శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 13, 2021 , 01:01:57

వెల్కమ్‌ టు వ్యాక్సిన్‌

వెల్కమ్‌ టు వ్యాక్సిన్‌

నేడు జిల్లా దవాఖానకు కొవిడ్‌-19 టీకా తొలి రోజు టీకా వేసే కేంద్రాలు.. నల్లగొండ జిల్లాలో..జిల్లా ఆస్పత్రిలో 2 కేంద్రాలునార్కట్‌పల్లి కామినేనిలో  2 కేంద్రాలుమిర్యాలగూడ జ్యోతి ఆస్పత్రిలో ఒక కేంద్రం సూర్యాపేట జిల్లాలో... జిల్లా ఆస్పత్రిలో 1రాజీవ్‌నగర్‌ యూపీఎస్‌లో 1హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రిలో 1పండుగ పూట ఉమ్మడి జిల్లా ప్రజలకు ఓశుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొవిడ్‌ 19 టీకా బుధవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లా ఆస్పత్రులకు చేరనున్నది. జిల్లా వ్యాక్సిన్‌ కోల్డ్‌ స్టోర్లలో భద్రపరిచేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16న లాంఛనంగా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా పని చేస్తున్న వైద్యారోగ్య సిబ్బందికి తొలి విడుతలో టీకా ఇవ్వనున్నారు. మొదటి రోజు 240మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు నల్లగొండ జిల్లాలో 5 కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 3 కేంద్రాలను ఎంపిక చేశారు. ఈ నెల 18 నుంచి 24 వరకు ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు, సిబ్బంది, అంగన్‌వాడీలు, ఆశవర్కర్లందరికీ టీకా వేయనున్నారు. చేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతం చేసేలా నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మంగళవారం సమీక్ష నిర్వహించి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

నేడు జిల్లా దవాఖానలకు కొవిడ్‌-19 టీకా

నల్లగొండ ప్రతినిధి, జనవరి 12 (నమస్తే   తెలంగాణ) : జిల్లాలో కరోనా కేసులు వెలుగుచూసిన నాటి నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌పైనే చర్చ జరుగుతున్నది. వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అన్న చర్చ సర్వత్రా వినిపించింది. అనేక పరిశోధనల అనంతరం వ్యాక్సిన్‌ రూపుదిద్దుకున్నది. బుధవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్ర దవాఖానలకు చేరనున్నది. అందుకోసం వ్యాక్సిన్‌ కోల్డ్‌ స్టోర్స్‌ను సిద్ధం చేశారు. తొలి విడుతలో కరోనాపై పోరులో కీలకంగా పనిచేసిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, సిబ్బంది, అంగన్‌వాడీలు, ఆశవర్కర్లకు వేయాలని ఇప్పటికే నిర్ణయించారు. 16నుంచి లాంఛనంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఏర్పాట్లు చకాచకా  జరుగుతున్నాయి. 

తొలిరోజు 240 మందికి..

16న టీకాల కార్యక్రమం ప్రారంభించేందుకు నల్లగొండ జిల్లాలో ఐదు కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో మూడు కేంద్రాలను ఎంపిక చేశారు. ఒక్కోకేంద్రంలో 30మంది చొప్పున మొత్తం 240 మందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని జనరల్‌ దవాఖానలో రెండు, నార్కట్‌పల్లి కామినేనిలో రెండు, మిర్యాలగూడలోని జ్యోతి దవాఖానలో ఒక కేంద్రాన్ని ఎంపికచేశారు. సూర్యాపేట జిల్లాలో జిల్లా ప్రభుత్వ జనరల్‌ దవాఖాన, యూపీఎస్‌ రాజీవ్‌నగర్‌, హుజూర్‌నగర్‌ ఏరియా దవాఖానలను ఎంపిక చేశారు. వీటిలో ప్రతి కేంద్రంలోనూ 30 మందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. 18నుంచి 24వరకు ఎంపికచేసిన వైద్యారోగ్య కేంద్రాల్లో టీకా కార్యక్రమం కొనసాగనున్నది. ఒక్కో కేంద్రంలో రోజూ 100మందికి టీకాలు వేస్తారు. నల్లగొండ జిల్లాలో 47, సూర్యాపేట జిల్లాలో 31వైద్యారోగ్య కేంద్రాల్లో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కోసం వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తారు. తరువాత దశలవారీగా ప్రజలందరికీ కార్యక్రమం కొనసాగనున్నది.  

ప్రత్యేక కేంద్రాల్లో వ్యాక్సిన్‌ నిల్వలు..

