మంద మెరిసె.. మది మురిసె

- పండుగ వాతావరణంలో సబ్సిడీ గొర్రెల పంపిణీ
- మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి మంత్రులు తలసాని, జగదీశ్‌రెడ్డి హాజరు
- 254 మంది లబ్ధిదారులకు యూనిట్ల అందజేత
- సంతోషంగాగొర్రెలతో ఇంటి బాటపట్టిన గొల్లకురుమలు
- డీడీలు చెల్లించిన వారందరికీ త్వరలోనే లబ్ధి
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ్దను పరిపుష్టి
- పేదల కోసం
- అనేక పథకాలు
- మండలి చైర్మన్ గుత్తా
దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలోనే అనేక పథకాలు అమలవుతున్నట్లు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రైతాంగం సంక్షేమమే లక్ష్యంగా సర్కార్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నదన్నారు. వాస్తవంగా ఈ గొర్రెల పంపిణీ ఎప్పుడో జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ వల్లనే ఆలస్యం జరిగిందని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం డిండి, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు సొరంగ మార్గాల పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు.
చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వృత్తిదారులకు చేయూతనిస్తున్నది. యాదవులు పెద్దసంఖ్యలో ఉన్న నల్లగొండ జిల్లా నుంచి గొర్రెల పంపిణీ పునఃప్రారంభించడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఏంకావాలో సీఎం కేసీఆర్‌కు తెలుసు. డీడీలు చెల్లించిన వారందరికీ గొర్రెల యూనిట్లు అందిస్తాం.
- తలసాని శ్రీనివాస్‌యాదవ్,
పశు సంవర్ధక శాఖ మంత్రి
సమైక్య పాలనలో ధ్వంసమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. గొర్రెల పంపిణీ, చేప పిల్లల పెంపకం వంటి కార్యక్రమాలతో వృత్తిదారుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అన్ని వర్గాల గురించి ఆలోచన చేసే కేసీఆర్ ప్రభుత్వాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా అందరూ
బలపర్చాలి.
- గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
వృత్తిదారులకు పూర్వ వైభవం
కల్పించేందుకు సీఎం కేసీఆర్ అనేక ఆలోచనలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం తరఫున గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఒక్కొక్కటి పూర్తి కావస్తున్నాయి.
- గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి చైర్మన్
ఆసరా కోసం వెతుకుతున్న బతుకులకు జీవనాధారమై ఎదురొచ్చిన జీవాలను చూసి గొల్లకురుమల మనస్సు ఉప్పొంగింది. 75 శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను తాకిన వేళ సంతోషం వెల్లివిరిసింది. వరుస ఎన్నికలు, కరోనాతో నిలిచిపోయిన గొర్రెల పంపిణీ నల్లగొండ బత్తాయి మార్కెట్లో శనివారం పండుగ వాతావరణం నడుమ ప్రారంభమైంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ హాజరై 254మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున అందజేశారు. డీడీలు చెల్లించిన అందరికీ లబ్ధి చేకూరుతుందని మంత్రి తలసాని స్పష్టంచేశారు.
నల్లగొండ, జనవరి 16 : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం వృత్తిదారులకు చేయూతనిస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సాగర్ రోడ్డులోని బత్తాయి మార్కెట్ యార్డులో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తొలి విడుతలో డీడీలు చెల్లించిన 28వేల మందికి వరుస ఎన్నికలతోపాటు కరోనా కారణంగా ఆలస్యం జరిగిందని, అందుకే సీఎం కేసీఆర్ వెంటనే వారందరికీ గొర్రెలు అందజేయాలని ఆదేశించడంతో ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభించామన్నారు. పెండింగ్‌లో ఉన్న యూనిట్లు అన్నింటినీ పంపిణీ చేసి వచ్చే బడ్జెట్ తర్వాత మరో రూ.ఐదారు వేల కోట్లతో రెండో విడుత గొర్రెలు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో యాదవుల సంఖ్య ఎక్కువగా ఉందని, అందులో నల్లగొండలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు చెప్పారు. యాదవ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే 18 ఏండ్లు నిండిన ప్రతి యాదవుడికీ ఈ గొర్రెలు అందజేస్తున్నామని, ప్రతి యూనిట్ కింద ఇరవై గొర్రెలతోపాటు ఒక పొట్టేలు ఇస్తున్నందున యాదవులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనుషులకు జబ్బులు వస్తేనే పట్టించుకోని ఈ రోజుల్లో పశువులు, జీవాలకు ఏ రోగమొచ్చినా చికిత్స చేసేందుకు 1962 అనే వాహనాన్ని ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, రమావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిశోర్‌కుమార్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, రైతు బంధుసమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్ నాయక్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు నోముల భగత్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస రావు, చరిత, నర్సయ్య పాల్గొన్నారు.
