూ వెయ్యి నుంచి 600 ఏండ్ల నడుమ వాడపల్లిలో సమాధి రాయినైనా నేనే!!! శిలను నేను... శాసనమయ్యాను! చరిత్ర క్రీస్తు శకంలోకి అడుగు మోపాక... ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల సామ్రాజ్యాలకు సరిహద్దున ప్రాకారమై కాపలా కాశాను. శత్రు మూకల ఫిరంగి గుండ్లను అడ్డుకుని నా ప్రజలను కాపాడుకున్నాను. రాజ భవనమై రాజసం చాటాను. కీకారణ్యాన నీడనై మునులను కాచుకున్నాను. అగస్త్యుడి చేతులమీదుగా మూల విరాట్టునై వాడపల్లిలో నిత్య పూజలందుకుంటున్నదీ నేనే!! ఎల్లలు దాటిన చరితను పల్లెల్లో శాసనమై భావితరానికి అందిస్తున్నదీ నేనే!!!సిరిని నేను.. తరిగీ సంపదనిస్తాను! వయ్యారాలు పోయే నీలవేణిని ఒద్దికగా మలిపి బీడు భూముల్లో బంగారం పండిస్తున్నాను. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన వేళ పెట్టని కోటలా వేల గ్రామాలకు ‘రక్ష’ణై నిలబడుతున్నాను. నాగరిక సమాజాన ఇంటి పునాది మొదలు కంచంలో కూడు దాకా మీతో నేనున్నాను. ముడిసరుకునై లక్షల కుటుంబాల కడుపు నింపుతున్నాను. నా మేనిఛాయతో దేశవిదేశాన నీలగిరి ఖ్యాతిని చాటుతున్నాను. నేను.. మీ నాపరాయిని!

దామరచర్ల, జనవరి 30 : ‘రాయిని నేను.. చిరాయువు నేను.. ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా ఆవిర్భవించి ఆదిమ మానవుడికి ఆయుధమై.. నాగరిక సమాజానికి నవ నిర్మాణమై నిలిచిపోయాను. నాపబండగా పిలుచుకొనే నేను కృష్ణా, మూసీ నదుల తీరంలో లక్షల ఎకరాల్లో నిక్షిప్తమై ఉన్నాను. ప్రవాహానికి పెట్టని గోడలా నిలిచి వరదలు గ్రామాలను ముంచెత్తకుండా కాపాడుతున్నాను.  ఆదిమానవులకు గుహలా మారి నివాసాన్ని కల్పించి నీడనిచ్చాను. మునుల తపస్సుకు రక్షణగా నిలిచాను. దేవతామూర్తులకు మూలవిరాట్టు ప్రతిరూపాలై.. గర్భగుడికి ఆధారమై.. ప్రతి ఇంటికి పునాదినై నిలిచిపోయాను. శిలగా ఉన్న నన్ను బ్లాస్టింగ్‌లతో పెకిలించి, ఇనుప రంపాలతో కోసి, మరయంత్రాల్లో కరిగించి, పిండిలా తయారు చేసి వాడుకుంటున్నారు. సిమెంటు పరిశ్రమలకు ముడిసరుకునై సిరులు కురిపిస్తున్న నేనే.. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించాను. ఆధునిక పోకడల అవసరాలకు అనుగుణంగా, ఆధునిక మానవుల రాజసానికి నగిషీగా మారిపోయాను. పునాది మొదలు సమాధి వరకు... నేను కరుగుతూ మీకు సిరులు కురిపిస్తున్నాను.’  ‘నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నుంచి సూర్యాపేట జిల్లా మఠంపల్లి వరకు కృష్ణానదీ తీరంలో, దామరచర్ల మండలం తెట్టెకుంట నుంచి వాడపల్లి వరకు మూసీనది ఇరువైపులా లక్షల ఎకరాల్లో నేను నిక్షిప్తమై ఉన్నాను. నదుల పట్టుకతో భూగర్భం నుంచి వెలుగుచూసిన నేను.. ఎన్నో జీవాలకు ఆవాసమై.. అడిగిన ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తున్నాను. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని కృష్ణాతీరంలో వేలాది కిలోమీటర్ల పరిధిలో ఏకశిలగా భూతల్లి గర్భంలో సేదదీరుతున్నాను.’

