సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Jan 16, 2021 , 00:47:54

దారి చూపిన జీవాలు

దారి చూపిన జీవాలు

  • నిరుపేద బతుకులకు ఆదరవు
  • మూడేండ్లలో మూడింతలైన 
  • సబ్సిడీ గొర్రెలుఇప్పటివరకు 26,159 మందికి జీవాలు అందజేత
  • నేడు మరో విడుత పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం 
  • హాజరుకానున్న మంత్రులు తలసాని, జగదీశ్‌రెడ్డి
  • గొల్ల, కురుమల కుటుంబాల్లో వెలుగులు నింపిన సర్కారు

మూడేండ్ల కిందటి వరకూ కూలీగా ఉండి ఏరోజుకారోజు పని దేవులాడుకున్న పండుగ వెంకన్న యాదవ్‌ ఇయ్యాల 90 గొర్రెల మందకు యజమాని అయ్యిండు.ఇంటి పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో తన కుటుంబానికి కేసీఆర్‌ సర్కారు ఇచ్చిన గొర్రెలే ఆసరా అయ్యాయని మసిముక్కు అమరమ్మ సంతోషంగా చెబుతున్నది. వాటితోనే ముగ్గురు పిల్లలను చదివించుకుంటున్నట్లు తెలిపింది. కేసీఆర్‌ సారు 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇస్తే ఇప్పుడు మూడు లక్షల మాల్‌ మిలిగిందని మందపొంటి పోతున్న కొమరమల్లు గొప్ప ఆనందంతో చెప్పాడు.

మాడ్గులపల్లికి చెందిన వెంకన్న

యాదవ్‌, అలింగాపురానికి చెందిన అమరమ్మ, తిరుమలగిరికి చెందిన కొమరమల్లునే కాదు బాలెంల సింహాద్రి, గుర్రంపోడు లింగయ్య, నడిగూడెం సతీశ్‌యాదవ్‌, తిప్పర్తి శ్రీరాములుదీ ఇదే మాట. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ గొర్రెలు పొంది ఆర్థికంగా నిలదొక్కుకున్న గొల్లకురుమలంతా చెప్తున్నదీ ఒక్కటే. ఇన్నేండ్లలో తమను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని, కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటామని!!

గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల 

కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. మూడేండ్ల కిందట ప్రారంభమైన ఈ పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో తొలి విడుతగా 26,159 మందికి గొర్రెలు అందాయి. నేడు అవి మూడింతలై వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునిస్తున్నాయి. జిల్లాలో ఇంకా 6,509 మంది లబ్ధిదారులు ఉండగా డీడీలు కట్టిన 2103 మందికి అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  జిల్లా కేంద్రంలోని బత్తాయి మార్కెట్‌లో శనివారం ఉదయం జరిగే 

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 

హాజరుకానున్నారు.  

నల్లగొండ, జనవరి 11 : గొర్రెలు కావాలని డీడీలు చెల్లించిన గొల్ల,కుర్మలందరికీ పంపిణీ చేసేందుకు రాష్ట్ర పభుత్వం ఆదేశాలతో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికార యంత్రాంగం సిద్ధమైంది. నల్లగొండ జిల్లాకేంద్రంలోని బత్తాయి మార్కెట్‌ ఇందుకు వేదిక కాగా.. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లోని 40మంది చొప్పున 240మందితో పాటు తుంగతుర్తి నియోజవర్గం పరిధిలోని శాలిగౌరారం మండలకేంద్రానికి చెందిన 14మందితో కలిపి మొత్తం 254మందికి గొర్రెలు అందజేయనున్నారు. 

2017లో జిల్లా వ్యాప్తంగా 65500 మంది లబ్ధిదారులను గుర్తించగా తొలివిడుత 32750మందిని గుర్తించిన అధికారులు అప్పట్లోనే 26159మందికి గొర్రెలు పంపిణీ చేశారు. మిగిలిన 6509మందిలో డీడీలు చెల్లించిన 2103మందికి నేటి నుంచి అందజేసేలా ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే పశుసంవర్ధశాఖ యంత్రాంగం లబ్ధిదారులతో కలిసి ఆంధ్రాలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గొర్రెల కొనుగోళ్లకు వెళ్లారు. నేటి ఉదయం వాటిని తీసుకొని జిల్లా కేంద్రానికి రానున్నారు. 