ఎగుమతి చేసే స్థాయికి చేరాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి
పాడి రంగం వ్యవసాయానికి అనుబంధమేనని, దీన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీని చేపట్టినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లాలో ఇప్పటికే 26వేల గొర్రెలు పంపిణీ చేశామని, పెండింగ్‌లో ఉన్న వాటిని కూడా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులను ప్రోత్సహించడానికే విజయ, మదర్ డెయిరీ రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం సహకారంతో నేడు గొర్రెల సంతతి పెరిగిందని, రానున్న కాలంలో మాంసం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యాదవ జాతికి మేలు చేసింది కేసీఆరే : ఎంపీ బడుగుల
గత పాలకులు యాదవుల పేరు చెప్పి పబ్బం గడుపుకున్నారని, కానీ కేసీఆర్ ఒక్కరే యాదవ జాతికి మేలు చేశారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నాగార్జునసాగర్‌తోపాటు కోదాడ నియోజకవర్గాల్లో యాదవ బిడ్డలను ఎమ్మెల్యేలుగా గెలిపించి, తనని రాజ్యసభకు పంపి ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. రాజధానిలో యాదవుల అత్మగౌరవ భవన నిర్మాణానికి కేసీఆర్ రూ.200 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.
ఆర్థికంగా ఎదుగాలి : ఎమ్మెల్యే కంచర్ల
గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. గొర్రెలను పోషించి, మాంసం ఉత్పత్తులను గణనీయంగా పెంచాలని సూచించారు. ప్రతి సామాజిక వర్గం ఆర్థికంగా బాగుపడాలనే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు.
254 మందికి 5,334 సబ్సిడీ గొర్రెలు అందజేత
నల్లగొండ, జనవరి 16 : నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం ప్రభుత్వం అందించిన సబ్సిడీ గొర్రెల పంపిణీ అట్టహాసంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 254 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున మొత్తం 5,334 గొర్రెలను అందించారు. 2103 యూనిట్లు డీడీలు కట్టిన వారికి ఇవ్వాల్సి ఉండగా తొలివిడుతగా 254 మందికి అందజేశారు. త్వరలో మిగతా వారికి పంపిణీ చేయనున్నారు. గొర్రెల యూనిట్లు అందుకున్న లబ్ధిదారులు సంతోషంగా ఇంటిబాట పట్టారు.
ఇంక ఢోకా లేదు
ఇంటికాడ మాకు పదిహేను గొర్లున్నయ్. ఆటిని మేపడానికి పోక దప్పుతలేదు. రోజూ ఆటెంటనే పోతెనేమో ఇంట్ల ఎల్లట్లేదు. ఇన్నాళ్లు గదే బాధ ఉండే.. ఇంగొస్తయేమో..ఇంగొస్తయేమో అని గొర్ల కోసం ఎదురు జూస్తున్న. నా గొర్లకు తోడు గిప్పుడొచ్చిన గీ 21 గొర్లు మాకు జాలు. ఈటితో ఇల్లయితే గడుస్తది.
-గంగుల రాములు, వల్లభాపురం, నిడమనూరు మండలం
ఇన్నాళ్లు డబ్బులు లేక కొనలేక పోయిన
నేను ఎవుసం చేస్తా. మా నాయన ఇంటి దగ్గర ఉండలేక కూలీ పనికి పోతడు. ఇద్దరం ఎవుసం చేద్దామంటే సరిపోను భూమిలేదు. చాలా సార్లు గొర్లు కొని నాయనకు పని చూపిద్దామని అనుకున్నా డబ్బులు లేక ఆగిపోయిన. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఈ గొర్లతో మా నాయనకు పని దొరికినట్టే.
-మేకల వెంకన్న, హాలియా
కుటుంబాన్ని సాదుకుంటా..
చానా రోజులు నేను గొర్లే కాసిన. అవి ఉన్నప్పుడు ఎప్పుడూ పైసలు కావాలన్నా ఒక దాన్ని అమ్ముకుంటే సరిపోయేది. ఇంకెంతకని కాయనని ఉన్న గొర్లు అమ్ముకున్నా. అయి లేనప్పుడు తెలిసింది బాధేందో. ఇంగ ఎన్ని ఇబ్బందులొచ్చినా బువ్వ పెట్టేది అయ్యే కాబట్టి ఇంగ అమ్మను. నేనే కాసుకుంట..కుటుంబాన్ని సాదుకుంటా..
-ములిగర్ల లింగమ్మ, పీఏపల్లి
నా కొడుక్కు కూడా వస్తాయంట
మా ఇంట్ల నా కొడుకుకు, నాకు కూడా ఇస్తామంటే ఇద్దరి పేరుమీద పైసలు కట్టినం. ఇయ్యాల నా పేరు మీదనైతే ఇరవై గొర్రెలు, ఒక పొట్టేలు వచ్చినయి. నా కొడుకు పేరు మీద కూడా నాలుగైదు రోజుల తర్వాత వస్తాయంట. ఇద్దరిపేరు మీదనైతే 42 గొర్రెలు అయితయి. అయి నేను కాయటానికి సరిపోతయి. ఈ గొర్లు ఇచ్చిన కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
-ఎనుగుల సైదమ్మ, అనుముల
తాజావార్తలు
- Mi 10T 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గింపు
- వీడియో : అభినవ పోతన ఈ రైతన్న...
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం