సోమవారం 08 మార్చి 2021
Nalgonda - Jan 24, 2021 , 00:58:28

అవకాశమిస్తే.. కాదా! ఆకాశమే హద్దు

అవకాశమిస్తే.. కాదా! ఆకాశమే హద్దు

  • విభిన్న అంశాల్లో సత్తా చాటుతున్న అమ్మాయిలు
  • రంగమేదైనా రాణిస్తున్న యువతులు
  • ఉమ్మడి జిల్లాలో పెరిగిన బాలికల నిష్పత్తి 
  • అక్షరాస్యతలోనూ ఏటికేడు స్పష్టమైన మార్పు
  • ఆసరాగా నిలుస్తున్న సంక్షేమ పథకాలు
  • నేడు జాతీయ బాలికా దినోత్సవం 

ఆడపిల్లను బతుకనిస్తే..

కన్నవారికి తిరిగి బతుకునిస్తుంది..కదల్లేని స్థితిలో ఉన్న నాన్న కోసంహైడ్రాలిక్‌ వీల్‌చైర్‌ను ఆవిష్కరించిబషీరా ఈ మాటలకు నిజ రూపమైంది. 

చిట్టిచేతులకు ఆసరా ఇస్తే... 

సమాజానికి అభయహస్తం అవ్వగలవనిముల్కలపల్లి విద్యార్థినులు చాటిచెప్పారు.మారుమూల తండాలకు చెందిన ఈ పిల్లలు ఆర్గానిక్‌ ప్యాడ్స్‌ తయారీతో మహిళాలోకానికి గొప్ప బహుమతిని అందించారు.

ఆశయాలకు రెక్కలు తొడిగితే..

ఆకాశమే హద్దుగా విజయ పతాక ఎగురవేయగలమంటూ అన్వితారెడ్డి నిలువెత్తు నిదర్శనమై నిలుస్తున్నది.

చదువుల తల్లులు

ఉమ్మడి జిల్లాలో పాఠశాలకు వెళ్తున్న బాలికల సంఖ్య ఏటా పెరుగుతున్నది. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు, సౌకర్యాలు అందుకు దోహద పడుతున్నాయి. 

లింగ వివక్షకు చరమగీతం పాడుతూ ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు.. బాలురకు దీటుగా నైపుణ్యం ప్రదర్శిస్తూ బాలికలు ‘భళా’ అనిపిస్తున్నారు. విద్య, ఉపాధి, క్రీడలు, ఉద్యోగాల సాధనలో మెరికల్లా నిలుస్తున్నారు. మారుమూల గ్రామానికి చెందిన ఓ బాలిక శిక్షణ లేకుండానే జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటింది. అనారోగ్యం కారణంగా తండ్రి పడుతున్న కష్టాలు తొలగించాలనే ఆలోచనతో మరో బాలిక హైడ్రాలిక్‌ వీల్‌ చైర్‌ను ఆవిష్కరించింది. పాఠశాల దశలోనే ఆర్గానిక్‌ శానిటరీ ప్యాడ్స్‌ రూపొందించి మహిళల రుతు సమస్యలకు పరిష్కారమార్గం చూపించారు మరో ముగ్గురు బాలికలు. నేడు బాలికా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..

- నల్లగొండ, నీలగిరి, రామగిరి, జనవరి 23 

సివిల్స్‌లో సత్తా..

చౌటుప్పల్‌ రూరల్‌, జనవరి 23 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామానికి చెందిన పెద్దిటి కృష్ణారెడ్డి - సుశీలాదేవి కుమార్తె ధాత్రిరెడ్డి సివిల్స్‌లో సత్తాచాటింది. గతేడాది ఆగస్టులో ప్రకటించిన ఫలితాల్లో 46వ ర్యాంకు సాధించి ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో టాపర్‌గా నిలిచింది. అంతకుముందు 2019సంవత్సరంలో 233వ ర్యాంకు సాధించి  హైదరాబాద్‌లో వల్లభాయ్‌పటేల్‌ కేంద్రంలో ఐపీఎస్‌ శిక్షణ కొనసాగిస్తూనే ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో మళ్లీ ప్రయత్నించింది. ప్రస్తుతం ముస్సోరిలో ఐఏఎస్‌ శిక్షణ తీసుకుంటుంది. 

