ఏడు పదులకుఎన్నో ఫలాలు

- రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 72 ఏండ్లు
- పరిపాలన వికేంద్రీకరణతో ప్రజల వద్దకు పాలక మండళ్లు
- పంచాయతీ హోదాతో తండాల్లో గిరిజనులదే పాలన
- 50% రిజర్వేషన్‌తో స్థానిక సంస్థల్లో మహిళా శక్తి
- ఈడబ్ల్యూఎస్ కోటాపై హర్షాతిరేకాలు
- పల్లె ప్రగతితో గ్రామాల్లో సమూల మార్పులు
- 103 పంచాయతీలకు నేడు ఉత్తమ అవార్డులు
- గణతంత్ర వేడుకలకు అంతటా ఏర్పాట్లు
- పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి
స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వాలను ఆశిస్తూ భారతావని తనకు తానుగా... అంటే, మనకు మనముగా రాజ్యాంగాన్ని సమర్పించుకుని నేటికి నిండా 72 ఏండ్లు. అందులో ఆరు పదుల చీకట్లను దాటుకుని వెలుగుల వర్తమానంలోకి వచ్చిన తెలంగాణ నేడు భవిష్యత్ వైపు ఆశగా అడుగులు వేస్తున్నది. ఉమ్మడి నల్లగొండ.. మూడు జిల్లాలుగా రూపాంతరం చెందడం మొదలు.. కొత్త మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల ఏర్పాటు దాకా పౌరులకు పాలన చేరువవుతూ వస్తున్నది. పల్లెల్లో నిధుల వరద పారుతున్నది. గుక్కెడు మంచి నీళ్లు రాని, అంతిమ సంస్కారాలకూ స్థలం లేని దుస్థితిని దాటుకుని గ్రామాలు సకల వసతులు సమకూర్చుకుంటున్నాయి. పారిశుధ్యం, పచ్చదనం మెరుగయ్యాయి. అలాంటి 103 పంచాయతీలు మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగనున్న గణతంత్ర వేడుకల్లో ఉత్తమ అవార్డులు అందుకోనున్నాయి. మరోవైపు కొత్త మున్సిపాలిటీల పాలకవర్గాలు ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నాయి. అనుబంధ గ్రామాలుగా ఉంటూ నిధులకు తండ్లాడిన తండాలు నేడు పంచాయతీలై.. తమవారి నాయకత్వంలో రూపురేఖలు మార్చుకుంటున్నాయి. 50శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో మహిళాశక్తి ప్రజ్వరిల్లుతున్నది. ఆర్థికంగా వెనుకబడిన పేదలకు 10శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపైనా హర్షం వ్యక్తమవుతున్నది. ఇలాంటి శుభసందర్భాన గణతంత్ర దినోత్సవానికి ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వేడుకలకు హాజరయ్యే వారు విధిగా మాస్క్ ధరించాలని కలెక్టర్లు సూచించారు.
నల్లగొండ ప్రతినిధి, జనవరి25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ పరిపాలన వికేంద్రీకరణకు తెరలేపింది. దీంతోపాటు కొత్త మండలాలను ఏర్పాటుచేసి తండాలను గ్రామ పంచాయతీగా మార్చింది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 31 మండలాల్లో 844 గ్రామ పంచాయతీలు.. సూర్యాపేట జిల్లాలో 23 మండలాల్లో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా, మండల, పంచాయతీల పాలకవర్గాల్లో 50శాతం రిజర్వేషన్‌తో మహిళలే పాలనాధ్యక్షులుగా ఉన్నారు. గతంలో 33శాతంగా ఉన్న మహిళా రిజర్వేషన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ 50శాతానికి పెంచి అమలుకు శ్రీకారం చుట్టారు. ఇక గతంలో అటు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులంటూ ఉండేవి కావు. గ్రామాల్లో వసూలు చేసే నల్లాబిల్లులు, ఇంటిపన్నులు ఇతరత్రా మినహా అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత తీవ్రంగా ఉండేది. కనీసం సక్రమమైన తాగునీటి వ్యవస్థ, మురుగునీటి పారుదల పద్ధతి, వీధిలైట్ల లాంటి కనీస సౌకర్యాల కల్పనకు నిధులు ఉండేవి కావు. దీంతో అనేక గ్రామాల్లో సమస్యలు తిష్టవేసి కనిపించేవి. ఇక గ్రామాల్లో సొంత భూమి లేని వారు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు నానా తంటాలు పడేది. రోడ్ల వెంట దహనం చేసే పరిస్థితి ఉండేది.