జిల్లా కేంద్రాల్లో వ్యాక్సిన్‌ నిల్వ చేసేందుకు ఐస్‌లైన్డ్‌ రిఫ్రిజిరేటర్లు, డీప్‌ ఫ్రీజర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీహెచ్‌సీ స్థాయిలో జిల్లావ్యాప్తంగా కోల్డ్‌ స్టోరేజీ పాయింట్లు ఉన్నాయి. జిల్లా కార్యాలయం నుంచి పీహెచ్‌సీలకు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రానికి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకు జిల్లాలో 41ఐఎల్‌ఆర్‌, 41 డీఎఫ్‌లు అందుబాటులో ఉంచారు. అదనంగా 25 ఐఎల్‌ఆర్‌, 5డీఎఫ్‌(లార్జ్‌)లు ఏర్పాటుచేశారు. అవసరాలకు అనుగుణంగా 65కోల్డ్‌బాక్స్‌లు తీసుకొచ్చారు. 800 వ్యాక్సిన్‌ క్యారియర్స్‌, 20 డీప్‌ ఫ్రిజ్‌లు, 4కూలర్లను సైతం సిద్ధం చేశారు. 

టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు.. 

వ్యాక్సిన్‌ పంపిణీకి జిల్లానుంచి మండల స్థాయి వరకు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటుచేశారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి చైర్మన్‌గా, కలెక్టర్‌ పీజే పాటిల్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా, జిల్లా పరిషత్‌ సీఈఓ కన్వీనర్‌గా, అదనపు కలెక్టర్‌  రాహుల్‌ శర్మ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కొండల్‌రావు, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డితోపాటు వైద్యారోగ్యశాఖలోని ప్రోగ్రాం అధికారులను సభ్యులుగా చేర్చారు. మండలస్థాయిలో ఎంపీపీ చైర్‌పర్సన్‌గా, ఎంపీడీఓ కన్వీనర్‌గా, పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌, ఎంపీఓ, మహిళా సంక్షేమాధికారితో కమిటీ ఏర్పాటు చేశారు.  

11,036 ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌.. 

తొలి విడుత వ్యాక్సిన్‌ పంపిణీకి జిల్లా వైద్యారోగ్యశాఖ, ప్రభుత్వ జనరల్‌, ప్రైవేటు దవాఖానల వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లకు వ్యాక్సిన్‌ వేయనున్నారు. వీరందరినీ కలిపి 11036 మందితో జాబితా సిద్ధం చేశారు. వీరంతా ముందుగానే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

వ్యాక్సినేషన్‌లో ముఖ్యంశాలు 

 • వ్యాక్సిన్‌ నేడు జిల్లాకు చేరనున్నది. పీహెచ్‌సీలకు చేరవేయడం డిప్యూటీ డీఎంహెచ్‌ఓల బాధ్యత.
 • జిల్లాలో ఈనెల 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తారు. వ్యాక్సిన్‌ కేంద్రాల్లో పర్యవేక్షణకు వెబ్‌కెమెరాలు, టీవీలు ఏర్పాటుచేస్తారు. 
 • 18నుంచి రోజుకు వందమందికి చొప్పున వ్యాక్సినేషన్‌ చేస్తారు. 
 • మొదటిదశలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, ఆశలు, అంగన్‌వాడీలకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. 
 • నల్లగొండ జిల్లాలో తొలి విడుతగా మొత్తం 11,036మందికి, సూర్యాపేట జిల్లాలో 2794మందికి వ్యాక్సిన్‌. 
 • మొదటి డోస్‌తోపాటు రెండోడోస్‌ కూడా ఓకేసారి జిల్లాకు రానున్నది. 
 • ఒక వాయిల్స్‌లో ఐదుగురికి వ్యాక్సిన్‌  
 • జిల్లాలోని మొత్తం 47కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌కు ఏర్పాట్లు. 
 • ఒక్కో కేంద్రంలో నలుగురు వ్యాక్సినేటర్‌ ఆఫీసర్లు, ఒక వ్యాక్సినేషన్‌ ఆఫీసర్‌, ఒక ఏఎన్‌ఎం, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్‌, ముగ్గురు ఆశలు ఉంటారు.  
 •  వ్యాక్సినేషన్‌ అనంతరం వచ్చే సమస్యలను మూడు రకాలుగా విభజించారు. 
 •  అబ్జర్వేషన్‌ గదిని మూడు రకాలు అంటే మిడిల్‌(ఆశలు, ఏఎన్‌ఎంలు పీహెచ్‌సీ సిబ్బంది పరిష్కారం), సివియర్‌(ఏరియా ఆసుపత్రి), సీరియస్‌(హైదరాబాద్‌కు తరలింపు)గా చూస్తారు.

VIDEOS

logo