గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 30, 2021 , 01:42:09

పదేండ్లుగా ప్రకృతి వ్యవసాయం

పదేండ్లుగా ప్రకృతి వ్యవసాయం

  • మామిడి, దానిమ్మ, వరి 
  • సాగులో అధిక దిగుబడి
  • సొంతంగా సేంద్రియ ఎరువుల తయారీ 
  • ఆదర్శంగా నిలుస్తున్న రైతు సత్తయ్య

వ్యవసాయంలో విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతున్నది. పండే ఆహారం సైతం విషతుల్యమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా వీటి వాడకాన్ని ఎవరూ తగ్గించడం లేదు. కానీ పదో తరగతి వరకే చదివిన మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన బొమ్మకంటి సత్తయ్య పదేండ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. సేంద్రియ విధానాల్లోనే పంటలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

మునుగోడు, జనవరి 29  : చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన రైతు సత్తిరెడ్డి సలహాతో పదేండ్ల క్రితం ప్రకృతి వ్యవసాయంపై సత్తయ్య అవగాహన పెంచుకున్నాడు. ఆపై ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాశ్‌ పాలేకర్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి వెళ్లాడు. అక్కడ ఎనిమిది రోజుల పాటు సేంద్రియ పద్ధతులపై శిక్షణ పొందాడు. నాటి నుంచి సత్తయ్య తన మూడు ఎకరాల భూమిలో ఇదే పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు.

రెండు ఎకరాల్లో మామిడి...

2013లో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో హిమాయత్‌, దశేరీ రకాలకు చెందిన 200 మామిడి మొక్కలు నాటాడు. నాటి నుంచి మొక్కలకు ఎలాంటి రసాయన ఎరువులను వాడలేదు. వేప, కానుగు, వాయిలాకు, తదితర పది రకాల ఆకులతో చేసిన దశపత్ర కషాయాన్ని ఏటా పూత, కాత వచ్చే వరకు నాలుగుసార్లు పిచికారీ చేస్తున్నాడు. తెగుళ్లు, దోమలు, ఇతర పురుగుల నివారణకు 200 లీటర్ల నీటిలో 200 ఎంఎల్‌ డీకంపోజ్‌ లిక్విడ్‌, రెండు కిలోల నల్లబెల్లం వేసి తయారు చేసిన ద్రావణాన్ని పిందలు పడ్డాక పిచికారీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు క్రాప్‌ల్లో సుమారు ఐదు టన్నుల మామిడి పండ్ల దిగుబడి రాగా ఒక్కో టన్నుకు రూ.లక్ష చొప్పున ఆదాయం వచ్చింది. 

తోటి రైతులకు అవగాహన కల్పిస్తూ...

తిండి గింజల కోసం అర ఎకరంలో వరి పంటను సేంద్రియ విధానంలో సాగుచేస్తున్నాడు. ఈ బియ్యం తింటున్నప్పటి నుంచి తమ కుటుంబం పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నదని సత్తయ్య చెబుతున్నాడు. పైగా సహజ సిద్ధమైన పద్ధతుల్లో పండించిన ధాన్యం, పండ్లు, కూరగాయలు చాలా రుచిగా ఉంటున్నాయని అంటున్నాడు. మరో అర ఎకరంలో దానిమ్మ తోట వేశాడు. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపే తోటి రైతులకు సైతం సత్తయ్య అవగాహన కల్పిస్తున్నాడు. ఆయన సేవలను గుర్తించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2015 తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల్లో మండల ఉత్తమ రైతు పురస్కారాన్ని సైతం అందజేసి సత్కరించింది.

VIDEOS

logo