మారుతున్న పల్లెల రూపురేఖలు
అటు పట్టణాలు. ఇటు గ్రామాల్లో రూపురేఖలను సమూలంగా మార్చాని ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గతంలో గ్రామాలకు ప్రత్యేక నిధులు వచ్చేవి కావు. కానీ నేడు సీఎం కేసీఆర్ ప్రతినెలా క్రమం తప్పకుండా జనాభా ప్రతిపాదికన నిధులు విడుదల చేస్తుండడం గ్రామాల్లో మౌలికంగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టినైట్లెంది. 2019 సెప్టెంబర్ నుంచి నేటి వరకు ప్రతినెలా నిధులను విడుదల చేస్తున్నది. గ్రామంలో వెయ్యి జనాభా ఉంటే నెలకు రూ.1.32లక్షల చొప్పున నిధులు విడుదలవుతున్నాయి. ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు అదే నిష్పత్తిలో నిధులను విడుదల చేస్తున్నారు. ఇలా నల్లగొండ జిల్లాలోని గ్రామాలకు ప్రతి నెలా రూ.20 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ. 12 కోట్ల చొప్పున వరుసగా 17నెలలుగా నిధులు విడుదల చేశారు. కేవలం పల్లె ప్రగతి కార్యక్రమం కిందనే నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు కలిపి ఇప్పటివరకు రూ.544 కోట్లు విడుదలయ్యాయి. వీటితో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీనికితోడు పల్లె ప్రగతి నిధులతో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడింది. ప్రతి గ్రామానికి రూ.10లక్షల వరకు నిధులను వెచ్చించి ఓ ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా గ్రామంలోని మొక్కలను పెంచడంతో పాటు చెత్త సేకరణ చేపడుతున్నారు. చెత్తను ఒక చోట చేర్చేందుకు రూ.రెండున్నర లక్షల నిధులతో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశారు. ఇక గ్రామాల్లో పచ్చదనం పెంపుకోసం ప్రత్యేకంగా హరితహారం చేపట్టారు. ఇందులో నాటిన ప్రతి మొక్కనూ బతికించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారుల్లో మొక్కలను పెంచడంతోపాటు ప్రత్యేకంగా ప్రతి గ్రామానికో పల్లెప్రకృతి వనం పేరుతో పార్క్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. వీటిలో రూ.ఆరు లక్షలు వెచ్చిస్తూ రెండేండ్లపాటు మొక్కలను నాటి సంరక్షణ చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రతి గ్రామంలో రూ.రెండు లక్షలతో నర్సరీలను కూడా అందుబాటులోకి తెచ్చారు. గ్రామాల్లో కీలక సమస్యగా ఉన్న శ్మశానవాటికలకు కూడా శాశ్వత ప్రతిపాదికన పనులు చేపట్టారు. ఒక్కో వైకుంఠధామానికి రూ.12.60లక్షల చొప్పున నిధులను కేటాయించారు. ఇవన్నీ రానున్న రోజుల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇక గ్రామ పంచాయతీ సిబ్బందికి సైతం మంచి భవిష్యత్తు కల్పించింది. వారీకి జీతాలు పెంచడంతోపాటు నెలనెలా క్రమ తప్పకుండా జీతాలు అందేలా చర్యలు చేపట్టింది. గ్రామాల్లో గతంలో కొత్తగా వీధిలైట్ వేయాలంటే నెలల కొద్దీ ఎదురుచూడాల్సి వచ్చేది. నేడు వీధిలైట్ లేవన్న చర్చకు కూడా ఆస్కారం లేకుండా పోయింది. మున్సిపాలిటీల్లోనూ పట్టణ ప్రగతి నిధులతో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే