గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 19, 2021 , 00:43:55

రెవెన్యూ స్పీడ్

రెవెన్యూ స్పీడ్

  • భూ సమస్యల పరిష్కారానికి నిర్ధిష్ట కార్యాచరణ
  • కలెక్టర్ల నేతృత్వంలోని ట్రిబ్యునల్‌ పని షురూ
  • తొలిరోజు నల్లగొండలో 47, సూర్యాపేటలో 15 కేసుల విచారణ
  • పెండింగ్‌ మ్యుటేషన్ల క్లియరెన్స్‌ ప్రారంభం
  • నేటి నుంచి కంపెనీలు, సొసైటీలకు పాస్‌పుస్తకాలు
  •  ముమ్మరంగా సాదాబైనామాల పరిశీలన
  • మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా ‘ధరణి’

పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చకచకా అడుగులు పడుతున్నాయి. ఇటీవల కలెక్టర్ల మీటింగ్‌లో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన కార్యాచరణకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ సేవలు విస్తృతమయ్యాయి. కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటైన స్పెషల్‌ ట్రిబ్యునల్స్‌ సోమవారం కేసుల విచారణను ప్రారంభించాయి. మరోవైపు పెండింగ్‌ మ్యుటేషన్ల క్లియరెన్స్‌ ప్రక్రియ మొదలైంది. సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలన వేగంగా సాగుతున్నది. కంపెనీలు, సొసైటీ భూములకు నిలిచిపోయిన పాసుపుస్తకాలను జారీ చేసేందుకు మంగళవారం నుంచి ధరణిలో ఆప్షన్‌ అందుబాటులోకి రానున్నది. పోర్టల్‌ను మరింత సులభతరంగా మార్చే చర్యలు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. 

నల్లగొండ ప్రతినిధి, జనవరి18(నమస్తే తెలంగాణ) :  వ్యవసాయ భూముల క్రయ విక్రయాల్లో, భూహక్కుల రక్షణలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్‌ సేవలు ఇప్పటికే జిల్లాలో కొనసాగుతున్నాయి. కేవలం అరగంట లోపే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఈ-పాసుపుస్తకాల జారీ, రికార్డుల అప్‌డేట్‌ కూడా పూర్తవుతున్నాయి. ఇది రెవెన్యూ చరిత్రలోనే విప్లవాత్మక మార్పుగా నిలుస్తుంది. ఇక ఇదే ధరణి పోర్టల్‌ ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ధిష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. అందుకు అనుగుణంగా జిల్లా అధికారయంత్రాంగం కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. ఏకకాలంలో అనేక సేవలను ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. పలురకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 

పెండింగ్‌ మ్యుటేషన్ల క్రియరెన్స్‌

జిల్లాలో ధరణిపోర్టల్‌ అందుబాటులోకి వచ్చేనాటికి రిజిస్ట్రేషన్లు పూర్తై పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లపైనా దృష్టి సారించారు. ధరణిపోర్టల్‌ ద్వారా మ్యుటేషన్ల దరఖాస్తు ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది. నల్లగొండ జిల్లాలో సుమారు 900వరకు ఇలా పెండింగ్‌ మ్యుటేషన్లు ఉండవచ్చని అధికార యంత్రాంగం భావిస్తుంది. మ్యుటేషన్ల కోసం పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను ముందుగా సంబంధిత అధికారులు స్క్రూటినీ చేస్తూ సరైన వాటినే అనుమతిస్తున్నారు. తర్వాత కొనుగోలుదారులు స్లాట్‌బుక్‌ చేసుకుని మ్యుటేషన్లకు దరకాస్తు చేసుకుంటున్నారు. వీటిని కూడా అతిత్వరలోనే పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టారు. 

మొదలైన స్పెషల్‌ ట్రిబ్యునల్‌..

 గతంలో ఆర్డీఓ, జాయింట్‌ కలెక్టర్ల నేతృత్వంలో రెవెన్యూ కోర్టులు కొనసాగేవి. వీటిని ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టంలో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిల్లోని కేసులన్నింటినీ విచారించేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో స్పెషల్‌ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకారంగానే సోమవారం నుంచి నల్లగొండలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌లతో కూడిన ట్రిబ్యునల్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నల్లగొండ జిల్లాలో గత రెవెన్యూ కోర్టుల్లో వివిధ దశల్లో విచారణలో ఉన్న 1500 కేసులను ట్రిబ్యునల్‌ విచారించనుంది. తొలిరోజు సోమవారం 47 కేసుల విచారణను ట్రిబ్యునల్‌ చేపట్టింది. ఇందులో కొన్ని కేసుల విచారణను పూర్తి చేసింది. మరికొన్ని కేసుల్లో అడ్వకేట్ల విజ్ఞప్తి మేరకు వాయిదా వేశారు. అయితే ట్రిబ్యునల్‌ను ప్రతిరోజూ కొనసాగించాలని నిర్ణయించారు. నేడు మరో 50కేసుల విచారణకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ పనిదినాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30గంటల నుంచి ట్రిబ్యునల్‌ కేసుల విచారణ చేపడుతుందని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ ప్రకటించారు. శనివారం మాత్రం ఉదయం 10.30 నుంచి సాయంత్రం వరకు కేసుల విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు. జిల్లాలోని 1500 కేసులను రెండు నెలల్లో విచారించి పరిష్కారం చూపాలన్న లక్ష్యంలో ట్రిబ్యునల్‌ ఉన్నట్లు తెలిపారు. ట్రిబ్యునల్‌ కేసుల విచారణ సమయంలో సంబంధిత ఆర్డీఓ, తాసీల్దార్‌ను కూడా హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీంతో కొన్ని కేసుల్లో అక్కడికక్కడే పరిష్కారం లభించనుంది. 

సూర్యాపేట లో 15 కేసుల విచారణ 

సూర్యాపేట, జనవరి 18 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాలోనూ ట్రిబ్యునల్‌ వర్క్‌ మొదలైంది. కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి చైర్మన్‌గా వ్యవహరించగా లోకల్‌ బాడీస్‌ అదనపు కలెక్టర్‌ పద్మజారాణి సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 473 కేసులు ఉండగా రోజుకు పది నుంచి పదిహేను కేసులను విచారించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు నాలుగు రోజుల క్రితమే పదిహేను కేసులపై ఇరువర్గాలతోపాటు వారి న్యాయవాదులకు నోటీసులు పంపించగా సోమవారం విచారణ చేపట్టారు. వీరిలో ఒకరు విత్‌ డ్రా పిటిషన్‌ చేసుకోగా మిగిలిన కేసులను వారం రోజుల్లో పరిష్కరించేలా సూచనలు చేశారు. జిల్లాలోని రెవెన్యూ కోర్టుల్లో మొత్తం 473 కేసులు పెండింగులో ఉండగా వీటిలో జేసీ కోర్టులో 243, సూర్యాపేట ఆర్డీఓ వద్ద 122, కోదాడ ఆర్డీఓ వద్ద 48, హుజూర్‌నగర్‌ ఆర్డీఓ కోర్టులో 60 కేసులు ఉన్నాయి. అలాగే 473 కేసుల్లో 321 కేసులు హియరింగ్‌ స్టేజీలో ఉండగా 152 కేసులు రిలీజ్‌ ఫర్‌ ఆర్డర్‌ దశలో ఉన్నాయి. 

సాదాబైనామాల పరిశీలన..

 రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా ఉన్న నల్లగొండలో సాదాబైనామా ద్వారా రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు పెద్దసంఖ్యలోనే వచ్చాయి. సుమారు 28వేల దరఖాస్తులు ప్రజల నుంచి మీసేవ కేంద్రాల ద్వారా రాగా వాటిన్నింటినీ పరిశీలించే పని ముమ్మరంగా కొనసాగుతున్నది. వీటన్నింటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఒక్కో సాదాబైనామాను పరిశీలిస్తూ నిర్ణీత ఫార్మాట్‌లో ఉన్న వాటికి క్లియరెన్స్‌ ఇస్తున్నారు. జిల్లాలో వచ్చిన అన్ని సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలంటే కనీసం మూడు నెలల సమయం పట్టవచ్చని అంచనా. సూర్యాపేట జిల్లాలోనూ ఇదేరకమైన ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. 

నేటి నుంచి సొసైటీలు.. కంపెనీలకు పాసుపుస్తకాలు

కంపెనీలు, సొసైటీల పేరుతో కొనుగోలు చేసిన భూములకు ఇప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకాల జారీకి అనుమతి లేదు. ప్రభుత్వం తాజాగా వాటికి పాసుపుస్తకాలను అందజేయాలని ఉత్వర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కంపెనీ, సొసైటీ ప్రతినిధులకు ధరణి పోర్టల్‌ ద్వారా ఆప్షన్‌ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా వెంటనే క్లియర్‌ చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మరిన్ని సేవలను అందుబాటులోకి తెస్తూ ధరణిని మరింత ఫ్రెండ్లీ యూజర్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. 

VIDEOS

logo