తండ్రి కోసంహైడ్రాలిక్‌ వీల్‌చైర్‌

  • విద్యార్థిని బషీరాను అభినందించిన మంత్రి కేటీఆర్‌ 

రామగిరి, జనవరి 23 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని బషీరా.. రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రముఖుల మన్నన పొందింది. బషీరా తండ్రి అనారోగ్యం కారణంగా కదల్లేని స్థితిలో ఉన్నాడు. తండ్రి బాధను తీర్చాలనే సంకల్పంతో ఆమె ‘హైడ్రాలిక్‌ వీల్‌ చైర్‌' తయారు చేయాలని ఆలోచించింది. సైన్స్‌ టీచర్‌ పర్యవేక్షణలో మరో ఇద్దరు విద్యార్థినులు కలిసి చైర్‌ రూపొందించి జనవరి 4న హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శించారు. మంత్రి కేటీఆర్‌ ఆసక్తిగా తిలకించి వివరాలను బషీరాను అడిగి తెలుసుకున్నారు. తన తండ్రి సౌకర్యార్థం రూపొందించానని, తమకు సొంత ఇల్లు కూడా లేదని చెప్పడంతో డబుల్‌బెడ్రూం ఇల్లు మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించారు. బషీరా చెల్లి షమీరా, ఆమె తమ్ముడు నాగూర్‌భాషాకు కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. బషీరా తన ఆలోచనతో కుటుంబానికి బతుకునిచ్చిందని అభినందనలు వెల్లువెత్తాయి.

సమస్యను సవాల్‌గా తీసుకొని..   

  • ఎస్‌ఐ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచిన నాగలక్ష్మి 

బొడ్రాయిబజార్‌, జనవరి 23 : పేదరికం వెంటాడుతున్నా ఎదురైన ప్రతి సమస్యనూ సవాలుగా తీసుకుంది. నాయినమ్మతో కలిసి ఇండ్లల్లో పనికి వెళ్లిన ఆ బాలకార్మికురాలే నేడు పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కొలువులో రాణిస్తున్నది. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని గణేష్‌నగర్‌కు చెందిన నాగలక్ష్మి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకే తాతయ్య కూడా కన్నుమూయడంతో చదువుకు దూరమై నాయినమ్మతో కలిసి పనులకు వెళ్లింది. దాతల సాయంతో ఉన్నత చదువులు కొనసాగిస్తూనే హ్యాండ్‌ రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చిన్నారులకు అక్షరాలు నేర్పించింది. ఈ క్రమంలో ఎక్సైజ్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌ పోటీ పరీక్షల్లో ఎంపికైంది. తిరిగి ఓపెన్‌ కోటాలో ఎస్‌ఐ పోస్టు సాధించిన నాగలక్ష్మి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్నది. 

యువకెరటం..

  • కబడ్డీలో రాణిస్తున్న కృష్ణవేణి

మేళ్లచెర్వు, జనవరి 23 :  మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన పసుపులేటి లక్ష్మీనారాయణ, లక్ష్మి దంపతుల చిన్న కుమార్తె  కృష్ణవేణికి కబడ్డీ అంటే ఇష్టం. తొమ్మిదో తరగతి వరకు స్థానిక ఐడియల్‌ స్కూల్లో చదువుకున్నది. కబడ్డీలో నైపుణ్యాన్ని గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు, తండ్రి ప్రోత్సహించడంతో అనతి కాలంలోనే ‘సాయ్‌' అకాడమీకి ఎంపికైంది. తన ప్రదర్శనలతో ఖేలో ఇండియా ఎంపికలకు అర్హత సాధించి ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ధర్మశాలలో శిక్షణ పొందుతున్నది. శిక్షణ సమయంలో ప్రతి నెలా రూ.10వేల ఉపకార వేతనం అందుకుంటున్నది. 

‘ఆమె’ కోసంఆర్గానిక్‌ ప్యాడ్స్‌..

