శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 21, 2021 , 01:26:33

చలి..ఎండ

చలి..ఎండ

  • ఈసారి రెండూ ఎక్కువే
  • ఉష్ణోగ్రతల్లో భిన్నమైన మార్పులు
  • పడిపోతున్న కనిష్ఠ.. పెరుగుతున్న గరిష్ఠం
  • గాలిలో తేమ శాతం క్షీణతే కారణం
  • లాక్‌డౌన్‌ నుంచి పెరిగిన ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం ఉష్ణోగ్రతల్లో భిన్న పరిస్థితులు

నల్లగొండ, జనవరి 20 :సాధారణంగా శివరాత్రి వరకు చలి ప్రభావం ఉంటుంది. ఈ సారి కూడా చలి ప్రభావం ఉన్నది కానీ అది రాత్రి సమయంలోనే. పగలు మాత్రం వేడితో శరీరం సురసురమంటున్నది. కారణం పగలు గరిష్ఠ ఉష్ణోగ్రత, రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత పెరగడమే. కాలాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లో హెచ్చు, తగ్గుదల కనిపిస్తున్నది. కానీ ఈ సారి గతానికి భిన్నంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగం పెరగడం, పగటి పూట ఎక్కువ వాడడంతో గాలిలో తేమ శాతం తగ్గి పగలు ఎండ, ఉక్కపోత నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఈ ఏడాదంతా అందరూ ఇట్టి పట్టునే ఉండటం, ఇంట్లో ఎలక్ట్రిక్‌ వస్తువుల వినియోగం బాగా పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. 

అక్టోబర్‌ నుంచి జనవరి వరకు శీతాకాలం అయినప్పటికీ తొలి రెండు నెలల్లో చలి ప్రభావం పెద్దగా ఉండదు. డిసెంబర్‌ నెలలో చలి మొదలై జనవరి చివరి నాటికి ఈ తీవ్రత కొనసాగుతుంది. ఈ సారి డిసెంబర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 13 డిగ్రీల వరకు తగ్గినప్పటికీ ఆ తర్వాత క్రమంగా పెరిగి 15, 16 డిగ్రీల వద్ద కొనసాగింది. ఇక తెల్లవారుజామున 13 నుంచి 14 డిగ్రీలు మాత్రమే నమోదవుతుండటంతో చలి ప్రభావం కనిపిస్తున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రత ఉదయం 31, 32 డిగ్రీలు నమోదవుతుండగా మధ్యాహ్నానికి 33, 34 డిగ్రీలకుపైగా పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏ కాలంలోనైనా కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల, తగ్గుదల ఉంటుంది.. కానీ తాజా పరిస్థితుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో రాత్రి పూట క్షీణ దశ.. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో హెచ్చుదశ కనిపిస్తున్నది. రాత్రి పూట చలికి వణికిన శరీరం పగలు అంతకుమించిన ఎండకు తట్టుకోలేకపోవడం వల్లే ఒళ్లంతా గరంగా మారుతున్నది.

తేమ శాతంలో మార్పుల వల్లే..

గతేడాది జనవరి 14న గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 14.4 డిగ్రీలు నమోదు కాగా.. ఈ ఏడాది 14న గరిష్ఠ 32, కనిష్ఠ 18 డిగ్రీలు నమోదైంది. అదేరోజు వాతావరణంలో తేమ శాతం రాత్రి పూట 85 ఉంటే పగటి పూట 75 ఉంది. ఇక ఈ ఏడాది రాత్రి పూట 80శాతం ఉండగా పగటి పూట 45 ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి గరిష్ఠ ఉష్ణోగ్రతలో 0.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలో 3.6 డిగ్రీలు పెరిగినప్పటికీ తేమ శాతంలో మాత్రం రాత్రి పూట ఐదు శాతం, పగలు 30శాతం తగ్గడం గమనార్హం. ఎలక్ట్రానిక్‌ వస్తువులు ప్రధానంగా పగటి పూట వాడకంతోనే ఈ ప్రభావం కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక గతేడాది జనవరి 20న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 13.6 డిగ్రీలు నమోదు కాగా.. ఈ ఏడాది 20న గరిష్ఠ ఉష్ణోగ్రత 32, కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీలు నమోదైనప్పటికీ స్వల్ప తేడా మాత్రమే ఉంది. ప్రధానంగా ఈ జనవరి మొదటి వారం నుంచి ఈ తరహా భిన్నత్వం మొదలైనట్లు తెలుస్తుంది. 

ఎలక్ట్రానిక్‌ వస్తువులు.. అధిక విద్యుత్‌ వినియోగంతో..

సాధారణంగా ఎండ ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ గాలిలో తేమ శాతం ఉన్నట్లయితే అది శరీరానికి తెలియనివ్వదు. ఎప్పుడైతే గాలిలో తేమ ఆవిరైపోతుందో అప్పుడే ఎండ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగం పెరిగితే కూడా గాలిలోని తేమను హరించే అవకాశం ఉంటుంది. ఏసీలతోపాటు ఫ్రిజ్‌, కూలర్‌ ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు వినియోగించినప్పుడు తేమ ఆవిరై వేడి వాతావరణం ఏర్పడుతుంది. 

మచ్చుకు ఓ ఉదాహరణ..

సాధారణంగా ఓ కూలర్‌ను ఇంట్లో పెట్టుకొని ఆన్‌ చేస్తే అది ఇచ్చే చల్లని గాలి కంటే దాని ద్వారా వచ్చే వేడి గాలే ఎక్కువగా ఉంటుంది.  బెడ్‌ రూమ్‌లో ఫ్రిజ్‌ పెట్టుకొని చలికాలంలో పడుకున్నప్పటికీ దాని నుంచి వచ్చే వేడి తీవ్రత ఏ మేరకు ఉంటుందో అందరికీ తెలుసు. దీనికి కారణాలు అక్కడ గాలిలో ఉండే తేమను ఆ ఎలక్ట్రిక్‌ వస్తువులు హరించి వేయడం మూలంగానే చల్లదనం బదులు వేడి ప్రభావం కనిపిస్తుంది.


VIDEOS

logo