ప్రతి ఇంట సుందర రూపాన్నై...  

పాలిష్‌, ముగ్గుమిల్లులకు నిత్యం 300టన్నుల ముడిసరుకుగా నేను ఉపయోగపడుతున్నాను. పొలాల్లో పేరుకున్న నావల్ల రైతులు కొంత ఇబ్బంది పడ్డా.. మిల్లుల రాకతో వారి బాధలు తొలగిపోయాయి. ‘ఎందుకూ పనికిరాదు..’ అని అనుకున్న వారి ఇంట.. సిరులు కురిపిస్తున్నాను. నన్ను ఆసరాగా చేసుకొని దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో 50పాలిష్‌ మిల్లులు నడుస్తున్నాయి. రోజూ 100టన్నుల శిల నుంచి సైజుల వారీగా కత్తిరించి అందంగా ముస్తాబు చేస్తున్నారు. జనం కొత్తగా నిర్మించే ఇండ్లల్లో పరుచుకొని అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. నదిలోనే ఉంటూ నీటికి కరిగి గుండ్రాళ్లుగా మారిన నన్ను సేకరించి ఇండ్ల ముందు, పార్కుల్లో అందంగా అమరుస్తున్నారు. ఇతర దేశాలకు, పెద్ద పెద్ద నగరాలకు, పట్టణాలకు తరలిస్తున్నారు. నా శిల నుంచి వచ్చిన చిన్న ముక్కను కూడా వృథా కానివ్వడం లేదు. ముక్కరాయిని ఇంటి పునాదులకు, గోడలకు వాడుకుంటున్నారు. దామరచర్ల, వాడపల్లి, ఇర్కిగూడెం గ్రామాల్లో సుమారు 20ముగ్గుమిల్లులు ఏర్పాటు చేసుకొని రోజూ 200టన్నుల ముడిసరుకును కంకరగా, సన్న రవ్వగా మారుస్తున్నారు. సన్నరాతి రవ్వను కోళ్ల దాణాలో కలుపుతున్నారు. కోడిగుడ్లపై పెంకుగా మారుతున్నా. మగువల చేతిలో ముగ్గునై ముంగిళ్లలో వాలిపోతున్నా. శిలగా ఉన్న నేను మానవజాతికి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నందుకు, నా ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు, నేను కరిగిపోయినా ఉపయోగపడుతున్నందుకు చెప్పడానికి మాటలు రాక మనస్సులో మురిసిపోతున్నా.

- మీ నాపరాయి ఆదిమానవులకు నీడగా.. మునుల 

తపస్సుకు రక్షణగా.. 

కృష్ణా, మూసీ నదుల తీరంలో పెద్దపెద్ద పొరలుగా ఆదిమానవులకు నీడనిచ్చింది నేనే. ఇర్కిగూడెం, దామరచర్ల పరిధిలో ఆదిమానవులు నన్ను తొలచి ఆవాసాలను ఏర్పాటు చేసుకొన్నారు. నా ఎదలో దాగి ఎండకు, వానకు తలదాచుకున్నారు. వారి చేతిలో ఆయుధాలై జంతువుల వేటకు బరిసెగా మారింది నేను. జీవన విధానానికి చిహ్నంగా వస్తువులకు, వారి సమాధులకు సైతం నన్నే వాడుకున్నారు. నేటికీ వాడపల్లి సమీపంలో గుహలు, ఇర్కిగూడెంలో రాకాసిగట్టు, దామరచర్లలో దెయ్యాలదిబ్బలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అటవీ జంతువులకు, పశుపక్ష్యాదులకు నివాసాలుగా, మునులకు తపోభంగం కలుగకుండా రక్షణగా నిలిచిందీ నేనే. 

మూలవిరాట్టులకు ప్రతిరూపమై...