తుర్కపల్లి, జనవరి 23 : యాదాద్రి భువనగిరి జిల్లా ముల్కలపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థినులు ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో ప్రతిభ చూపారు. డి.అనిత, బి.శైలజ, డి.స్వాతి ఆర్గానిక్‌ శానిటరీ ప్యాడ్స్‌ రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. మారుమూల గిరిజన తండాలకు చెందిన ఈ నిరుపేద విద్యార్థినులు ఏండ్ల తరబడి తమ తల్లులు, అక్కలు ఋతుస్రావం సమయంలో పడుతున్న ఇబ్బందులను గమనించి ఆవేదనకు గురయ్యారు. ఆ సమస్యకు పరిష్కారం చూపాలన్న ఆలోచనతో ఉపాధ్యాయురాలు కళ్యాణి సహకారంతో ఆర్గానిక్‌ ప్యాడ్స్‌ రూపొందించారు. గుర్రపుడెక్క, వేప, మెంతులు, సబ్జాగింజలు, పసుపు ఉపయోగించి ప్యాడ్స్‌ తయారు చేశారు. ఈ నెల 4న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రదర్శనలో ఐటీ మంత్రి కేటీఆర్‌ గమనించి అభినందించారు. రూ.75వేల బహుమతిని అందజేశారు. 

లక్ష్యాన్ని చేరుకోవడానికి సాహసం చేశా...

భువనగిరి అర్బన్‌, జనవరి 23: భువనగిరి పట్టణానికి చెందిన పడమటి అన్వితారెడ్డి ఇటీవల ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ‘ప్రపంచంలోనే నాలుగో ఎత్తైన పర్వతమైన కిలిమంజారోను అధిరోహించాలని పర్వతారోహకులు కలగంటుంటారు. ఈ కారణంగానే నేను సాహసానికి పూనుకున్నాను. మా అమ్మ, నాన్నతో పాటు మా తాతగారి ప్రోత్సాహంతో విజయవంతంగా పూర్తిచేశాను. మా ఇంట్లో అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా చిన్నప్పటి నుంచి పెంచడంతో పర్వతారోహణపై పట్టుదల పెరిగింది. ప్రభుత్వ సహకారం ఉంటే మరిన్ని శిఖరాలు అధిరోహిస్తా.’ అని చెప్పారు.

బాలికలకు భరోసా

నీలగిరి, జనవరి 23 : బాలబాలికల నిష్పత్తిపై దృష్టి సారించిన తెలంగాణ సర్కారు ఆడబిడ్డల సంరక్షణకు పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. పాలకుల కృషికి తోడు అధికార యంత్రాంగం సైతం పలు చర్యలు తీసుకుని లింగ వివక్షకు అడ్డుకట్ట వేయగలిగారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఊయల, మన ఇంటి మహాలక్ష్మిలాంటి పథకాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో గత ఆరేండ్లుగా బాలికల సంఖ్య పెరుగుతున్నది. బాలికల నిష్పత్తి నల్లగొండ జిల్లాలో 953, సూర్యాపేట జిల్లాలో 925కు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ఏటా బాలికల సంఖ్య పెరుగుతున్నది. 2011సంవత్సరంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1000:923 ఉండగా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నల్లగొండ జిల్లాలో 800దిగువకు పడిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 12మండలాల్లో 800లోపు నమోదై ప్రమాద ఘంటికలు మోగించింది. నల్లగొండ జిల్లాలో 2017-18సంవత్సరం నుంచి 892నుంచి 953వరకు, సూర్యాపేట జిల్లాలో 775నుంచి 925కు పెరిగింది. 

ఫలితాలిస్తున్న సంక్షేమ పథకాలు..

తెలంగాణ ప్రభుత్వం బాలికల సంరక్షణకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకుని కల్యాణం వరకు అండగా నిలుస్తున్నది. అమ్మఒడి పథకం ద్వారా.. ఆడబిడ్డ పుడితే వెయ్యి రూపాయలను అదనంగా అందిస్తున్నది. గిరిజన తండాల్లో ఆడబిడ్డల అమ్మకాల నిరోధానికి ‘ఊయల’ ఏర్పాటు చేసింది. ఆడపిల్లను వద్దనుకునే తల్లిదండ్రులు ఊయలలో వదిలివెళ్లే అవకాశాన్ని కల్పించింది. మన ఇంటి మహాలక్ష్మి పథకం ద్వారా బాలికల సంరక్షణపై అవగాహన కల్పించింది. ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రకటించి రూ.10116 అందిస్తున్నది. మరోవైపు అధికార యంత్రాంగం లింగనిర్ధారణ పరీక్షలపై ఉక్కుపాదం మోపి పలువురిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసింది. చిట్యాలలో ఓ ముఠాను అరెస్టు చేసి నిర్భయ యాక్టు నమోదు చేసింది. 