ఇప్పటి వరకు 26159మందికి పంపిణీ 

గొల్ల కురుమల జీవన విధానంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2017జూన్‌లో సబ్సిడీ గొర్రెల పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 65500మందిని గుర్తించగా సర్కార్‌ సూచన మేరకు అధికారులు తొలివిడుతగా 32750మందిని ఎంపిక చేశారు. యూనిట్‌ విలువ రూ.1.25లక్షలు కాగా లబ్ధిదారులు తమ వాటాగా రూ.31 250 డీడీలు చెల్లించారు. దీంతో 2017జూన్‌ 23న జిల్లాలో తొలుతగా నల్లగొండ మండలం గుట్టకింది అన్నారం, అన్నారెడ్డి గూడెంలో మంత్రి జగదీశ్‌రెడ్డి గొర్రెల పంపిణీని ప్రారంభించారు. ఏడాదిన్నర వ్యవధిలో 26159మందికి అందించారు. అప్పటికే పొరుగు రాష్ట్రమైన ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గొర్రెల కొరత ఏర్పడడంతో పంపిణీలో మందగమనం మొదలై తర్వాత 2018శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ ప్రక్రియను తిరిగి నేడు ప్రారంభించనున్నారు. 

కూలీ నుంచి 90గొర్రెలకు యజమాని..సబ్సిడీ గొర్రెలతో మారిన బతుకులు

మాడ్గులపల్లి, జనవరి 15 : మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామానికి చెందిన పండుగ వెంకన్నది నిరుపేద కుటుంబం. తనకు గొర్రెలు లేక కూలికి ఇతరుల గొర్లను కాసేవాడు. అలాగే వ్యవసాయ పనులకు వెళ్లేవాడు. ఇలా ఎన్నేండ్లు అని లోలోన బాధపడేవాడు. తనకు గొర్లు ఉంటే బాగుండని మదనపడేవాడు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సబ్సిడీ గొర్రెలు ఇస్తుండని తెలిసి ఆనందపడ్డాడు. గొర్రెల పంపిణీ పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. మొదటి విడుతలోనే 21 గొర్రెలు రావడంతో సంబురపడ్డాడు. ఆ గొర్రెలను కంటికి రెప్పలా సాదుకున్నాడు. మూడెండ్లలో జీవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కూలి నుంచి ఇప్పుడు 90గొర్రెలకు యజమాని అయ్యిండు. జీవాలతో తన కుటుంబానికి ఆర్థికంగా కొండంత ధైర్యం వచ్చిందని పేర్కొన్నాడు.

కల నెరవేరింది..

ఇంతకుముందు మాకు గొర్రెలు లేకుండె. అందుకే వేరేవాళ్ల గొర్రెలు కాసుకుంటూ, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ బతికాం. వచ్చే పైసలతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. మాకు సొంతంగా గొర్లు ఉంటే బాగుండని ఎప్పుడూ అనుకునేటోళ్లం. కేసీఆర్‌ సారు వచ్చిన తరువాత మాకు గొర్లు ఇచ్చిండు. నా కల నెరవేరింది. 21 గొర్రెలు ఇస్తే ఇప్పుడు 90 అయినయి. 

- పండుగ వెంకన్న, కుక్కడం, మాడ్గులపల్లి 

డీడీలు చెల్లించిన అందరికీ గొర్రెలు అందిస్తాం..

తొలి విడుతలో 32750 మందికి గొర్రెలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2017 జూన్‌లో 26159మందికి అందజేశాం. ఎన్నికల కారణంగా పంపిణీ నిలిచిపోగా అప్పటికే మరో 2103మంది డీడీలు చెల్లించారు. వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో నేడు ఒకే రోజు 254మందికి అందజేయనున్నాం.

- శ్రీనివాసరావు, పశుసంవర్ధకశాఖ అధికారి, నల్లగొండ

జీవాలే జీవనాధారం

తిప్పర్తి, జనవరి 15 : గొర్రెల పెంపకం మా వృత్తి. కానీ.. నా దగ్గర డబ్బు లేకపోవడంతో జీవాలను కొనలేకపోయా. మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం సబ్సిడీపై 20గొర్లు, ఒక పొడేలు ఇచ్చింది. వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. ఇప్పటి వరకు 20 జీవాలను అమ్ముకున్నా. లక్షా 50వేల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా నా దగ్గర 30 గొర్లు ఉన్నాయి. అందులో 8 చిన్న పిల్లలు. వాటిని రెండు నెలల్లో అమ్ముకోవచ్చు. ప్రభుత్వం గొర్రెలు ఇవ్వడం వల్ల మా కుటుంబానికి ఆధారం లభించింది. 