కృష్ణాతీరంలో వెలసిన దేవతామూర్తులకు ప్రతిరూపం నేనే. మూలవిరాట్టు ప్రతిరూపమై.. గర్భగుడికి ఆధారమై.. ప్రాకారానికి పునాదినై నిలిచాను. రాజుల కాలంలో రాసిన శాసనం నేనే.. వారికి ఆసనం నేనే. దామరచర్ల, వాడపల్లిలో ఆరు పురాలు, ఏడు కోటల్లో ఇండ్లకు రాయినై నిలిచాను నేను. ఇక్కడ పూజలందుకుంటున్న శ్రీమీనాక్షీ అగస్తేశ్వరుడిని, శ్రీలక్ష్మీనరసింహుడిని, త్రిలింగేశ్వరస్వామినీ నేనే. ఎన్నో ఉప ఆలయాలు, గుళ్లు, గోపురాలకూ నేనే ఆధారం. ముదిమాణిక్యంలోని 108ఆలయాల్లో మూలవిరాట్టుగా నిత్యం పూజలందుకుంటున్నదీ నేనే. అడవిదేవులపల్లిలోని బౌద్ధంపాడు శివపంచాయతనం, బాల్నేపల్లి, చిట్యాల శ్రీఆంజనేయస్వామి ఆలయాలకు, మట్టపల్లి, పాలకవీడు, చింతలపాలెంలో రాజుల కాలంలో నిర్మించిన ఆలయాల ప్రాకారాలకు బిగిసుకుపోయిందీ నేనే.

రాజుల కోటలకు రక్షణ కవచమై.. 

ఎంతోమంది రాజవంశీయులు కృష్ణా, మూసీ నదుల తీరాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించారు. నన్ను ఆసరాగా చేసుకుని చోళులు, రెడ్డిరాజులు, శాతవాహనులు, కాకతీయులు, మొగల్‌ చక్రవర్తులు పరిపాలించారు. కృష్ణా, మూసీ నదులు నన్ను ఆనుకొని ప్రవహిస్తుండటం వల్ల రెండు రాజ్యాలకు మధ్య సరిహద్దుగా, శత్రుదుర్భేద్యంగా మారి రక్షణ కల్పించిందీ నేనే. కాకతీయులు, అనవేమారెడ్డి, భీమారెడ్డి రాజులు తమ పాలనలో నన్ను గుర్తించి అనేక ఆలయాలను నిర్మించారు. కోటగోడలుగా మలిచి ఫిరంగుల దెబ్బలకు అడ్డుగా నిలిపి శత్రువుల బారి నుంచి ప్రాణాలు కాపాడుకున్నారు. రాజుల నివాసాలకు, కోటలకు, నన్ను నగిషీలుగా మలిచారు. మొగలు సుల్తానుల విలాస భవంతులకూ నేనే ఆధారం. 

సిమెంటు పరిశ్రమలకు ముడిసరుకునై... 

నదుల తీరంలో నిక్షిప్తమైన నాపైనే ఆధారపడి బడా వ్యాపారులు సిమెంటు పరిశ్రమలు పెట్టుకున్నారు. నాటి నుంచి నేను సిమెంటు రూపంలో ప్రజలకు చేరువైతున్నాను. నేను కరిగిపోతున్నా, తరిగిపోతున్నా.. ప్రజలకు ఉపయోగపడుతున్నందుకు సంతోషపడుతున్నా. నన్ను ఆసరాగా చేసుకొని దామరచర్ల మండలంలో 2, హూజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 13, గుంటూరు జిల్లాలో మరో 10సిమెంటు పరిశ్రమలను నెలకొల్పారు. భూగర్భంలో పెద్దపెద్ద బ్లాస్టింగులతో పెకిలిస్తున్నారు. పెద్దపెద్ద యంత్రాలతో కంకరగా, పిండిగా మార్చి సిమెంటు తయారు చేస్తున్నారు. కృష్ణపట్టెలో 25పరిశ్రమల నుంచి నిత్యం 50వేల టన్నుల సిమెంటును ఉత్పత్తి చేస్తూ ఇతర ప్రాంతాలకు, విదేశాలకు తరలిస్తున్నారు. అందుకే నేను ప్రతి ఇంటికి పునాదినై ఒదిగిపోతున్నాను. లక్షలాది కుటుంబాలకు ఉపాధినిస్తూ ప్రజలకు ఉపయోగపడే ప్రతి పనిలో నేను ఉన్నందుకు సంతోషిస్తున్నాను. 


VIDEOS

logo