సర్కారేఅమ్మానాన్నై..

నార్కట్‌పల్లికి చెందిన 7 నెలల గర్భిణి గతేడాది అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూసింది. డాక్టర్లు ఆపరేషన్‌ చేసి పాపను బయటకు తీశారు. 900 గ్రాముల బరువు మాత్రమే ఉండడం, భార్య కూడా దూరమవడంతో తండ్రి ఆ చిన్నారిని వద్దనుకున్నాడు. అప్పటి కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పసికందును హైదరాబాద్‌కు తరలించి ప్రభుత్వం తరఫున రూ.20లక్షలు ఖర్చు చేసి పునర్జన్మను ప్రసాదించారు. అనంతరం నల్లగొండ శిశుగృహ ఆలనాపాలనా చూసుకున్నది. గోవాకు చెందిన దంపతులు ఆ చిన్నారిని దత్తత తీసుకుని సాదుకుంటున్నారు...ఇలా అమ్మ అనే పిలుపునకు దూరమైన చిన్నారులను ప్రభుత్వమే చేరదీసి అనురాగాన్ని పంచుతున్నది. బాధ్యతగా పెంచుతున్నది. నల్లగొండ శిశుగృహలో ప్రస్తుతం పాతికమందికిపైగా అమ్మాయిలు సకల సౌకర్యాలతో ఆశ్రయం పొందుతున్నారు. 

- నల్లగొండ, నీలగిరి, రామగిరి, జనవరి 23 

నల్లగొండ, జనవరి 23 : పుట్టగానే తల్లిదండ్రులకు దూరమై కొందరు.. లింగ వివక్ష కారణంగా ఇంకొందరు.. ఇలా తన వద్దకు చేరిన అనాథ చిన్నారుల పాలిట అమ్మ ఒడిగా నిలుస్తున్నది నల్లగొండ జిల్లా కేంద్రంలోని శిశుగృహ. పసికందుల ఆలనా పాలనలో ఏమాత్రం రాజీలేకుండా సకల సౌకర్యాలతో శిశుగృహను నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఆ బాలల భవిష్యత్‌ దృష్ట్యా అర్హులైన దంపతులకు దత్తత అవకాశాన్ని కల్పిస్తున్నది. ఆడపిల్లల సంరక్షణ దిశగా చేపడుతున్న పథకాలు, ప్రజల్లో కల్పిస్తున్న అవగాహన ఫలితంగా ఐదేండ్లుగా శిశుగృహకు వచ్చే శిశువుల సంఖ్య తగ్గుతుండడం గమనార్హం. ప్రభుత్వం 2005 సంవత్సరంలో శిశుగృహను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 600మందిని చేరదీసి 400మంది చిన్నారులను సంతానం లేని దంపతులకు దత్తత ఇచ్చింది. వీరిలో 17మంది చిన్నారులను విదేశీయులు దత్తత తీసుకున్నారు. 

సకల సౌకర్యాలు..

శిశుగృహకు చేరిన పసికందుల పోషణకు సకల సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం.. ఒక్కో శిశువుకు నెలకు రూ.7వేల వరకు ఖర్చు చేస్తున్నది. ఆరేండ్ల పాటు ఇక్కడే ఉంటుండగా.. వయస్సుకు తగ్గట్టుగా ఆహారం అందిస్తున్నది. నెలల వయస్సున్న పసికందుకు ఒక ఆయా చొప్పున మూడు షిఫ్టుల్లో ముగ్గురు ఆయాలున్నారు. మొత్తం 30మంది ఆయాలు, ఇద్దరు మేనేజర్లు, ఏడుగురు ఏఎన్‌ఎంలు, సోషల్‌ వర్కర్లు, ఓ డాక్టర్‌ శిశుగృహలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం 17మంది పిల్లలు ఉండగా 50మంది వారి కోసమే పని చేస్తున్నారు. వేసవిలో ఏసీ, శీతాకాలంలో రూమ్‌ హీటర్స్‌, ఆడుకోవడానికి ప్లే కిట్స్‌తో పాటు ప్లే స్కూల్‌ లాంటి సదుపాయాలను సమకూర్చారు. 


VIDEOS

logo