క్రమంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం జలాలతో ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు పూర్తి స్థాయి సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఇక జిల్లా దక్షిణ భాగాన ఉన్న డిండి ఎత్తిపోతలపైనా రెండు రోజుల కిందటే ప్రత్యేక సమీక్ష చేస్తూ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రకటించారు. ఇవి పూర్తయితే జిల్లా అంతటికీ సాగునీరు అందుబాటులోకి రానుంది. ఇదే సమయంలో లాభదాయక పంటలు పండించే దిశగా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక్కో క్లస్టర్‌కు ఒకటి చొప్పున రైతువేదికలను నిర్మించారు. ఒక్కో రైతు వేదికకు రూ.22లక్షల నిధులను వెచ్చిస్తూ వీటి నిర్మాణం చేపట్టారు. నల్లగొండ జిల్లాలో 140, సూర్యాపేట జిల్లాలో 82 రైతు వేదికలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. త్వరలోనే వీటిలో వ్యవసాయ పరమైన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో రైతులకు ప్రతి సీజన్లో కల్లాల సమస్యగా తీవ్రంగా వేధిస్తుంది. దీనికి పరిష్కారంగా ప్రభుత్వమే సబ్సిడీతో రైతుల సొంత భూముల్లో కల్లాల నిర్మాణాలకు రూ.65, 75, 85 వేల చొప్పున నిధులను కేటాయించింది. ఇవి కూడా రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి తోడు పెట్టుబడి సాయంగా రైతుబంధును ఇస్తూ, భూమి ఉన్న రైతు ఏ కారణంతో చనిపోయినా రూ.ఐదు లక్షల భీమాను వర్తింప చేస్తూ అండగా నిలుస్తున్నది. ఇవి కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల్లో మార్పులు రావాలని కూడా పలురకాల ప్రోత్సహాకాలను అందజేస్తున్నది.
- కొత్త మున్సిపాలిటీలు.. అభివృద్ధి అడుగులు
- ఏడాది పూర్తయిన పురపాలక సంఘాలు
నూతన మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా హాలియా, చండూరు, చిట్యాల, నందికొండ, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. పట్టణ ప్రగతిలో భాగంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మౌలిక సదుపాయాల కల్పనతో ప్రజలకు ఇబ్బందులు తీరాయి. నందికొండ మున్సిపాలిటీ చేయక ముందు నాగార్జునసాగర్ ప్రజలు 50 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎరుగరు. అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాగార్జునసాగర్‌ను నందికొండ మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో అక్కడ ఆ సమస్య తీరింది. పట్టణ ప్రగతిలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రత, హారితహారం, సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నారు. నూతన మున్సిపాటీల్లో అభివృద్ధితో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
అగ్రవర్ణ పేదలకు ఎంతో మేలు
రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల చాలా మందికి మేలు జరుగుతుంది. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో పదిశాతం రిజర్వేషన్లు లభిస్తాయి. అగ్రవర్ణాల పేదలకు న్యాయం చేసేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తోడ్పడుతుంది.
- మరింగంటి కల్యాణి, ప్రైవేటు
ఉపాధ్యాయురాలు, మేళ్లచెర్వు పంచాయతీల ఏర్పాటుతో తండాలో మార్పు
తిరుమలగిరి, జనవరి 25 : మండలంలోని సిద్దిసముద్రం తండా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాటోత్తండా, చౌళ్లతండాతో కలిపి నూతన గ్రామపంచాయతీగా ఏర్పడింది. రూ.15 లక్షలతో సీసీరోడ్లు, డ్రైనేజీలు, రెండు పల్లె ప్రకృతి వనాలు, బోర్లు ఏర్పాటు చేశారు. నాడు ఎక్కడ చూసినా చెత్తాచెదారం, బురదమయంగా ఉండే గ్రామం నేడు పరిశుభ్రంగా మారింది. 60 ఏండ్ల లేని అభివృద్ధి ఏడాదిలోనే అయ్యింది. లంబాడాల అభివృద్ధి కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
103 పంచాయతీలకు ఉత్తమ అవార్డులు
నల్లగొండ, జనవరి 25 : పల్లె ప్రగతిలో భాగంగా అభివృద్ధి పనుల్లో ముందంజలో ఉన్న గ్రామాలను ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 103 గ్రామ పంచాయతీలు ఎంపికకాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో దేవరకొండ డివిజన్లో 37, మిర్యాలగూడ డివిజన్లో 30, నల్లగొండ డివిజన్లో 36 గ్రామాలు ఉన్నాయి. వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్, పారిశుధ్యం నిర్వహణలో మెరుగ్గా ఉన్న గ్రామాలను ఈ అవార్డుకు ఎంపిక చేయగా ఆయా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు జిల్లా పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌కు రావాలని సూచించారు.
50 శాతం రిజర్వేషన్‌తో ఎంపీపీనయ్యా..
2019లో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదువుతున్నప్పుడు నాకు అనూహ్యంగా రాజకీయాల్లో పాల్గొనే అవకాశం కల్గింది. మా అత్తగారి గ్రామం మదారిగూడెం. ఎస్సీ రిజర్వు కావడంతో పేరూరు ఎంపీటీసీగా పోటీచేసి గెలుపొందిన. ఆ తర్వాత పెద్దల సహకారంతో అనుముల మండలానికి ఎంపీపీని అయ్యాను. విద్యార్థి దశ నుంచి నేరుగా రాజకీయాల్లో రావడం, ప్రజలకు సేవచేసే భాగ్యం కలగడం ఆనందంగా ఉంది.
- పేర్ల సుమతి, హాలియా ఎంపీపీ తండాల్లో అభివృద్ధి
ప్రభుత్వం తండాలను
పంచాయతీలుగా ఏర్పాటు చేసిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందాయి. తండాల్లో సీసీరోడ్లు, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశాం. లైట్లు తడి, పొడి చెత్తతో కంపోస్ట్ తయారు చేసే షెడ్డు ఏర్పాటు చేసినం. ఈ ఎరువును రైతులకు అందిస్తున్నాం. ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. పల్లె ప్రగతిలో వననర్సరీ ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా తండా ప్రజలు సంతోషంగా ఉన్నారు.
-సర్పంచ్ నేనావత్ శ్రీనునాయక్, మర్రిచెట్టు తండా, దేవరకొండ
మారిన పట్టణ శివారు..
కోదాడ రూరల్, జనవరి 25 : కోదాడ పట్టణ పరిధి అశోక్‌నగర్ కాలనీ వాసులు ఒకప్పుడు మురుగునీరు, బురద రోడ్లు, దోమలతో ఇబ్బంది పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో నేడు సుందరంగా మారాయి.
తాజావార్తలు
- స్వచ్ఛంద ఈపీఎఫ్‌వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్‌తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ముఖేష్ అంబానీ ఇంటి వద్ద వాహనం కేసు దర్యాప్తు ఎన్ఐఏకు బదిలీ
- ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్‌కు చేదు అనుభవం
- గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి
- మార్చి 31 వచ్చేస్తోంది.. ఐటీఆర్‌తో ఆధార్ జత చేశారా?
- ఐటీ దాడులపై తాప్సీ.. తప్పుచేస్తే శిక్షకు రెడీ
- రెండో పెళ్లి వార్తలపై మరోసారి సీరియస్ అయిన సురేఖ వాణి