- గజ్జి శ్రీరాములు, లక్ష్మీపురం, తిప్పర్తి 

కూలి చేసే బాధలు తప్పినయి..

కుటుంబ పోషణ కోసం నేను గతంలో కూలి పనులు చేసేది. మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం సబ్సిడీపై 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇచ్చింది. వాటితోపాటు మరికొన్ని జీవాలు కొన్నా. గొర్రెలు ఆర్నెళ్లకోసారి ఈనుతున్నాయి. కొన్ని అనారోగ్య కారణాలతో చనిపోయినప్పటికీ ప్రస్తుతం నా దగ్గర వంద వరకు గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు సంతోషంగా బతుకుతున్నాం. కూలికి పోయే బాధలు తప్పినయి. పేదలను గుర్తించి సాయమందించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.

- వట్టె సతీశ్‌యాదవ్‌, నడిగూడెం 

మా కుటుంబానికి ఆసరైంది.. 

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న మా కుటుంబానికి ప్రభుత్వం తొలి విడుతలో సబ్సిడీపై అందజేసిన గొర్రెలు ఆసరయ్యాయి. నా పేరు మీద రూ.32వేల డీడీ చెల్లిస్తే.. ప్రభుత్వం లక్షా 32వేల విలువైన 15 పెద్ద గొర్లు, 4 పిల్ల గొర్లు, 1 పొట్టేలు ఇచ్చింది. వాటిని జాగ్రత్తగా సాదుతున్నా. 10కి పైగా పిల్లలు పుట్టాయి. కొన్ని పొట్టేలు పిల్లలను అమ్మితే మంచి లాభం వచ్చింది. ఆ డబ్బుతో మరిన్ని గొర్లు కొన్నా.. ప్రస్తుతం 40 వరకు ఉన్నాయి. ప్రభుత్వ సాయంతో నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. నా ముగ్గురు కొడుకులను చదివించుకుంటున్నా. గతంలో మాకెవరూ సాయం చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.

- మసిముక్కు అమరమ్మ, అలింగాపురం, పాలకవీడు 

కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

గుర్రంపోడు, జనవరి 15 : గొర్రెల పంపిణీ మొదటి విడుతలో రెండు సంవత్సరాల క్రితం నాకు గొర్రెల యానిట్‌ మంజూరైంది. అప్పుడు ఇచ్చిన 21 గొర్లతో ఇప్పుడు 69 అయ్యాయి. అందులో కొన్ని పొట్టేళ్లను అమ్మాను. ఇప్పుడు 57 గొర్లు ఉన్నాయి. మా కుటుంబానికి భరోసా కల్పించిన సీఎం కేసీఆర్‌కు నా జన్మాంతం రుణపడి ఉంటాం.

- లింగయ్య, తానేదార్‌పల్లి, గుర్రంపోడు 

కేసీఆర్‌ సార్‌ ఇచ్చిన గొర్రెలతోనే బతుకుతున్నాం

సూర్యాపేట రూరల్‌, జనవరి 15 : ఇంతకుమునుపు మాకు గొర్రెలు లేవు. నేను, నా భార్య ఇద్దరం రోజూ కూలి పనులకు పోయేది. కూలి డబ్బులతో కుటుంబం గడిచేది. మొదటి విడుత గొర్రెల పంపిణీలో నాకు ఒక యూనిట్‌ మంజూరైంది. వాటిని సాదుకుంటూ 60 గొర్రెలను చేశాం.  గొర్రెలు ఇచ్చిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.

- కన్నెబోయిన సింహాద్రి, బాలెంల, సూర్యాపేట  

సబ్సిడీ గొర్రెలతో మూడు లక్షల మంద అయ్యింది..

తిరుమలగిరి, జనవరి 15 : ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన గొర్రెలను కంటికి రెప్పలా కాపాడుకున్న. నాకున్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ గొర్రెలను మంచిగా చూసుకున్న. ఇప్పుడు 40 గొర్రెల మంద అయ్యింది. వాటి విలువ మూడు లక్షలకు పైగానే ఉంటుంది. గొర్రెలను కాపాడుకున్నోళ్లకు ఇది లాభసాటి. కేసీఆర్‌ సారు ఉన్నన్ని రోజులు అందరికీ న్యాయం జరుగుతది. 

- కొమరమల్లు యాదవ్‌, తిరుమలగిరి 

VIDEOS

logo