సోమవారం 08 మార్చి 2021
Nalgonda - Jan 17, 2021 , 02:54:41

డే1సక్సెస్‌

డే1సక్సెస్‌

  • సజావుగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌
  • ఉమ్మడి జిల్లాలో 253మందికి కోవిషీల్డ్‌
  • ఎక్కడా, ఎవరికీ సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవు
  • తొలి టీకా వేసుకున్న వారిలో ఆనందం 
  • ప్రారంభించిన మండలి చైర్మన్‌ గుత్తా, 
  • మంత్రి జగదీశ్‌రెడ్డి  

కరోనాపై మొదలైన పోరులో కొవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ తొలిరోజు విజయవంతంగా ముగిసింది. ఎలాంటి అవాంతరాలూ లేకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సజావుగా సాగింది. మొత్తంగా 253మందికి టీకా ఇవ్వగా, ఎవరిలోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనపడలేదు. తొలి టీకా వేసుకునే అవకాశం దక్కడం జీవితంలో మర్చిపోలేమని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. నల్లగొండలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం నుంచి టీకాల పంపిణీ కొనసాగనున్నది. 

నల్లగొండ ప్రతినిధి, జనవరి16(నమస్తే తెలంగాణ) :  కొవిడ్‌ 19 టీకా కార్యక్రమం తొలిరోజు జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. నల్లగొండ జిల్లాలో జిల్లా కేంద్ర దవాఖాన, పానగల్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, మిర్యాలగూడ ఏరియా వైద్యశాలలో టీకా కార్యక్రమం చేపట్టారు. నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో ప్రధానమంత్రి మోదీ ప్రసంగం అనంతరం టీకా కార్యక్రమాన్ని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రారంభించగా జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలి టీకాను మద్దుల ముక్కోటి అనే ఓటీ ఆపరేటర్‌కు వేశారు. తర్వాత శ్రీనివాస్‌ అనే అంబులెన్స్‌ డ్రైవర్‌కు ఇచ్చారు. మొత్తం 30మందికి వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశారు. పానగల్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లోనూ 30 మందికి  వ్యాక్సిన్‌ వేశారు. మిర్యాలగూడ ఏరియా దవాఖానలో వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రారంభించారు. ఇక్కడ 30 మందిలో ఏడుగురు వివిధ కారణాలతో హాజరుకాలేదు. మొత్తంగా జిల్లాలో తొలి రోజు 83 మందికి టీకా ఇచ్చినట్లుగా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొండల్‌రావు ప్రకటించారు. ఎవరికీ ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించలేదని, తొలి అడుగు సక్సెస్‌ కావడం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పారు. 

సూర్యాపేటలో..

సూర్యాపేట జిల్లాలో మూడు కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కొనసాగింది.  జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రధాని ప్రసంగం అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి..రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దీపికాయుగేంధర్‌రావు, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డిలతో కలిసి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఇక్కడ 30 మందిలో తొలి టీకా డాక్టర్‌ విద్యాసాగర్‌కు ఇచ్చారు. సూర్యాపేటలోని రాజీవ్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 30మందిలో 20 మంది మాత్రమే టీకాకు హాజరయ్యారు. ముగ్గురు అనారోగ్యం, మరో ఏడుగురు సెలవుల్లో ఉండడంతో వీరికి తర్వాత టీకా వేయనున్నారు. హుజూర్‌నగర్‌లో వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఇక్కడ 30 మందికి టీకా వేశారు. తొలిరోజు టీకా కార్యక్రమం సజావుగా సాగిందని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రకటించారు.  ఇదే స్ఫూర్తితో టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతామని విశ్వాసం వ్యక్తం చేశారు. 

మూడు దశల్లో.. వ్యాక్సినేషన్‌..

వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మూడు దశలుగా విభజించారు. వ్యాక్సిన్‌కు ఎంపిక చేసిన వారి వివరాలు సర్వర్‌ ద్వారా జనరేట్‌ అవుతాయి. ఆ వివరాల ప్రకారం సదరు వ్యక్తులకు సమాచారం ఇస్తారు. వారు తమకు ఇచ్చిన సమయం ప్రకారం వ్యాక్సినేషన్‌ కేంద్రానికి చేరుకుంటారు. తొలిరోజు కూడా ఇలాగే కొనసాగింది. వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వచ్చిన వారిని ముందుగా వెయిటింగ్‌ రూమ్‌లో కూర్చోబెట్టారు. వారి ఆరోగ్య సమాచారం సేకరించాక వ్యాక్సినేషన్‌ రూంలోకి అనుమతించారు. అక్కడ మరోసారి ఆధార్‌కార్డు ఆధారంగా వివరాలు చెక్‌ చేసి వ్యాక్సిన్‌ వేశారు. అనంతరం అబ్జర్వేషన్‌ గదిలోకి పంపించారు. 


VIDEOS

logo