కన్నీటి దారులు

- గోస తీసిన చింతబావి
- రోడ్డుప్రమాదంలో మృతిచెందిన
- 9 మందికి అంతిమ సంస్కారాలు
- ఊరంతా మిన్నంటిన రోదనలు
- ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ
- బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం
మండలి చైర్మన్ గుత్తా, మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధుల పరామర్శ ఎదిగిన బిడ్డకు తోడుగా ఉండాల్సిన తల్లిని మృత్యువు చిదిమేస్తే.. కూతురే కొడుకై పుట్టెడు దుఃఖంతో తలకొరివి పెట్టింది. బిడ్డల భవిష్యత్ కోసం కలలుగన్న తల్లిదండ్రులు మూసిన కండ్లు తెరవకపోవడంతో.. పదేండ్ల పిల్లలను తెలియని భయం ఆవహించింది. ప్రసవానికి పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల.. తండ్రి లేకున్నా అన్నీ తానై చూసుకుంటున్న తల్లి దూరమవడం తట్టుకోలేక ఏడ్చీఏడ్చీ సొమ్మసిల్లింది.తండ్రి బాధ్యత మరిచినా ముగ్గురి పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తల్లిని విగతజీవిగా చూసి.. మూడు పసిప్రాణాలు తల్లడిల్లాయి.
అంగడిపేట స్టేజీ ప్రమాదం రేపిన అలజడితో చింతబావి గుండె పగిలింది. అమ్మను కోల్పోయిన పిల్లలు, భార్యను పోగొట్టుకున్న భర్తలు, బిడ్డలు దూరమైన తల్లుల రోదన చూసి ఊరంతా కన్నీటి సంద్రమైంది. గురువారం రాత్రిని కాళరాత్రిలా గడిపిన జనం శుక్రవారం తెల్లవారుజామునే దేవరకొండ దవాఖానకు చేరుకున్నారు. విగతజీవులుగా పడి ఉన్న అయినవాళ్లు, ఆప్తులను చూసి బోరున ఏడ్చారు. పోస్టుమార్టం తర్వాత సాయంత్రానికి మృతదేహాలతో ఊరికి చేరుకున్నారు. వీధికో పాడె అన్నట్లుగా సాగిన అంతిమ యాత్రల్లో భారంగా అడుగులు వేస్తూ.. కన్నీటి ధారలు కురిపించారు. బాధిత కుటుంబాలను మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు లింగయ్య యాదవ్, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, మల్లయ్య యాదవ్ పరామర్శించి ఓదార్చారు.
అండగా ప్రభుత్వం
బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అనాథలుగా మారిన చిన్నారులకు గురుకుల విద్యాలయాల్లో ఉచిత విద్య అందిస్తాం. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారందరి వైద్య ఖర్చులను ప్రభుత్వమే
భరిస్తుంది.
- మంత్రి జగదీశ్‌రెడ్డి
- కన్నీరుమున్నీరైన మృతుల బంధువులు, గ్రామస్తులు
- కడచూపునకు పెద్ద ఎత్తున తరలివచ్చిన బంధువులు
అడిషనల్ కలెక్టర్ పరామర్శ
చందంపేట, జనవరి 22 : అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ శుక్రవారం దేవరకొండ ప్రభుత్వ దవాఖానను సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. సూపరింటెండెంట్ రాములు నాయక్‌తో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా ఆదేశించారు. మృతిచెందిన వారిలో ఐదుగురికి రైతుబీమా వర్తిస్తుందని తెలిపారు. మరో నలుగురికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పరంగా ఉచిత విద్య అందించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట దేవరకొండ ఆర్డీఓ గోపీరామ్, తాసీల్దార్ కిరణ్మయి, రెవెన్యూ అధికారులున్నారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది
- మంత్రి జగదీశ్‌రెడ్డి,
- శాసనమండలి చైర్మన్ గుత్తా
దేవరకొండ/దేవరకొండ రూరల్/కొండ మల్లేపల్లి, జనవరి 22: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తొమ్మిది మందికి దేవరకొండ ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా దవాఖాన ఆవరణలో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇండ్లు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యను అందించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన కూలీలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి చెప్పారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, పార్టీ నాయకులు కడారి అంజయ్య యాదవ్ బాధిత కుటుంబాలను పరామర్శించారు.
పరిమితికి మించి ప్రమాదం వైపు..
పెద్దవూర : మండలంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు ఆటోల్లో ప్రయాణిస్తుంటారు. ఇదే అదునుగా ఆటోవాలాలు సీట్ల సామర్థ్యానికి మించి తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో ఆటోలో 25నుంచి 30మంది వరకూ ఎక్కిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల సీజన్లలో పెద్ద సంఖ్యలో కూలీలను తరలిస్తుంటారు. రామన్నగూడెం నుంచి ముసలమ్మచెట్టు, చేపూరు, మొసంగి నుంచి వెల్మగూడెం, బట్టుగూడెం, హాలియా నుంచి పెద్దగూడెం, లింగపల్లి వివిధ తండాల నుంచి కూలీలను పరిమితికి మించి ఎక్కిస్తుంటారు. కాల్వకట్టలు, డొంకదారుల్లో మితిమీరిన వేగం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అవగాహన కొరవడింది. ఆటోల కారణంగా ఎప్పుడు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని స్థానికులు సైతం ఆందోళనకు గురవుతున్నారు.
నాడు పడమటితండా.. నేడు అంగడిపేట
పెద్దఅడిశర్లపల్లి : చిన్నపాటి నిర్లక్ష్యం పెను ప్రమాదానికి కారణమవుతున్నది. రోడ్డు భద్రతపై డ్రైవర్లకు కొరవడిన అవగాహన, మితిమీరిన వేగం కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. 2017ఏప్రిల్ 4న పడమటి తండా సమీపంలో ట్రాక్టర్ కాల్వలో పడి తొమ్మిది మంది, తిరిగి గురువారం అంగడిపేట స్టేజీ వద్ద జరిగిన మరో ప్రమాదంలోనూ తొమ్మిది మంది కూలీలు మృతిచెందారు. ప్రస్తుతం ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలో యాసంగిలోనూ వరి సాగుచేస్తున్నారు. దీంతో నాట్ల పనులకు దేవరకొండ, చందంపేట మండలాల నుంచి 400మంది 20ఆటోల్లో నిత్యం తరలివస్తున్నారు.జాతీయ రహదారి విస్తరణ పనులు సైతం పూర్తి కావడంతో వాహనాల వేగం పెరిగి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
అనాథలైన చిన్నారులు...
ఆటో నడుపుతూ జీవనం సాగించే కొట్టం మల్లేశ్.. కూలి పనులకు వెళ్తూ భార్య చంద్రకళ, తల్లి లింగమ్మను సైతం వెంట తీసుకెళ్లాడు. ప్రమాదంలో ముగ్గురూ మృతిచెందగా.. మల్లేశ్ కుమారులు అరవింద్, హరీశ్ అనాథలుగా మారారు. ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల చితికి నిప్పంటించగా.. లింగమ్మ చిన్న కొడుకు ఆంజనేయులు తల్లికి తలకొరివి పెట్టాడు. మల్లేశ్ తండ్రి లింగయ్య, ఇద్దరు కుమారులు వెక్కివెక్కి ఏడవడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
‘ఇయ్యాల్నే ఆఖరు బిడ్డా..’ అన్నది
నోముల పెద్దమ్మ.. ఇంటి పెద్ద లేకున్నా కూలి పనులు చేస్తూ కూతురు సరితకు పెండ్లి చేసింది. గర్భిణిగా ఉన్న సరిత ఈ మధ్యనే తల్లి దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నది. ప్రసవ ఖర్చులకు డబ్బులు అవసరం అవుతాయని పెద్దమ్మ కూలి పనులకు వెళ్తున్నది. ‘అమ్మా.. ఇయ్యాల్నే ఆఖరు బిడ్డా.. రేపట్నుంచి నీ దగ్గర్నే ఉంటలే అనుకుంట పొద్దున్నే పనికి పోయినవు.. లే అమ్మా లే.. అంటూ సరిత రోదించడం గుండెలను పిండేసింది. పెద్దమ్మకు ఆమె మామ ఆంజనేయులు అంతిమ సంస్కారాలు జరిపించాడు.
అన్నీ తానై.. అంతలోనే దూరమై...
నోముల అలివేలు.. ఇంటి యజమాని మానసిక పరిస్థితి బాగలేకపోవడంతో అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తున్నది. ఇద్దరు కూతుళ్లకు పెండ్లి చేయగా.. మరో కూతురు సరితకు సైతం వివాహం చేసే క్రమంలో కూలి పనులకు వెళ్తూ ప్రమాదానికి గురైంది. దీంతో సరిత తల్లికి తలకొరివి పెట్టింది.
అమ్మా.. లే అమ్మా..
నోముల సైదమ్మ.. తొలి సంతానంలో కొడుకు, మలి సంతానంలో ఇద్దరు కూతుళ్లు(కవలలు). పిల్లల్ని బాగా చదివించాలని కలలు గన్నది. ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదంటూ కష్టపడుతున్నది. భర్త పట్టించుకోకపోవడంతో కుటుంబ భారాన్ని మోస్తున్న క్రమంలో కన్నుమూసింది. ముగ్గురు పిల్లలదీ చిన్నవయస్సే.. ఆడపిల్లల భారం ఎవరు మోస్తారు.. అంటూ బంధుమిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. అమ్మా లే అమ్మా లే.. అంటూ సైదమ్మ మృతదేహం పక్కన కూర్చుని కూతుళ్లు రోదించడం ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పించింది.