అడుగులు వేసిన ఆత్మవిశ్వాసం

- నాయుడుపాలెం గ్రామంలో 31మంది దివ్యాంగులు
- స్వశక్తితో పలు పనులు.. కుటుంబానికి ఆసరాగా..
- ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఙప్తి
హాలియా, జనవరి 24 : వారంతా దివ్యాంగులే.. కానీ వారి ఆత్మవిశ్వాసం ముందు అవిటితనం చిన్నబోయింది. అనుముల మండలం నాయుడుపాలెం గ్రామంలో 31మంది దివ్యాంగులున్నారు. వీరంతా తాము దివ్యాంగులమని కాలు ముడుచుకొని కూర్చోలేదు. ఇంటి వద్దే సైకిల్, బైకులకు పంచర్ వేస్తూ ఒకరు, చిరువ్యాపారం చేస్తూ మరొకరు, ప్లాస్టిక్ సామగ్రిని ఆటోలో ఊరూరా తిరిగి విక్రయిస్తూ ఇంకొకరు బతుకు పోరులో ముందుకు సాగుతున్నారు. పుట్టుకతో దివ్యాంగులైన వారు కొందరైతే పోలియో బారినపడిన వారు మరికొందరు. చిన్నతనం నుంచి తమను కంటికి పాపలా కాపాడిన తల్లిదండ్రులు, తోబుట్టువులకు భారం కాకూడదనే భావంతో తమకు తోచిన పని చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం కావడంతో ప్రభుత్వం సహకారం అందించాలని వేడుకుంటున్నారు.
కాళ్లు చచ్చుబడినా.. పంచర్ వేస్తూ..
నాయుడుపాలెం గ్రామానికి చెందిన మెగావత్ దేన్య, దేవి నిరుపేద దంపతులు. 10మేకలే వారి ఆస్తి. వీరి నలుగురి సంతానంలో శంకర్ మూడో వాడు. పుట్టుకతోనే పోలియో బారినపడి రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. శంకర్ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. పంచర్లు చేయడం నేర్చుకున్నాడు. తమ ఇంటి వద్ద పంచర్ చేస్తే వచ్చే కొద్ది డబ్బుతో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, చివరి సోదరుడితో కలిసి జీవిస్తున్నాడు. రెండు కాళ్ల లేకపోవడం వల్ల పంచర్ చేసిన తర్వాత గాలి కొట్టేందుకు ఇబ్బందిగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్థిక సహకారం అందిస్తే గాలి మిషన్ కొనుగోలు చేసి పంచర్ షాప్ పెట్టుకుని బతుకుతానని పేర్కొంటున్నాడు.
డబ్బాకొట్టు పెట్టుకొని..
షేక్ రజియా సుల్తానా నిరుపేద కుటుంబంలో పుట్టిన దివ్యాంగురాలు. పుట్టిన ఏడాదికి పోలియో రావడంతో ఒకకాలు చచ్చుబడిపోయిది. ఆమెకు నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. ఇంట్లో ఆమె పెద్దది. డిగ్రీ వరకు చదువుకుంది. అర ఎకరం భూమి ఆమెకు ఉన్న ఆస్తి. 10 సంవత్సరాల క్రితం తండ్రి మరణించాడు. ఒక కాలు లేకపోవడంతో గ్రామంలో రోడ్డుపై డబ్బాకొట్టు పెట్టుకొని తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ జీవనం సాగిస్తున్నది. అన్నీ తానై తనతోపాటు ముగ్గురు చెల్లెళ్ల పెండ్లి చేసింది. ప్రభుత్వం తమకు డబుల్ బెడ్రూం ఇల్లు, వ్యాపార అవసరాల కోసం బ్యాంక్ లోన్ ఇస్తే తమ కాళ్లపై తాము బతుకుతామని అంటున్నారు.
తండ్రికి చేదోడువాదోడుగా..
శివయ్య, పిచ్చమ్మల ముగ్గురు కుమారుల్లో రవీంద్రాచారి మొదటివాడు. ఇతనికి పోలియో కారణంగా కాళ్లు పనిచేయకుండా పోయాయి. తండ్రి కులవృత్తితోపాటు అడపాదడప కూలి పనులకు పోయేవాడు. ఆస్తిపాస్తులు లేవు. రవీంద్రాచారి 2005లో ఓపెన్ టెన్త్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. దూరం వెళ్లి చదువుకునే స్తోమత లేక ఇంటి దగ్గర కిరాణం డబ్బా పెట్టి బతుకుతున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తన ఇద్దరు తమ్ములను డిగ్రీ చదువుకోవాలని ప్రోత్సహించాడు. నేడు రవీంద్రాచారి తన కోసం కాకుండా తనలాంటి వాళ్లకోసం ఉద్యమించేందుకు సిద్ధమయ్యాడు. మండల దివ్యాంగుల హక్కుల పోరాట సమితిలో మండల ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందించాలని కోరుతున్నాడు.
ఇద్దరూ దివ్యాంగులే..
అమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, లక్ష్మి దంపతులిద్దరూ దివ్యాంగులు. సుబ్బారెడ్డి పోలియో కారణంగా కాలు పనిచేయదు. భార్య లక్ష్మికి మాటలు రావు. ఆస్తులు లేకపోగా ప్రభుత్వం ఇస్తున్న పింఛనే ఆసరా అవుతున్నది. సుబ్బారెడ్డికి ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉన్నారు. సుబ్బారెడ్డి పెద్దక్క నాగేంద్రమ్మ అకాలంగా మృతి చెందడంతో ఆమె కుమార్తె లక్ష్మి మూగదైనప్పటికీ ఆమెను వివాహం చేసుకున్నాడు. భార్య, బిడ్డను పోషించుకునేందుకు సుబ్బారెడ్డి రూ.లక్ష అప్పుతో ఆటో కొనుగోలు చేసి ప్లాస్టిక్ సామగ్రిని గ్రామాలకు వెళ్లి విక్రయిస్తున్నాడు. తమకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటితోపాటు వ్యాపారానికి రుణ సహాయం చేయాలని వేడుకుంటున్నాడు.
భర్త లేకున్నా అన్నీ తానై
ఎదురు మంగమ్మ నిరుపేద. పుట్టుకతోనే ఒక కాలు చచ్చుబడిపోయింది. అమ్మిరెడ్డి నాగభూషణం, లక్ష్మమ్మల ఏడో సంతానం. ఎనిమిది సంవత్సరాల కిందట వివాహమైంది. ఇద్దరు ఆడపిల్లలు. భర్త ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడు. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో భర్త ఆమెను వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపోయాడు. అయినా తన ఆత్మవిశ్వాసం దెబ్బతినలేదు. తాను సమభావన సంఘంలో పొదుపు చేసుకున్న డబ్బులతో గతేడాది రూ.రెండు లక్షలతో హాలియాలో చిన్నదుకాణం ప్రారంభించింది. ఇద్దరు పిల్లలను సాదుకుంటూ జీవనం సాగిస్తున్నది. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నది